రీఎంట్రీలో రిషభ్‌ పంత్‌ ఫెయిల్‌.. భారత్‌ ఆలౌట్‌.. స్కోరెంతంటే? | IND A vs SA A 1st Unofficial Test: Pant Fails In Re Entry Ind All Out Score | Sakshi
Sakshi News home page

IND vs SA: రీఎంట్రీలో రిషభ్‌ పంత్‌ ఫెయిల్‌.. భారత్‌ ఆలౌట్‌.. .. స్కోరెంతంటే?

Oct 31 2025 4:07 PM | Updated on Oct 31 2025 4:26 PM

IND A vs SA A 1st Unofficial Test: Pant Fails In Re Entry Ind All Out Score

PC: X

దాదాపు మూడు నెలల విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) విఫలమయ్యాడు. సౌతాఫ్రికా-‘ఎ’ జట్టుతో భారత్‌-‘ఎ’ (IND A vs SA A) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పూర్తిగా నిరాశపరిచాడు.

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పంత్‌.. 20 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో కేవలం 17 పరుగులే చేసి నిష్క్రమించాడు. సౌతాఫ్రికా బౌలర్‌ ఒకులే సిలీ బౌలింగ్‌లో జుబేర్‌ హంజాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ మేరకు రీఎంట్రీలో రిషభ్‌ పంత్‌ ఇలా అట్టర్ ఫ్లాప్‌ అయ్యాడు.

కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌ రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా భారత్‌- ‘ఎ’- సౌతాఫ్రికా -‘ఎ’ జట్ల మధ్య గురువారం బెంగళూరు వేదికగా తొలి అనధికారిక టెస్టు మొదలైంది. 

తొలిరోజు ఇలా
టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది దక్షిణాఫ్రికా ‘ఎ’. భారత ఆఫ్‌ స్పిన్నర్‌ తనుశ్‌ కొటియాన్‌ (4/83) సత్తా చాటడంతో గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. 

జోర్డాన్‌ హెర్మాన్‌  (141 బంతుల్లో 71; 8 ఫోర్లు), జుబేర్‌ హమ్జా (109 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్‌), రుబిన్‌ హెర్మాన్‌ (87 బంతుల్లో 54; 6 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. 

హెర్మాన్‌ బ్రదర్స్‌ అదుర్స్‌ 
జోర్డాన్‌ హెర్మాన్, జుబేర్‌ హమ్జా రెండో వికెట్‌కు 132 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుకు మంచి ఆరంభం లభించగా... ఆ తర్వాత మన బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. 

గుర్‌నూర్‌ బ్రార్‌ (1/45) బౌలింగ్‌లో ర్యాంప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన హంజా కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ అకెర్‌మన్‌ (18) ఎక్కువసేపు నిలవలేకపోగా... మూన్‌స్వామి (5) విఫలమయ్యాడు.

ఈ దశలో జోర్డాన్‌ హెర్మాన్‌ సోదరుడు రుబిన్‌ హెర్మాన్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. టియాన్‌ వాన్‌ వురెన్‌ (75 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. భారత ‘ఎ’ బౌలర్లలో తనుశ్‌ కొటియాన్‌ 4 వికెట్లు పడగొట్టగా... మానవ్‌ సుతార్‌ 2 వికెట్లు తీశాడు. ఖలీల్‌ అహ్మద్, అన్షుల్‌ కంబోజ్, గుర్‌నూర్‌ బ్రార్‌ తలా ఒక వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. 

309 పరుగులకు ఆలౌట్‌
ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటను 299/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా పది పరుగులు జోడించి ఆలౌట్‌ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 91.2 ఓవర్లలో 309 పరుగులు సాధించింది.

ఆయుశ్‌ మాత్రే హాఫ్‌ సెంచరీ
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్‌-‘ఎ’కు ఓపెనర్లు సాయి సుదర్శన్‌, ఆయుశ్‌ మాత్రే శుభారంభం అందించారు. ఆయుశ్‌ అర్ధ శతకం (65)తో మెరవగా.. సాయి 32 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ (6), ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన రజత్‌ పాటిదార్‌ (19), రిషభ్‌ పంత్‌ (17) పూర్తిగా విఫలమయ్యారు. 

మిగతా వారిలో ఆయుశ్‌ బదోని 38 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ తనుశ్‌ కొటియాన్‌ 13 పరుగులు చేయగా.. మానవ్‌ సుతార్‌ 4, అన్షుల్‌ కాంబోజ్‌ 5 పరుగులకే పెవిలియన్‌ చేరారు.  ఖలీల్‌ అహ్మద్‌ నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్‌గా వెనుదిరిగాడు. 

భారత్‌ ఆలౌట్‌.. స్కోరెంతంటే?
ఫలితంగా భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 58 ఓవర్లు ఆడి 234 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుకు 75 పరుగుల ఆధిక్యం లభించింది. సఫారీ బౌలర్లలో ప్రెనెలాన్‌ సుబ్రయేన్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. షెపో మొరేకి, ఒకులే సిలీ, టియాన్‌ వాన్‌ వారెన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. లుతో సింపాలా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

చదవండి: కేకేఆర్‌లోకి రోహిత్‌ శర్మ ‘కన్‌ఫామ్‌’!.. స్పందించిన ముంబై ఇండియన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement