న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న భారత్‌కు 2028లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహించే అవకాశం దక్కింది. నేటినుంచి పోలాండ్ వేదికగా ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2026 ప్రారంభం కానుండగా... అంతకంటే ఒక్క రోజు ముందు గురువారం 2028 ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కినట్లు వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ వెల్లడించింది.
భువనేశ్వర్‌లో ఈ పోటీలు జరుగుతాయి. అయితే శుక్రవారం నుంచి జరిగే పోటీల్లో మన దేశం నుంచి ఒక్క అథ్లెట్ కూడా పాల్గొనడం లేదు! ఈ ఏడాది ఆరంభంలో ఈ ఆతిథ్య హక్కుల కోసం న్యూజిలాండ్‌తో పాటు భారత్ బిడ్ వేయగా... మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం సంతృప్తి చెందిన కౌన్సిల్ భువనేశ్వర్‌ను వేదికగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆసియా దేశాల్లో జపాన్ (1999), ఖతర్ (2010), చైనా (2025) మాత్రమే ఈ చాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యమివ్వగా... ఇప్పుడు భారత్ నాలుగో దేశంగా నిలవనుంది.


