 
															రోహిత్ శర్మ (PC: MI)
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించింది ముంబై ఇండియన్స్. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ సారథి రోహిత్‌ను కాదని హార్దిక్ (Hardik Pandya)కు పగ్గాలు అప్పగించింది.
ఈ నేపథ్యంలో అవమానభారంతో కుంగిపోయిన రోహిత్ శర్మ 2025లో ముంబై జట్టును వీడతాడనే ప్రచారం జరిగింది. అయితే, ఊహించని విధంగా హిట్‌మ్యాన్ అంబానీల సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగాడు. ఈ ఏడాది అదే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
కేకేఆర్‌లోకి రోహిత్ శర్మ!
ఐపీఎల్-2025 వేలానికి ముందు ముంబై రోహిత్‌ను రూ. 16.30 కోట్లతో రిటైర్ చేసుకుంది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినందున తనకు ఇది సరైన ధరేనని అతడు స్వయంగా వ్యాఖ్యానించడం విశేషం. అయితే, తాజాగా రోహిత్ శర్మ జట్టు మార్పు గురించి మరో వార్త తెర మీదకు వచ్చింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్టే ఇందుకు కారణం. కాగా ఆస్ట్రేలియా ఇటీవలి వన్డే సిరీస్‌లో విజృంభించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే.
ప్రపంచ నంబర్‌వన్ వన్డే బ్యాటర్‌గా
సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించిన రోహిత్ శర్మ ప్రపంచ నంబర్‌వన్ వన్డే బ్యాటర్‌గా నిలవడం మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం. సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన ఐదో భారతీయ క్రికెటర్‌గా రోహిత్ గుర్తింపు పొందాడు. 
ఆసీస్‌తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 202 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన 38 ఏళ్ల రోహిత్... తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగు పరుచుకొని ‘టాప్’ ప్లేస్ దక్కించుకున్నాడు. రోహిత్ 781 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలవగా... భారత వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (745 పాయింట్లు) రెండు స్థానాలు కోల్పోయి మూడో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు.
కన్‌ఫామ్ అంటూ కేకేఆర్ పోస్ట్
ఈ నేపథ్యంలో కేకేఆర్.. ‘‘పురుషుల వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ కన్‌ఫామ్’’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో రోహిత్ శర్మ కేకేఆర్‌లో చేరుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇందుకు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వింగ్ గట్టిగానే బదులిచ్చింది.
స్పందించిన ముంబై
రోహిత్ శర్మ ఫొటోను పంచుకుంటూ.. ‘‘సూర్యుడు రేపు ఉదయించడం నిజమే.. కానీ రాత్రి (K)night మాత్రం సూర్యుడు రావడం కుదరదు. ఇది అసాధ్యం కూడా’’ అంటూ హిట్‌మ్యాన్ తమతోనే ఉంటాడన్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. 
కాగా రోహిత్ శర్మ ప్రాణ స్నేహితుడు, ఫిట్‌నెస్ కోచ్ అభిషేక్ నాయర్ కేకేఆర్ హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్ జట్టు మార్పు ఉంటుందేమోననే సందేహాలు నెలకొనగా.. ముంబై ఫ్రాంఛైజీ ఇలా స్పష్టతనిచ్చేసింది.
చదవండి: ఆమె ఒక అద్భుతం.. జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయి: భారత కెప్టెన్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
