యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జయం సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై 14 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ తొలి యాషెస్ టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్‌పై ఇరు జట్లు బౌలర్లు నిప్పులు చెరిగారు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. దీని బట్టి ఎంసీజీ వికెట్ బ్యాటర్లకు ఎంతకష్టతరంగా మారిందో ఆర్ధం చేసుకోవచ్చు. కేవలం రెండు రోజుల్లోనే మొత్తం 36 వికెట్లు నేలకూలాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లండ్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యం సంపాదించిన స్మిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్‌లో విఫలమైంది.
ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరగడంతో కేవలం 132 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచిగల్గింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది.
ఇక ఈ చారిత్రత్మక విజయంపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. తమ జట్టుపై స్టోక్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదేవిధంగా ఇటువంటి పిచ్‌ను తను ఇప్పటివరకు చూడలేదని అతడు చెప్పుకొచ్చాడు.
చాలా సంతోషంగా ఉన్నా..
"ఆస్ట్రేలియాలో సుదీర్ఘ కాలం తర్వాత విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికే సిరీస్ కోల్పోయినప్పటికి ఎట్టకేలకు సరైన ట్రాక్‌లో పడ్డాము. చివరి మ్యాచ్‌లో కూడా ఇదే జోరును కొనసాగిస్తాము. ఈ మ్యాచ్‌లో మా కుర్రాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
కేవలం జట్టు కోసమో, మా కోసమో ఆడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా మా వెన్నంటి ఉండి ప్రోత్సహించే లక్షలాది మంది అభిమానుల కోసం ఆడుతున్నాం. ఎక్కడికి వెళ్లినా మాకు లభించే మద్దుతు మాలో కొత్త ఉత్సహాన్ని నింపుతోంది. ఈ విజయం మా అభిమానులందరికీ ఎంతో సంతోషాన్నిస్తుందని భావిస్తున్నాను.
గత కొన్ని రోజులగా మా జట్టుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ఆటగాళ్లు, మా కోచింగ్ స్టాప్ ఏకాగ్రతను కోల్పోకుండా కేవలం ఆటపై దృష్టి పెట్టారు. ఇంత ఒత్తిడిలో కూడా అద్భుత ప్రదర్శన చేసినందుకు ఆటగాళ్లకు, సపోర్ట్ స్టాప్‌కు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే.
ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది. మెల్‌బోర్న్ వికెట్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉంది. అందుకే మా బ్యాటర్లను పాజిటివ్‌గా ఆడమని, బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలని సూచించాను. మా బ్యాటర్లు ఎంతో ధైర్యంగా ఆడి లక్ష్యాన్ని అందుకున్నారు. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా జోష్ టంగ్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. బాక్సింగ్ డే రోజుల వేలాది మంది ప్రేక్షకుల ముందు 5 వికెట్లు తీయడం చిన్న విషయం కాదని స్టోక్స్ పేర్కొన్నాడు.
అదేవిధంగా ఎంసీజీ పిచ్‌పై కూడా స్టోక్స్ ఘాటుగా స్పందించాడు. ఇటువంటి పిచ్‌ను నేను ఇప్పటివరకు చూడలేదు. ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటి పిచ్‌ను తాయారు చేసి ఉంటే పెద్ద రచ్చ జరిగి ఉండేది. బాక్సింగ్ డే టెస్టు కోసం లక్షలాది మంది అభిమానులు ఎదుచూస్తుంటారు. అటువంటి మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసి పోవడం చాలా బాధాకరం అని స్టోక్స్ అన్నాడు.
చదవండి: Ashes: ఇదేంటో ఇలా ఉంది.. స్టీవ్ స్మిత్ విమర్శలు


