మూడు ఫార్మాట్లు ఆడగల టాప్‌-5 క్రికెటర్లు వీరే! | Top 5 Modern Day Cricketers Seem to be built for all formats | Sakshi
Sakshi News home page

నవతరం క్రికెట్‌లో.. మూడు ఫార్మాట్లు ఆడగల టాప్‌-5 ప్లేయర్లు వీరే!

Dec 26 2025 2:57 PM | Updated on Dec 26 2025 3:16 PM

Top 5 Modern Day Cricketers Seem to be built for all formats

క్రికెట్‌ ప్రపంచంలో ప్రస్తుతం పొట్టి ఫార్మాట్‌దే హవా. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ఉన్న ఆదరణ రోజురోజుకీ పెరుగిపోతోంది. న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు సైతం ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడేందుకు వీలుగా సెంట్రల్‌ కాంట్రాక్టు వదులుకుని.. జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు.

ఇలాంటి తరుణంలో మూడు ఫార్మాట్లలో ఆడగల క్రికెటర్ల సంఖ్య తగ్గిపోవడం సహజమే. అయితే, నవతరంలో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లకు సైతం కొదువలేదు. ఈ జాబితాలో టాప్‌-5లో ఉన్న ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా?

హ్యారీ బ్రూక్‌
మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్‌ పతనావస్థకు చేరిన వేళ హ్యారీ బ్రూక్‌ రూపంలో ఓ యువ ఆటగాడు జట్టుకు ఊపిరిలూదాడు. టెస్టు, వన్డే, టీ20లలో అద్భుతమైన బ్యాటింగ్‌ నైపుణ్యంతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అతడి రాకతో ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ సమస్య తీరిపోయింది. అంతేకాదు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్న 26 ఏళ్ల బ్రూక్‌.. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌ కూడా అయ్యాడు.

ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్‌లో 34 టెస్టులు, 35 వన్డేలు, 52 టీ20లు ఆడిన హ్యారీ బ్రూక్‌.. ఆయా ఫార్మాట్లలో 3034, 1170, 1012 పరుగులు సాధించాడు. టెస్టుల్లో పది సెంచరీలు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. వన్డేల్లో ఇప్పటికి రెండుసార్లు శతక్కొట్టాడు.

యశస్వి జైస్వాల్‌
రెండున్నరేళ్ల క్రితం టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ముంబై బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌. టెస్టుల్లో అడుగుపెట్టగానే సెంచరీలు, డబుల్‌ సెంచరీతో సత్తా చాటిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఓపెనర్‌గా జట్టులో స్థిరపడిపోయాడు.

అయితే, వన్డే, టీ20లలో ఆడే సత్తా ఉన్నా.. టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కారణంగా ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌కు జట్టులో చోటు కరువైంది. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 23 ఏళ్ల జైసూ 28 టెస్టుల్లో.. ఏడు శతకాలు, రెండు డబుల్‌ సెంచరీలు బాది 2511 పరుగులు సాధించాడు. ఇక నాలుగు వన్డేల్లో 171, 23 టీ20 మ్యాచ్‌లలో 723 పరుగులు చేశాడు. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌ సందర్భంగా తన తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు.

మార్కో యాన్సెన్‌
సౌతాఫ్రికా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మార్కో యాన్సెన్‌. దిగ్గజ జాక్వెస్‌ కలిస్‌ వారసుడిగా జట్టులో అతడు లేని లోటును పూడుస్తున్నాడు. ఆరడుగుల ఎనిమిది ఇంచుల ఎత్తు ఉండే మార్కో.. మూడు ఫార్మాట్లలోనూ దుమ్ములేపుతున్నాడు.

ఇప్పటికి సౌతాఫ్రికా తరఫున 25 ఏళ్ల రైట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌.. 21 టెస్టుల్లో 624, 32 వన్డేల్లో 553, 23 టీ20లలో 195 పరుగులు చేశాడు. ఇక లెఫ్టార్మ్‌ పేసర్‌ ఖాతాలో టెస్టుల్లో 89, వన్డేల్లో 49, టీ20లలో 21 వికెట్లు ఉన్నాయి.

జేకబ్‌ డఫీ
31 ఏళ్ల జేకబ్‌ డఫీ న్యూజిలాండ్‌ తరఫున ఆల్‌ ఫార్మాట్‌ పేసర్‌గా సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాదే టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బౌలర్‌ ఇప్పటికి 4 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 25 వికెట్లు కూల్చాడు.

అదే విధంగా.. 19 వన్డేల్లో 35, 38 టీ20 మ్యాచ్‌లలో కలిపి 53 వికెట్లు కూల్చిన డఫీ.. ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పుగా అవతరించాడు.

కామెరాన్‌ గ్రీన్‌
ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 26 ఏళ్ల ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. ఇటీవల ఐపీఎల్‌ మినీ వేలం-2026లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇతడి కోసం ఏకంగా 25.20 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ నిలిచాడు. టీ20 ఫార్మాట్‌తో పాటు వన్డే, టెస్టుల్లో కూడా గ్రీన్‌ రాణిస్తున్నాడు.

ఇప్పటికి ఆస్ట్రేలియా తరఫున 36 టెస్టులు, 31 వన్డేలు, 21 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 1658, 782, 521 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ రైటార్మ్‌ పేసర్‌ ఖాతాలో 38 టెస్టు, 20 వన్డే, 12 టీ20 వికెట్లు ఉన్నాయి.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీకి అత్యున్నత పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement