నన్ను కావాలనే తప్పించారు: మెకల్లమ్‌పై సంచలన ఆరోపణలు | No one cares: England star stunning allegations against McCullum Brook | Sakshi
Sakshi News home page

నన్ను కావాలనే తప్పించారు: హెడ్‌కోచ్‌, కెప్టెన్‌పై ఇంగ్లండ్‌ స్టార్‌ ఆరోపణలు

Mar 17 2026 10:40 AM | Updated on Mar 17 2026 3:11 PM

No one cares: England star stunning allegations against McCullum Brook

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌, యాజమాన్యంపై ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ సంచలన ఆరోపణలు చేశాడు. తనను జట్టు నుంచి అకస్మాత్తుగా తప్పించారని.. అందుకు గల కారణం అడిగితే వారి నుంచి స్పందనే లేదన్నాడు. తన ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు.

ఎందుకు తప్పించారని అడిగితే..
విధ్వంసకర ఆటగాడిగా పేరొందిన లివింగ్‌స్టోన్‌కు గతేడాది మార్చి నుంచి ఇంగ్లండ్‌ జట్టులో చోటు కరువైంది. ఈ విషయం గురించి తాజాగా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్ఫోతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నన్ను జట్టు నుంచి ఎందుకు తప్పించారని యాజమాన్యాన్ని అడిగాను. నా స్థానంలో వేరొకరిని ఆడించాలని అనుకుంటున్నట్లు వాళ్ల చెప్పారు.

బజ్‌ (మెకల్లమ్‌), అప్పటి సెలక్టర్‌ ల్యూక్‌ రైట్‌ నిర్ణయమే అది. వారికి ఫోన్‌ చేస్తే స్పందనలేదు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ మెసేజ్‌ ద్వారా ఆఖరి నిమిషంలో నన్ను తప్పించిన విషయాన్ని చెప్పాడు. ఇక ఇంగ్లండ్‌ టీమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీ అయితే అసలు ఏమీ మాట్లాడలేదు.

నిర్లక్ష్యం చేశాడు
నేను ఆయనకు కాల్‌ చేసినప్పుడు సమ్మర్‌లో తిరిగి కాల్‌ చేస్తా అని చెప్పాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా తాను బిజీగా ఉన్నానని నన్ను నిర్లక్ష్యం చేశాడు. సెప్టెంబరు వరకు నాతో మాట్లాడనేలేదు. అప్పుడే నాకు ప్రస్తుత యాజమాన్యం ఎలాంటిదన్న విషయంలో కనువిప్పు కలిగింది.

ఎవరూ పట్టించుకోరని అర్థమైంది
వాళ్లకు నచ్చితేనే జట్టులో ఉంటాము. లేదంటే లేదు. నా గురించి ఎవరూ పట్టించుకోరని అర్థమైంది. కాబట్టి నాకు నచ్చినట్లు ఇకపై స్వేచ్ఛగా (లీగ్‌) ఆడుకునే అవకాశం దొరుకుతుంది అనిపించింది. భారత్‌, పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్నపుడు నా ప్రదర్శన నాకే నచ్చలేదు.

అపుడు మెకల్లమ్‌ దగ్గరికి వెళ్లి నాకు సలహాలు ఇవ్వమని అడిగాను. అప్పుడు అతను.. ‘నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నానని.. అంతగా భయపడాల్సిన పనిలేదని.. అంతా అదే సర్దుకుంటుంది’ అని చెప్పాడు. కానీ నాకు మాత్రం ఏదో తేడాగా అనిపించింది.

ఆటలోని లోపాలు సరిచేసుకోకపోతే నేనెలా ముందుకు సాగగలను? కానీ వాళ్లు మాత్రం నాకు సలహాలు, సూచనలు ఇచ్చే పరిస్థితిలో లేరని అర్థమైంది’’ అని లియామ్‌ లివింగ్‌స్టోన్‌ యాజమాన్యం తన పట్ల ఏమాత్రం సానుకూలంగా వ్యవహరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌లో ఇలా..
కాగా ఇంగ్లండ్‌ తరఫున 39 వన్డేలు, 60 టీ20లు, ఒక టెస్టు ఆడిన లివింగ్‌స్టోన్‌.. వన్డేల్లో 932, టీ20లలో 955, టెస్టులో 16 పరుగులు చేశాడు. ఈ రైటార్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ ఖాతాలో 25 వన్డే, 33 టీ20 వికెట్లు ఉన్నాయి. 

ఇక ఐపీఎల్‌లో ఇప్పటికి 49 మ్యాచ్‌లు ఆడిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ 1051 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌-2026 వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అతడిని రూ. 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. 

చదవండి: అత్యంత హేయమైన నేరం: పాకిస్తాన్‌పై రషీద్‌ ఖాన్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement