భారత టీ20 జట్టులో శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అవసరమా?.. క్రికెట్ వర్గాల్లో చాన్నాళ్లుగా ఇదే చర్చ. టెస్టు, వన్డేల్లో సత్తా చాటుతూ ఏకంగా కెప్టెన్‌గా ఎదిగిన ఈ పంజాబీ బ్యాటర్.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోవడం ఇందుకు కారణం.
దాదాపు ఏడాది కాలం పాటు భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్న గిల్‌ను.. సెలక్టర్లు ఆసియా కప్ సందర్భంగా వైస్ కెప్టెన్‌గా తిరిగి తీసుకువచ్చారు. దీంతో అప్పటిదాకా ఓపెనింగ్ జోడీగా పాతుకుపోయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma)- సంజూ శాంసన్ (Sanju Samson) విడిపోయారు.
అంతంత మాత్రమే
గిల్ ఓపెనర్‌గా రీఎంట్రీ ఇవ్వగా.. సంజూకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రత్యేక స్థానం అంటూ లేకుండా పోయింది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ గిల్ మరోసారి టీ20 ఫార్మాట్లో తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా కేవలం 132 పరుగులే చేశాడు.
ఈ నేపథ్యంలో మరోసారి గిల్ విమర్శలు పాలయ్యాడు. అతడి కారణంగా సంజూ శాంసన్‌తో పాటు యశస్వి జైస్వాల్ కూడా మూల్యం చెల్లించాల్సి వస్తోందని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత టీ20 ఓపెనింగ్ జోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
అశ్ కీ బాత్‌లో మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్‌కు.. టీ20లకు ఎలాంటి పోలికా ఉండదు. ప్రతి ఫార్మాట్ దేనికదే ప్రత్యేకం. ఏదేమైనా రెండు ఫార్మాట్లలో జైస్వాల్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు.
పవర్ ప్లేలో సూపర్
టెస్టుల్లో పరుగులు చేయడం ద్వారా అతడు టీ20 జట్టులోకి రాలేడు. కానీ ఇప్పటికే పొట్టి క్రికెట్‌లో అతడికి మంచి రికార్డు ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 160కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో సూపర్‌గా ఆడతాడు.
అతడి సగటు కూడా బాగుంది. ప్రస్తుతం అభిషేక్ శర్మతో పాటు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగల సత్తా జైస్వాల్‌కే ఉంది. ఒకవేళ టీమిండియా అగ్రెసివ్ ఓపెనర్లను కోరుకుంటే వీళ్లిద్దరే సరిజోడి. అలా కాకుండా ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ కావాలనుకుంటే అభిషేక్- గిల్ జోడీవైపు మొగ్గు చూపవచ్చు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
వాళ్లిద్దరే సరి జోడీ
అభిషేక్ శర్మ దూకుడుగా ఆడితే.. గిల్ మాత్రం నెమ్మదిగా ఆడతాడనే ఉద్దేశంలో అశూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇటీవల మరో మాజీ క్రికెటర్ రమేశ్ సదగోపన్ మాట్లాడుతూ.. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌లో గిల్.. టేబుల్ ఫ్యాన్‌ను తలపిస్తున్నాడంటూ విమర్శించిన విషయం తెలిసిందే.
తుఫాన్ ఉన్నంత వరకు టేబుల్ ఫ్యాన్‌పై దృష్టి పడదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న టీమిండియా.. స్వదేశంలో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమైంది.
చదవండి: భారత జట్టులో ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటు.. కారణం ఇదే


