పంజాబ్, ఢిల్లీ జట్ల ఆశలు
శ్రేయస్ సారథ్యంపై కింగ్స్ నమ్మకం
అక్షర్ క్యాపిటల్స్ కథ మార్చేనా?
పేర్లు మారినా... ప్లేయర్లు మారినా.. ఆ రెండు జట్ల రాత మాత్రం మారడం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి పోటీ పడుతున్నా... ఇప్పటి వరకు ఆ రెండు జట్లకు ట్రోఫీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. అందులో ఒకటి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్... మరొకటి అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్.
గత సీజన్‌లో జట్లను ప్రక్షాళన చేసుకొని కొత్తగా దర్శనమిచ్చిన ఈ రెండు టీమ్‌లు మెరుగైన ప్రదర్శనే చేశాయి. బెంగళూరుతో జరిగిన ఫైనల్లో తడబడిన పంజాబ్ కింగ్స్ రన్నరప్‌తో సరిపెట్టుకోగా... ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానానికి పరిమితమైంది. చరిత్రను పక్కనపెట్టి ఇరు జట్లు ఈసారి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాయో చూడాలి!
సాక్షి, క్రీడావిభాగం : ఏళ్లకు ఏళ్లుగా తొలి టైటిల్ సాధించాలనే తపనతో సాగుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు గత ఏడాది మెరుగైన ఆటతీరు కనబర్చింది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యానికి సహచరుల సహకారం తోడవడంతో... పంజాబ్ తొలి టైటిల్ గెలిచేలా కనిపించింది. అయితే బెంగళూరుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సారథి విఫలమవడం ఫలితంపై ప్రభావం చూపింది.
గత సీజన్‌లో ఆడిన జట్టులో పెద్దగా మార్పులు చేయని పంజాబ్... ఈసారి ఎలాగైనా తమ చిరకాల కోరిక తీర్చుకోవాలని భావిస్తోంది. గత సీజన్‌లాగే బలంగా కనిపిస్తున్న కింగ్స్... మైదానంలో మళ్లీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్‌కు ప్రధాన బలం కాగా... జట్టు ఆల్‌రౌండర్‌లతో కిక్కిరిసి ఉంది. ప్రియాన్‡్ష ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తేనున్నాడు.
విదేశీ ప్లేయర్ల కోటాలో... స్టొయినిస్, యాన్సెన్, అజ్మతుల్లా, ఫెర్గూసన్ కీలకం కానున్నారు. సీజన్ మొత్తం ఈ నలుగురినే కొనసాగించే అవకాశాలున్నాయి. నేహల్ వధేరా, శశాంక్ సింగ్, ముషీర్ ఖాన్ రూపంలో మిడిలార్డర్‌లో ధాటిగా ఆడగల భారత ఆటగాళ్లు అందుబాటులో ఉండటం పంజాబ్‌కు కలిసి రానుంది. బౌలింగ్‌లో అర్‡్షదీప్ సింగ్ జట్టు ప్రధాన బలం కాగా... యుజ్వేంద్ర చహల్, స్టొయినిస్, యాన్సెన్, అజ్మతుల్లా మిగతా భారం మోయనున్నారు. ఆంధ్ర ఆటగాడు పైలా అవినాశ్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా చూడాలి.
పంజాబ్ కింగ్స్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), నేహల్ వధేరా, విష్ణు వినోద్, హర్‌నూర్ పన్ను, పైల అవినాశ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, స్టొయినిస్, హర్‌ప్రీత్ బ్రార్, యాన్సెన్, అజ్మతుల్లా, ప్రియాన్ష్ ఆర్య, ముషీర్ ఖాన్, సూర్యాన్ష్, ఓవెన్, కొనొల్లీ, డ్వార్‌షుయ్, అర్ష్ దీప్, చహల్, వైశాక్, యశ్ ఠాకూర్, జేవియర్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్, ఫెర్గూసన్.
అత్యుత్తమ ప్రదర్శన: రన్నరప్ (2014, 2025)
‘మద్యం మానేశా’
ప్రస్తుతం నా వయసు 35 ఏళ్లు. సీనియర్ ఆటగాడిగా చహల్‌ను చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలని అనుకోవాలి. మైదానంలో మరింత చురుగ్గా ఉంటూ జట్టు కోసం 150 శాతం శ్రమించాలని పట్టుదలగా ఉన్నా. అందుకే నా శరీరంపై మరింత దృష్టి పెట్టా. గత ఆరు నెలలుగా మద్యం మానేశాననే శుభవార్త మీతో పంచుకుంటున్నా. – చహల్, పంజాబ్
ఢిల్లీ రాత మారేనా!
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కసారి (2020 సీజన్‌లో) ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... గతేడాది టీమ్‌లో సమూల మార్పులు చేసింది. టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ సారథ్యానికి మొగ్గు చూపకపోవడంతో... అక్షర్ పటేల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. అందుకు తగ్గట్లే అక్షర్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. అయితే లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లో గెలిచిన క్యాపిటల్స్.. ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి ప్రత్యర్థులను భయపెట్టిన ఢిల్లీ... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది.
కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, పృథ్వీ షా వంటి ప్లేయర్లతో టాపార్డర్ బలంగా ఉండగా... మిడిలార్డర్‌లో అశుతోష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్ కీలకం కానున్నారు. పేరున్న స్టార్‌లకన్నా... సమయానుకూలంగా రెచ్చిపోగల ప్లేయర్లు ఉండటం క్యాపిటల్స్‌కు అదనపు బలం కానుంది. ఆంధ్ర ప్లేయర్ త్రిపురాన విజయ్‌ను ఆడిస్తారా అనేది ఆసక్తికరం. విదేశీ ప్లేయర్ల కోటాలో మిచెల్ స్టార్క్, మిల్లర్, స్టబ్స్, డకెట్, ఎంగిడి, జెమీసన్ అందుబాటులో ఉన్నారు.
అయితే అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడం కాస్త లోటే. బౌలింగ్‌లో ముకేశ్ కుమార్, నటరాజన్, కుల్దీప్ యాదవ్ కీలకం కానున్నారు. దేశవాళీ సెన్సేషన్ పేసర్ ఆఖిబ్ నబీ ఈ సారి అదనపు బలం కానున్నాడు. గత సీజన్ మాదిరిగానే సమష్టి ప్రదర్శనను నమ్ముకుంటే ఈ సారి క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరొచ్చు. హేమాంగ్ బదానీ కోచింగ్, అక్షర్ పటేల్ కెప్టెన్సీ జట్టును ఎలా నడిపిస్తాయనేది కీలకం.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మిల్లర్, డకెట్, నిశాంక, సాహిల్, పృథ్వీ షా, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ రాణా, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారి, ఆఖిబ్ నబీ, నితీశ్ రాణా, స్టార్క్, నటరాజన్, ముకేశ్ కుమార్, చమీర, ఎంగిడి. జెమీసన్, కుల్దీప్ యాదవ్.
అత్యుత్తమ ప్రదర్శన: రన్నరప్ (2020)


