ఆమె ఒక అద్భుతం.. జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయి: భారత కెప్టెన్‌ | India enter Women’s World Cup 2025 Final! Harmanpreet praises Jemimah’s heroics | Sakshi
Sakshi News home page

ఆమె ఒక అద్భుతం.. జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయి: భారత కెప్టెన్‌

Oct 31 2025 11:20 AM | Updated on Oct 31 2025 12:38 PM

Very Proud: Harmanpreet Reveals What Jemimah Told Her During Batting Semi Final

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. నవీ ముంబైలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో పటిష్ట ఆస్ట్రేలియా (IND vs AUS)పై చారిత్రాత్మక విజయంతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (Harmanpreet Kaur) స్పందిస్తూ.. జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేసింది.

ఇదొక అద్బుతమైన భావన
ఆసీస్‌పై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా గర్వంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా. చాలా ఏళ్లుగా మేము ఎంతో కష్టపడి ఇక్కడి దాకా చేరుకున్నాం. ఇదొక అద్బుతమైన భావన.

ఈ టోర్నమెంట్‌ ఆరంభంలోనే మేము కొన్ని తప్పులు చేశాం. వాటిని సరిదిద్దుకుని ఈరోజు గెలిచి నిలిచాం. ఆఖరి వరకు మ్యాచ్‌ తీసుకురాకుండా.. ఇంకాస్త ముందుగానే మ్యాచ్‌ ముగిస్తే బాగుండనిపించింది. 

కానీ అలా తొందరపాటు చర్యలకు పాల్పడితే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. ప్రణాళికలను పక్కాగా అమలు చేసి ఫలితాన్ని మాకు అనుకూలంగా మార్చుకున్నాం’’ అని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సంతృప్తి వ్యక్తం చేసింది.

జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయి
ఇక సెంచరీ హీరో జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues) గురించి ప్రస్తావన రాగా.. ‘‘జట్టు కోసం తాపత్రయపడే ప్లేయర్లలో జెమీమా ముందుంటుంది. బాధ్యత తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడదు. ఈరోజు తను అత్యంత ప్రత్యేకమైన నాక్‌ ఆడింది.

పిచ్‌పై మేమిద్దరం ఆటను ఆస్వాదించాము. కలిసి బ్యాటింగ్‌ చేస్తున్నపుడల్లా ఒకరికొకరం మద్దతుగా ఉంటూ.. సమీకరణల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ఈరోజు కూడా జెమీమా అన్నీ లెక్కలు వేసుకుంటూ నన్ను అప్రమత్తం చేస్తూనే ఉంది.

‘ఐదు పరుగులు వచ్చాయి.. ఇంకో రెండే బంతులు మిగిలి ఉన్నాయి’ అంటూ ఇలా ప్రతీది కచ్చితంగా గుర్తుపెట్టుకుని నాతో చెబుతూ ఉంది. ఆట, జట్టు పట్ల తనకు ఉన్న అంకిత భావానికి ఇది నిదర్శనం.

తనతో కలిసి బ్యాటింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తా. జెమీమా ఆలోచనా తీరు, అద్భుత ఆట తీరును చూసి నేను ఆశ్చర్యపోయా. నన్ను కూడా ముందుకు నడిపించాలనే సంకల్పంతో తను ఇన్‌పుట్స్‌ ఇచ్చిన తీరు అద్భుతం. ఈ విజయంలో క్రెడిట్‌ తనకే ఇచ్చి తీరాలి’’ అని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రశంసల జల్లు కురిపించింది.

కీలక పోరులో గెలిచి ఫైనల్‌కు
కాగా నవీ ముంబైలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా... భారత్‌ 48.3 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ అజేయ శతకం (127)తో సత్తా చాటగా.. హర్మన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (88 బంతుల్లో 89) ఆడింది. వీరి ద్దరు కలిసి 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫైనల్లో టీమిండియా నవీ ముంబై వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది.

చదవండి: రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదు: జెమీమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement