గొప్పగొప్ప లక్ష్యాలు కూడా సమాధి కావడానికి చిన్న చిన్న వ్యసనాలు చాలు. కొండంత బలం వృధా కావడానికి గోరంత బలహీనత చాలు. మరీ ముఖ్యంగా అత్యంత క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరమైన క్రీడా రంగంలో బలహీనతలు, దురలవాట్లు ఉండడం అంటే అది చేజేతులా భవిష్యత్తును పాడె ఎక్కించడమే అనాలి. మాజీ టాప్ క్రికెటర్ వినోద్ కాంబ్లి లాంటి వాళ్ల జీవితాలు దీనికో నిదర్శనంగా నిలుస్తున్నాయి కూడా!!
ఈ నేపథ్యంలో తాను మద్యం అలవాటును మానుకున్నానని, ఇకపై తన పూర్తి సమయం క్రికెట్‌కే కేటాయిస్తానని ప్రముఖ భారత క్రికెటర్, స్పిన్నర్ ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ ప్లేయర్ అయిన యజ్వేంద్ర చహల్ చెబుతున్నాడు.
ఇటీవల తన మాజీ ఐపీఎల్ సహచరుడు ఏబీ డివిలియర్స్ ఆధ్వర్యంలోని యూట్యూబ్ షోలో చహల్ ఈ విషయం గురించి మాట్లాడాడు. ఒకనాటి తన బలహీనతని, అది తనకు కలిగించిన నష్టాన్ని నిస్సంకోచంగా వెల్లడించాడు.
తరచూ ఆరోగ్య సమస్యలు
గతంలో తాను తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నానని చహల్ చెప్పాడు. మరీ ముఖ్యంగా గాయాల కారణంగా తన క్రీడా నైపుణ్యాలను తగిన విధంగా ప్రదర్శించలేకపోయానని పేర్కొన్నాడు.
‘‘కొన్ని సార్లు నా మీద నాకే నిరాశ కలిగిన మాట వాస్తవం. కేకేఆర్ మ్యాచ్ తర్వాత నా పక్కటెముక విరిగింది, ఆ తర్వాత నా కాలి వేలి కీలు కూడా విరిగింది. అందుకే సెమీఫైనల్, ఫైనల్‌లో నేను నా సరైన లెగ్–స్పిన్ బౌలింగ్ చేయలేకపోయాను’’ అని చహల్ గుర్తు చేసుకున్నాడు.
‘‘ఈ ఏడాది నేను ముందుగా నా శరీరం గురించి జాగ్రత్త పడాలనుకుంటున్నాను. రాబోయే సీజన్ లో నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపైనే దృష్టి పెట్టా’’ అని చహల్ వెల్లడించాడు.
మద్యం మానేశాను
దీనికి అనుగుణంగా తీసుకున్న తన నిర్ణయాలను గురించి చెబుతూ... తాను మద్యం మానేసినట్లు తెలిపాడు. దానికి కారణం తన వయస్సు తో పాటు పంజాబ్ కింగ్స్ కోసం మరింత బాగా రాణించాలనే తన ఆలోచనే అని చహల్ ఈ సందర్భంగా చెప్పాడు.
‘ఇప్పుడు కాదు.. నిజానికి నేను మద్యం తాగడం మానేసి ఆరు నెలలకు పైగా అయింది. నాకు ఇప్పుడు 35 ఏళ్లు, కాబట్టి నా చురుకుతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నా జట్టు కోసం నూటికి నూట యాభై శాతం ఇవ్వాలనుకుంటున్నాను.
ఒక సీనియర్ ఆటగాడిగా, ఐపీఎల్‌లోని యువ ఆటగాళ్లు నా నుంచి ఏదైనా మంచి విషయం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను’ అని చహల్ తన ఆలోచనల్ని ఏకరవు పెట్టాడు.
ఈ సందర్భంగా గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఫైనల్‌పై కూడా చహల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.
యాన్సెన్ లేకపోవడం వల్లే
ఆ ఓటమికి గల కారణాలలో తమ బౌలింగ్ ఆల్–రౌండర్ మార్కో యాన్సెన్ లేకపోవడం కూడా ఒకటని అతను విశ్లేషించాడు. జాన్సెన్ 14 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టినప్పటికీ, జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ప్లేఆఫ్స్‌కు దూరమయ్యాడు.
సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకుని ఐపీఎల్ జూన్ నెలకు వాయిదా పడటంతో, యాన్సెన్ క్యాంప్ విడిచిపెట్టి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం సన్నద్ధమయ్యేందుకు దక్షిణాఫ్రికాతో చేరవలసి వచ్చింది.
‘ఫైనల్‌లో మార్కో యాన్సెన్ గనక ఉండి ఉంటే, ఖచ్చితంగా టైటిల్ గెలిచి ఉండేవాళ్ళం. టోర్నమెంట్ అంతటా అతను బౌలింగ్ చేసిన తీరు అద్భుతం, బ్యాటింగ్‌లో కూడా చివరిలో రెండు మూడు సిక్సర్లు కొట్టగల సత్తా అతనికి ఉంది. అతను బౌలింగ్ చేస్తున్న తీరు వల్ల ఇప్పుడు మాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని చహల్ చెప్పాడు.
చదవండి: IPL 2026: సీఎస్‌కేకు భారీ షాక్!.. మాకు నిజంగా ఎదురుదెబ్బే!


