జెమీమా తుఝే సలామ్‌ | Jemimah takes India to improbable chase, hosts in final | Sakshi
Sakshi News home page

జెమీమా తుఝే సలామ్‌

Oct 30 2025 11:08 PM | Updated on Oct 31 2025 1:26 AM

Jemimah takes India to improbable chase, hosts in final

వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో భారత్‌

సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్లతో విజయం 

అజేయ సెంచరీతో చెలరేగిన జెమీమా రోడ్రిగ్స్‌ 

హర్మన్‌ప్రీత్‌ కీలక ఇన్నింగ్స్‌ 

ఆదివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్లో ‘ఢీ’  

అద్భుతం అనే మాట చాలా చిన్నదిగా అనిపిస్తోంది... ఈ అసాధారణ ప్రదర్శనను వర్ణించాలంటే అది సరిపోదు... ఎదురుగా ఉన్నది ఎదురు లేకుండా సాగుతున్న ప్రత్యర్థి... డిఫెండింగ్‌ చాంపియన్‌... ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్‌ను గెలుచుకునే తత్వం... మన ముందు ఏకంగా 339 పరుగుల లక్ష్యం...మహిళల వన్డే చరిత్రలో ఏ జట్టూ ఇంత లక్ష్యాన్ని  ఛేదించలేదు... షఫాలీ విఫలం కాగా, టాప్‌ బ్యాటర్‌ స్మృతి ఆరంభంలోనే వెనుదిరిగింది... కానీ జెమీమా, హర్మన్‌ గట్టిగా నిలబడ్డారు... ఒత్తిడిని దరి చేరనీయకుండా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్లారు... 

కీలక సమయాల్లో ఆసీస్‌ మళ్లీ పైచేయి సాధిస్తూ సవాల్‌ విసురుతోంది... గతంలో ఎన్నో సార్లు ఇలాంటి సందర్భాల్లో కుప్పకూలిన జ్ఞాపకాలు... గెలుపునకు చేరువవుతున్నట్లే కనిపించింది... కానీ ఒక్కో వికెట్‌ పడుతుండటంతో ఉత్కంఠ... కానీ చివరకు అమన్‌జోత్‌ షాట్‌తో టీమ్‌లో సంబరాలు... పైకి కఠినంగా కనిపించే కెప్టెన్‌ కూడా కన్నీళ్లపర్యంతం... అంతటా ఆనందం, ఆనందబాష్పాలు...

ఏడేళ్ల వన్డే కెరీర్‌... తొలి వన్డే ప్రపంచ కప్‌... టోర్నీకి ముందు చక్కటి ఫామ్‌... కెరీర్‌లో రెండు సెంచరీలు ఈ ఏడాదే వచ్చాయి... అయితే వరల్డ్‌ కప్‌లో వరుస వైఫల్యాలు... తొలి 3 మ్యాచ్‌లలో 2 డకౌట్లు... మీడియాతో మాట్లాడినంత సేపు కూడా క్రీజ్‌లో నిలవడం లేదని వ్యాఖ్యలు... ఆటకంటే పాటలు, డ్యాన్స్‌లపైనే దృష్టి అనే విమర్శలు... ఒక మ్యాచ్‌లో ఆడించకుండా పక్కన పెట్టేశారు కూడా... కానీ జెమీమా రోడ్రిగ్స్‌ తన జీవితంలో అత్యంత విలువైన ఆటను అసలు వేదికపై ఆడింది. 

తీవ్ర ఒత్తిడి ఉండే నాకౌట్‌ మ్యాచ్‌లో రెండో ఓవర్లోనే క్రీజ్‌లోకి... గతంలో కీలక సమయాల్లో మ్యాచ్‌ను కోల్పోయిన గుర్తులు... కానీ ఆమె ‘జెమ్‌’లాంటి ప్రదర్శనతో తన విలువను చూపించింది. శతకాన్ని దాటి అలసటతో బాధపడుతున్నా చివరి వరకు పోరాడింది.. మరచిపోలేని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో చరిత్రలో తన పేరు లిఖించుకుంది.   

నవీ ముంబై: వన్డే వరల్డ్‌ కప్‌లో భారత జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. అసాధారణ ప్రదర్శనతో ఆ్రస్టేలియాపై ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు ఆఖరి పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్‌ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆ్రస్టేలియాను ఓడించింది. 

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (93 బంతుల్లో 119; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా...ఎలైస్‌ పెరీ (88 బంతుల్లో 77; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లీ గార్డ్‌నర్‌ (45 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్‌ 48.3 ఓవర్లలో 5 వికెట్లకు 341 పరుగులు సాధించింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెమీమా రోడ్రిగ్స్‌ (134 బంతుల్లో 127 నాటౌట్‌; 14 ఫోర్లు) అద్భుత శతకానికి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (88 బంతుల్లో 89; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచింది. వీరిద్దరు 156 బంతుల్లోనే 167 పరుగులు జోడించారు.  

