రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదు: జెమీమా కన్నీటి పర్యంతం | Jemimah Rodrigues Overcomes Adversity To Lead India To Victory In ICC Women World Cup 2025 Semifinal, Emotional Video Viral | Sakshi
Sakshi News home page

Jemimah Rodrigues Emotional Video: రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదు

Oct 31 2025 9:44 AM | Updated on Oct 31 2025 10:53 AM

I was crying every day: Jemimah A True All Rounder Who Powered India To Final

నాలుగేళ్ల వయసులోనే ఆమె బ్యాట్‌ పట్టింది.. తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది.. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది..

కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటర్‌.. జట్టుకు అవసరమైన వేళ తన స్పిన్‌ మాయాజాలంతోనూ మెరవగలదు.. అంతర్జాతీయ స్థాయిలో జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు ఎల్లప్పుడూ ఆమె ముందే ఉంటుంది..

కానీ ఊహించని రీతిలో కొన్నాళ్ల క్రితం ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. కారణం ఎవరైనా.. ఆరోపణలు ఏవైనా కానీ.. జింఖానా క్లబ్‌లో ఆమెకున్న సభ్యత్వాన్ని రద్దు చేశారు.. ఆమె తండ్రి మతపరమైన సమావేశాలు పెట్టి ఆటగాళ్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో ఆమెను పక్కనపెట్టారు..

దీంతో ఆమె డిప్రెషన్‌లో కూరుకుపోయింది.. క్రికెట్‌నే వదిలేద్దామా అన్నంతగా కుంగిపోయింది.. ఆ సమయంలో స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు.. థెరపీ తీసుకుని ముందుగా మైదానంలో బ్యాట్‌తో మళ్లీ మెరుపులు మెరిపించాలంటూ ప్రోత్సహించారు..

ఆమె కోలుకుంది.. దేశం కోసం ఆడాలనే దృఢ సంకల్పానికి ఇలాంటి ఆరోపణల తాలుకు ప్రభావం అడ్డుకాకూడదని తనను తాను సముదాయించుకుంది.. మాతృభూమి కోసం అవాంతరాలను అధిగమించి ఈరోజు దేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.. ఆమే జెమీమా రోడ్రిగ్స్‌.

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025లో దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో వీరోచిత పోరాటంతో భారత్‌ను గెలిపించింది. భారీ లక్ష్యం, ముఖాముఖి రికార్డులు ఒత్తిడికి గురిచేస్తున్నా సొంత మైదానం (నవీ ముంబై)లో ప్రేక్షకుల మద్దతుతో ఆకాశమే హద్దుగా చెలరేగి.. తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.

అజేయ శతకంతో
అనుకోని విధంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ రావాల్సి వచ్చినా.. ఆత్మవిశ్వాసంతో క్రీజులో కుదురుకుని అజేయ శతకం బాదింది. 134 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత్‌కు ఫైనల్‌ బెర్తును ఖరారు చేసి.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకుంది.

ఈ క్రమంలో పాతికేళ్ల జెమీమా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. గత కొన్ని నెలలుగా ఆమె అనుభవించిన మానసిక క్షోభ ఇందుకు కారణం. మ్యాచ్‌ గెలవగానే తండ్రిని హత్తుకుని ఆమె ఏడ్చిన తీరు ఆమె వేదనకు అద్దం పట్టింది.

 

ప్రతీరోజు ఏడ్చాను
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న అనంతరం జెమీమా మాట్లాడుతూ.. ‘‘జీసస్‌కు నా కృతజ్ఞతలు. ఆయన సహకారం లేకపోతే నా ఒక్కదాని వల్ల కాకపోయేది. పట్టుదలగా నిలబడితే చాలు దేవుడే నా తరఫున పోరాడతాడనే బైబిల్‌లోని ఒక వాక్యాన్ని మ్యాచ్‌ చివరి క్షణాల్లో మళ్లీ మళ్లీ చదువుకున్నాను. 

నా సొంతంగా నేను ఏమీ చేయలేదు కాబట్టి గెలిపించాననే మాట చెప్పను. ఈ టోర్నీ ఆసాంతం మానసికంగా చాలా వేదనకు గురయ్యాను. దాదాపు ప్రతీరోజు ఏడ్చాను. కానీ దేవుడే అంతా చూసుకున్నాడు.

నాసెంచరీకి ప్రాధాన్యత లేదు
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాననే విషయం మ్యాచ్‌కు ముందు తెలీదు. నాసెంచరీకి ప్రాధాన్యత లేదు. జట్టు గెలవడమే ముఖ్యం. నేను క్రీజ్‌లో ఇబ్బంది పడుతుండగా సహచరులు అండగా నిలిచారు. అభిమానుల ప్రోత్సాహం బాధను దూరం చేసింది. 

అందుకే విజయం సాధించగానే  భావోద్వేగాలను నియంత్రించుకోలేక బాగా ఏడ్చేశాను’’ అని ఉద్వేగానికి లోనైంది. ఈ నేపథ్యంలో భారత ట్టు అభిమానులు ఆమెకు అండగా నిలుస్తున్నారు. ‘‘ఏడవద్దు జెమీమా.. సగర్వంగా తలెత్తుకో చాంపియన్‌’’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: IND Beat AUS In Semis: ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement