అత్యంత హేయమైన నేరం: పాకిస్తాన్‌పై రషీద్‌ ఖాన్‌ ఫైర్‌ | Rashid Khan Slams Pakistan After Air Strike Kills Reportedly 400 in Kabul | Sakshi
Sakshi News home page

అత్యంత హేయమైన నేరం: పాకిస్తాన్‌పై రషీద్‌ ఖాన్‌ ఫైర్‌

Mar 17 2026 9:06 AM | Updated on Mar 17 2026 3:16 PM

Rashid Khan Slams Pakistan After Air Strike Kills Reportedly 400 in Kabul

పాకిస్తాన్‌ తీరుపై అఫ్గనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్లు రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ మండిపడ్డారు. అమాయక ప్రజలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులపై దాడి చేయడాన్ని క్షమించరాని నేరంగా అభివర్ణిస్తూ పాక్‌ ఆర్మీ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం క్రూరత్వానికి పరాకాష్ట అని తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు.

400 మంది మృతి
కాగా పాకిస్తాన్‌ అఫ్గనిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. కాబూల్‌లోని ఓ ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో దాదాపు 400 మంది చనిపోయారని, మరో 250 మంది గాయపడ్డారని అఫ్గన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమ్‌దుల్లా ఫిట్రాత్‌ మంగళవారం వెల్లడించారు.

కాబూల్‌లోని మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంపై ఈ దాడి జరిగినట్లు హమ్‌దుల్లా తెలిపారు. దాదాపు రెండు వేల పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ధ్వంసమైనట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ పాకిస్తాన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అత్యంత హేయమైన నేరమే 
‘‘కాబూల్‌పై పాకిస్తాన్‌ జరిపిన వైమానిక దాడుల్లో అమాయక ప్రజలు చనిపోయారన్న వార్తలు నా మనసును కలచివేశాయి. పౌరుల నివాసాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులపై ఉద్దేశపూర్వకంగా లేదంటే పొరపాటున అయినా సరే దాడులు జరిపితే అత్యంత హేయమైన నేరమే అవుతుంది.

పవిత్ర రంజాన్‌ మాసంలో
మనుషుల ప్రాణాల గురించి లెక్కలేకుండా.. పవిత్ర రంజాన్‌ మాసంలో వాళ్లు జరిపిన ఈ దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి ఘటనలే ద్వేష భావం పెంపొందేలా చేస్తాయి. ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల సంస్థలు ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపించి దోషులను జవాబుదారీగా చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.

ఈ క్లిష్ట సమయంలో నేను నా అఫ్గన్‌ ప్రజలకు అండగా ఉంటాను. మనం ఈ విషాదం నుంచి కోలుకుంటాం. జాతిగా ఒకే తాటిపై నడుస్తాం. మనం ఎల్లప్పుడూ ఒకరికి ఒకరం తోడుగా ఉంటాము’’ అని రషీద్‌ ఖాన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

ఇక మహ్మద్‌ నబీ స్పందిస్తూ.. ‘‘కాబూల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకులు సైనిక పాలనలో ఉన్న పాకిస్తాన్‌ దాడులకు బలైపోయారు. వారి తల్లులు గేట్ల వద్ద నిల్చుని కుమారులను పిలుస్తున్నారు. ఇంతకంటే హృదయవిదాకరం ఏమి ఉంటుంది’’ అని విచారం వ్యక్తం చేశాడు.

చదవండి: ‘పీసీబీవన్నీ దిక్కుమాలిన నిర్ణయాలు’!

Advertisement
 
Advertisement
Advertisement