ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ తీవ్రంగా గాయపడ్డాడు. తొడకండరాల గాయం కారణంగా అతడు ఐపీఎల్-2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
పతిరణను వదిలేసి..
కాగా 2026 మినీ వేలానికి ముందు శ్రీలంక స్టార్, తమ విజయాల్లో కీలకమైన యువ పేసర్ మతీశ పతిరణను సీఎస్‌కే విడిచిపెట్టింది. దీంతో పేస్ దళం బలహీనపడగా.. రూ. 2 కోట్లకు ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ (Nathan Ellis)ను మాత్రం సీఎస్‌కే అట్టిపెట్టుకుంది.
అయితే, సీజన్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న వేళ ఎల్లిస్ గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా సీజన్ మొత్తానికి అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ ధ్రువీకరించారు.
మాకు ఇది భారీ ఎదురుదెబ్బ
‘‘మాకు ఇది భారీ ఎదురుదెబ్బ. ఎల్లిస్ జట్టులో కీలక బౌలర్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడు ప్రభావం చూపగలడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడి కోసం వెదుకుతున్నాము’’ అని విశ్వనాథన్ స్పోర్ట్స్‌స్టార్‌కు తెలిపారు. దీనిని బట్టి త్వరలోనే ఎల్లిస్ రీప్లేస్‌మెంట్‌ను సీఎస్‌కే ప్రకటించనున్నట్లు స్పష్టమైంది.
ఇదిలా ఉంటే.. సీఎస్‌కే పేస్ విభాగంలో ప్రస్తుతం ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్లు ఉన్నారు. మ్యాట్ హెన్రీని రూ. 2 కోట్లు, ఫౌల్క్స్‌ను రూ. 75 లక్షలకు సీఎస్‌కే మినీ వేలంలో కొనుగోలు చేసింది. ఇక ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ కూడా ఈ జట్టులో ఉన్నాడు.
ఐపీఎల్-2026 టోర్నీకి సీఎస్‌కే జట్టు
MS ధోని (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, సంజూ శాంసన్ (ట్రేడింగ్ ద్వారా, వికెట్ కీపర్), గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ చౌదరి, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), ఖలీల్ అహ్మద్, అకీల్ హొసేన్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చహర్, మ్యాట్ హెన్రీ.
చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్


