ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో స్టోక్స్ బృందం విజయం సాధించింది. ఆతిథ్య జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. సిరీస్‌లో కంగారూల సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించింది.
యాషెస్ సిరీస్ (Ashes)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ ఆస్ట్రేలియా (Aus vs Eng) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో ఇంగ్లిష్ జట్టు చిత్తుగా ఓడింది. దీంతో 3-0తో కంగారూలు సిరీస్ మరోసారి కైవసం చేసుకోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది.
రెండు రోజుల్లోనే..
ఇలాంటి తరుణంలో ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) గాయపడటంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. అతడు లేకుండానే బాక్సింగ్ డే టెస్టు బరిలో దిగింది. అయితే, మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ నాలుగో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. యువ పేసర్ జోష్ టంగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, ఆ సంతోషం ఇంగ్లండ్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజే తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్టోక్స్ బృందం.. 110 పరుగులకే కుప్పకూలింది.
నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు
హ్యారీ బ్రూక్ 41 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. ఆసీస్ పేసర్లు నాసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది.
ఇక 4/0 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్.. మరో 128 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (46), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (24 నాటౌట్) మాత్రమే మెరుగ్గా రాణించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు.
విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్లు
ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ స్టోక్స్ మూడు, జోష్ టంగ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆది నుంచే నిప్పులు చెరుగుతూ 34.3 ఓవర్లలో ఆసీస్‌ను 132 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 పరుగులు కలుపుకొని ఆసీస్.. ఇంగ్లండ్‌కు 175 (42+132) పరుగుల లక్ష్యాన్ని విధించింది.
ఎట్టకేలకు తొలి విజయం
పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఈ మేరకు ‘భారీ’ స్కోరును ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ సఫలమైంది. టాపార్డర్‌లో ఓపెనర్లు జాక్ క్రాలీ (37), బెన్ డకెట్ (34) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ‘పేసర్’ బ్రైడన్ కార్స్ (6) విఫలమయ్యాడు.
ఈ క్రమంలో జేకబ్ బెతెల్ (40) బాధ్యతాయుతంగా ఆడగా.. జో రూట్ 15 పరుగులు చేయగలిగాడు. ఇక కెప్టెన్ స్టోక్స్ (2) నిరాశపరచగా.. జేమీ స్మిత్ (3)తో కలిసి అజేయంగా నిలిచిన హ్యారీ బ్రూక్ (18) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జే రిచర్డ్‌సన్, స్కాట్ బోలాండ్ తలా రెండు వికెట్లు తీయగా.. ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలుపు అందుకుంది.
బాక్సింగ్ డే టెస్టు సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 152 &132
ఇంగ్లండ్: 110 &178/6.
చదవండి: నవతరం క్రికెట్‌లో.. మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 ప్లేయర్లు వీరే!


