హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఆసీస్‌కు ఓటమి ఎదురైంది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్నారు.
3-0తో సిరీస్ సొంతం
పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో గెలుపొంది.. ఇంగ్లండ్‌పై మరోసారి ఆధిపత్యం చాటుతూ.. మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే వరుసగా రెండోసారి యాషెస్ సిరీస్ గెలుచుకుంది. తొలి రెండు టెస్టులకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. స్టీవ్ స్మిత్ సారథ్యం వహించాడు.
మూడో టెస్టుకు కమిన్స్ తిరిగి వచ్చి జట్టుకు గెలుపు అందించగా.. అనారోగ్యం వల్ల స్మిత్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టు నుంచి కమిన్స్ విశ్రాంతి తీసుకోగా.. స్మిత్ తిరిగి పగ్గాలు చేపట్టాడు.
అయితే, ఈ మ్యాచ్‌లోనూ ఆది నుంచి ఆధిపత్యం కనబరిచిన ఆసీస్... శనివారం నాటి రెండో రోజు ఆటలో బోల్తా పడింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ తొలి టెస్టు విజయాన్ని అందుకుంది.
ఇదిలా ఉంటే.. మెల్‌బోర్న్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తొలిరోజే ఇరవై వికెట్లు కూలి ఇరుజట్లు ఆలౌట్ అయ్యాయి. రెండో రోజు సైతం పదహారు వికెట్లు పడ్డాయి. ఇక ఈ విషయంపై స్మిత్ స్పందించాడు. ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మాట్లాడుతూ..
మా ఓటమికి కారణం అదే
‘‘కష్టతరమైన మ్యాచ్. తొందరంగా ముగిసిపోయింది. మేము అదనంగా కనీసం 50- 60 పరుగులు చేసి ఉంటే మంచి పోటీ ఉండేది. ఏదేమైనా చివరి వరకు మేము పట్టువీడలేదు.
ఇదేంటో ఇలా ఉంది
వికెట్ ముందుగా ఊహించినట్లుగానే ఉంది. అయితే, బంతి పాతబడే కొద్ది పూర్వపు రూపాన్ని కోల్పోయింది. వాళ్లు బ్యాటింగ్‌కు వచ్చినపుడు కొన్ని ఓవర్లు దూకుడుగానే ఆడారు. ఏదేమైనా ఈ పిచ్ బౌలర్లకు అతిగా సహకరించింది.
రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడ్డాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పచ్చికను కాస్త మెరుగుపరిచి ఉంటే బాగుండేది. అయితే, వికెట్ ఎలా ఉన్నా అందుకు తగ్గట్లుగా మేము ఆడాల్సింది’’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు. పరోక్షంగా పిచ్‌పై విమర్శలు గుప్పించాడు.
ఆసీస్- ఇంగ్లండ్ యాషెస్ బాక్సింగ్ డే టెస్టు సంక్షిప్త స్కోర్లు
👉ఆస్ట్రేలియా: 152 &132
👉ఇంగ్లండ్: 110 &178/6
👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు


