అండర్ 19 ప్రపంచకప్‌లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ సిక్స్‌కు చేరిన యంగ్ ఇండియా.. ఈ దశలోనూ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.
బులవాయో వేదికగా ఇవాళ (జనవరి 27) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 204 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఒడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విహాన్ మల్హోత్రా (109 నాటౌట్) సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది.
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించగా.. మరో మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు. ఆఖర్లో ఖిలన్ పటేల్ (12 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 350 పరుగుల మార్కును దాటింది.
మిగతా ఆటగాళ్లలో ఆరోన్ జార్జ్ 23, కెప్టెన్ ఆయుశ్ మాత్రే 21, వేదాంత్ త్రివేది 15, కనిష్క్ చౌహాన్ 3, అంబ్రిష్ 21, హెనిల్ పటేల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్, కెప్టెన్ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్ పటేల్ ఓ వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఆదిలోనే చేతులెత్తేసింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో 37.4 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. లీరాయ్ (62), కియాన్ బ్లిగ్నాట్ (37), టటెండ చిముగోరో (29) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
భారత బౌలర్లలో ఉధవ్ మోహన్, ఆయుశ్ మాత్రే తలో 3 వికెట్లు పడగొట్టగా.. అంబ్రిష్ 2, హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ చెరో వికెట్ తీశారు. సూపర్ సిక్స్‌లో భారత్ నెక్స్ట్ టార్గెట్ దాయాది పాకిస్తాన్. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా జరుగనుంది.


