టీ20 ప్రపంచకప్ 2026కు ముందు ఇంగ్లండ్ అదిరిపోయే ప్రదర్శనలతో దూసుకుపోతుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్‌ను (2-1) కైవసం చేసుకున్న ఈ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. పల్లెకెలె వేదికగా జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఛేదన సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 168 పరుగులుగా సెట్ చేశారు. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
టామ్ బాంటన్ (54 నాటౌట్) అజేయ అర్ద శతకంతో.. హ్యారీ బ్రూక్ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను గెలిపించారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఫిబ్రవరి 3న జరుగనుంది.
రాణించిన రత్నాయకే
లంక ఇన్నింగ్స్‌లో పవన్ రత్నాయకే (22 బంతుల్లో 40) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించాడు. మిగతా బ్యాటర్లలో నిస్సంక (34), కమిల్ మిషారా (36), , కుసాల్ మెండిస్ (32), అసలంక (28 నాటౌట్) కూడా పర్వాలేదనిపించారు. ఆఖర్లో కెప్టెన్ దసున్ షనక (6 బంతుల్లో 1) బంతులు వృధా చేసి నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
విధ్వంసం సృష్టించిన బ్రూక్
డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్ లక్ష్యాన్ని కుదించాక ఇంగ్లండ్ బ్యాటర్లు టామ్ బాంటన్ (33 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (14 బంతుల్లో 20 నాటౌట్; సిక్స్, ఫోర్) చెలరేగిపోయారు. జోస్ బట్లర్ (39) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో పతిరణ 2, షనక, వెల్లాలగే తలో వికెట్ తీశారు.


