ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు... శ్రీలంకపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 53 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. తద్వారా 2–1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుంది.
2023 తర్వాత ఇదే తొలిసారి
కాగా 2023 తర్వాత ఇంగ్లండ్ జట్టుకు ఇదే తొలి విదేశీ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (66 బంతుల్లో 136 నాటౌట్; 11 ఫోర్లు, 9 సిక్స్‌లు), మాజీ కెప్టెన్ జో రూట్ (108 బంతుల్లో 111 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీలతో కదంతొక్కారు.
జేకబ్ బెథెల్ (72 బంతుల్లో 65; 8 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బెన్ డకెట్ (7), రేహాన్ అహ్మద్ (24) విఫలమవడంతో ఇంగ్లండ్ జట్టు 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా... మూడో వికెట్‌కు బెథెల్‌తో కలిసి రూట్ 126 పరుగులు జోడించాడు.
57 బంతుల్లోనే శతకం
అయితే, బ్రూక్ రాకతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న పరుగుల ప్రవాహం ఒక్కసారిగా రాకెట్ వేగాన్ని అందుకుంది. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు రూట్‌తో కలిసి బ్రూక్ 113 బంతుల్లోనే 191 పరుగులు జతచేశాడు. ఈ క్రమంలో 40 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న బ్రూక్... 57 బంతుల్లోనే శతకం ఖాతాలో వేసుకున్నాడు.
శతక్కొట్టిన రూట్
మరోవైపు.. రూట్ 100 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో హసరంగ, ధనంజయ, వండర్సే తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 46.4 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది.
పవన్ రత్నాయకే (115 బంతుల్లో 121; 12 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి పోరాటం కనబర్చాడు. 8వ ఓవర్‌లో క్రీజులోకి వచి్చన అతడు చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
మెరుపు అర్ధశతకం
ఓపెనర్ పాథుమ్ నిసాంక (25 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకంతో జట్టుకు శుభారంభం ఇవ్వగా... పవన్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. అయితే అతడికి సహచరుల నుంచి తగినంత సహకారం లభించలేదు. కమిల్ మిశ్రా (22), కుషాల్ మెండిస్ (20), కెప్టెన్ చరిత అసలంక (13), జనిత్ లియనాగె (22), దునిత్ వెల్లలాగె (22) ఎక్కువసేపు నిలవలేకపోయారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్, డాసన్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. బ్రూక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, రూట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది.