భారత్‌ జోరు... 
టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడిన షఫాలీ వర్మ (5 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... స్మృతి మంధాన (24 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా హీలీ చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగింది. కానీ ఈ దశలో జత కలిసిన జెమీమా, హర్మన్‌ అసాధారణ పట్టుదల కనబర్చారు. 57 బంతుల్లో జెమీమా, 65 బంతుల్లో హర్మన్‌ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

భారీ భాగ స్వామ్యం తర్వాత ఎట్టకేలకు హర్మన్‌ను అవుట్‌ చేయడంలో ఆసీస్‌ సఫలమైంది. అయితే జెమీమా మాత్రం ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. 115 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న ఆమె... దీప్తి శర్మ (17 బంతుల్లో 24; 3 ఫోర్లు), రిచా (16 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అమన్‌జోత్‌ (8 బంతుల్లో 15 నాటౌట్‌; 2 ఫోర్లు) సహకారంతో జట్టును విజయం దిశగా నడిపించింది. 

జీసస్‌కు నా కృతజ్ఞతలు. ఆయన సహకారం లేకపోతే నా ఒక్కదాని వల్ల కాకపోయేది. పట్టుదలగా నిలబడితే చాలు దేవుడే నా తరఫున పోరాడతాడనే బైబిల్‌లోని ఒక వాక్యాన్ని మ్యాచ్‌ చివరి క్షణాల్లో మళ్లీ మళ్లీ చదువుకున్నాను. నా సొంతంగా నేను ఏమీ చేయలేదు కాబట్టి గెలిపించాననే మాట చెప్పను. ఈ టోర్నీ ఆసాంతం మానసికంగా చాలా వేదనకు గురయ్యాను. దాదాపు ప్రతీరోజు ఏడ్చాను. కానీ దేవుడే అంతా చూసుకున్నాడు. 

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాననే విషయం మ్యాచ్‌కు ముందు తెలీదు. నాసెంచరీకి ప్రాధాన్యత లేదు. జట్టు గెలవడమే ముఖ్యం. నేను క్రీజ్‌లో ఇబ్బంది పడుతుండగా సహచరులు అండగా నిలిచారు. అభిమానుల ప్రోత్సాహం బాధను దూరం చేసింది. అందుకే విజయం సాధించగానే  భావోద్వేగాలను నియంత్రించుకోలేక బాగా ఏడ్చేశాను. –జెమీమా రోడ్రిగ్స్‌  

339 
మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా భారత్‌ రికార్డు నెలకొల్పింది. ఇదే ప్రపంచకప్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆ్రస్టేలియా ఛేదించి వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ఆసీస్‌ పేరిట ఉన్న రికార్డును భారత్‌ బద్దలు కొట్టింది.

‘కప్‌’ వదిలేసిన హీలీ... 
జెమీమా అద్భుత ఇన్నింగ్స్‌కు అదృష్టం కూడా కలిసొచ్చింది. 61 పరుగుల వద్ద ఆమె ఇచి్చన కష్టసాధ్యమైన క్యాచ్‌ను వదిలేసిన హీలీ, ఆ తర్వాత 82 వద్ద జీవితంలో మర్చిపోలేని తప్పు చేసింది. జెమీమా స్వీప్‌ చేయగా బంతి అక్కడే గాల్లోకి లేచింది. ఈ అతి సునాయాస క్యాచ్‌ను హీలీ జారవిడిచింది. 41 బంతుల్లో భారత్‌ 55 పరుగులు చేయాల్సిన స్థితిలో తాలియా (జెమీమా స్కోరు 106) మరో సునాయాస క్యాచ్‌ వదిలేసింది. ఈ దశలో జెమీమా అవుటైనా...పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేదేమో!  

స్కోరు వివరాలు  
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: అలీసా హీలీ (బి) క్రాంతి 5; లిచ్‌ఫీల్డ్‌ (బి) అమన్‌జోత్‌ 119; పెరీ (బి) రాధ 77; మూనీ (సి) జెమీమా (బి) శ్రీచరణి 24; సదర్లాండ్‌ (సి అండ్‌ బి) శ్రీచరణి 3; గార్డ్‌నర్‌ (రనౌట్‌) 63; తాలియా మెక్‌గ్రాత్‌ (రనౌట్‌) 12; కిమ్‌ గార్త్‌ (రనౌట్‌) 17; అలానా కింగ్‌ (సి) రిచా (బి) దీప్తి 4; మోలినో (బి) దీప్తి 0; షుట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్‌) 338. వికెట్ల పతనం: 1–25, 2–180, 3–220, 4–228, 5–243, 6–265, 7–331, 8–336, 9–336, 10–338.  బౌలింగ్‌: రేణుక 8–0–39–0, క్రాంతి 6–0–58–1, శ్రీచరణి 10–0–49–2, దీప్తి 9.5–0–73–2, అమన్‌జోత్‌ 8–0–51–1, రాధ 8–0–66–1.  

భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (ఎల్బీ) (బి) గార్త్‌ 10; స్మృతి (సి) హీలీ (బి) గార్త్‌ 24; జెమీమా (నాటౌట్‌) 127; హర్మన్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) సదర్లాండ్‌ 89; దీప్తి (రనౌట్‌) 24; రిచా (సి) గార్త్‌ (బి) సదర్లాండ్‌ 26; అమన్‌జోత్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (48.3 ఓవర్లలో 5 వికెట్లకు) 341. వికెట్ల పతనం: 1–13, 2–59, 3–226, 4–264, 5–310.  బౌలింగ్‌: షుట్‌ 6–0–40–0, గార్త్‌ 7–0–46–2, గార్డ్‌నర్‌ 8–0–55–0, మోలినో 6.3–0–44–0, సదర్లాండ్‌ 10–0–69–2, అలానా 9–0–58–0, తాలియా 2–0–19–0.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement