లండన్: ఇటీవల యూకేలోని డెర్బిషైర్ ప్రాంతంలో ఓ వ్యక్తి రాత్రి పడుకొని, పొద్దునే లేచే సరికి నీలం రంగులోకి మారిపోయాడు. అచ్చం అవతార్ సినిమాలో పాత్రధారుల్లాగా. ఇంతకీ ఏం జరిగిందా అని డాక్టర్లు ఆరా తీయగా, షాకింగ్ విషయం బయటపడింది.
అసలేం జరిగిందంటే..?
42 ఏళ్ల టామీ లించ్ ఉదయం నిద్రలేచినప్పుడు, తన శరీరం నీలం రంగులోకి మారిపోవడాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే బర్టన్-ఆన్-ట్రెంట్‌లోని క్వీన్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళాడు. నిమిషాల వ్యవధిలోనే, ఆక్సిజన్ మాస్క్ ధరించి ఉన్న టామీని పరీక్షించడానికి సుమారు 10 మంది వైద్యులు అక్కడికి చేరుకున్నారు.
అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగా, ఓ డాక్టర్ రక్తం తీయడానికి టామీ చేతిని ఆల్కహాల్ వైప్‌తో తుడిచారు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ ప్రాంతంలోని నీలం రంగు మాయమైంది. అప్పుడే వైద్యులు ఆ సంఘటన వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టారు.
విషయం తెలిసి నవ్వుకున్నారు..!
ఇటీవల టామీకి ఓ స్నేహితుడు నీలం రంగు పరుపు, దుప్పట్లను ఇచ్చాడు. వాటిపై రెండు రాత్రులు పడుకున్న తర్వాత టామీ శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఇలా జరగడానికి ఆ పరుపు, దుప్పట్లకు ఉన్న రంగు శరీరానికి అంటుకోవడమే అని తెలిసి టామీ సహా వైద్యులంతా పక్కున నవ్వుకున్నారు. తొలుత భయపెట్టి, ఆతర్వాత నవ్వించిన ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరలైంది.


