ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్‌ | Josh Hazlewood Withdraws From T20 World Cup 2026 As Australia Faces Another Bowling Setback, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు ఆసీస్‌కు మరో భారీ షాక్‌

Feb 6 2026 1:57 PM | Updated on Feb 6 2026 2:21 PM

Huge Blow To Australia Another Star Ruled Out Of T20 WC 2026

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో పేస్‌ బౌలర్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

హాజిల్‌వుడ్‌ అవుట్‌
గత కొన్నాళ్లుగా తొడ కండరాల నొప్పి, చీలమండ గాయంతో బాధపడుతున్న జోష్‌ హాజిల్‌వుడ్‌ (Josh Hazlewood) ఇంకా కోలుకోలేదు. దీంతో వరల్డ్‌కప్‌ టోర్నీ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా శుక్రవారం ధ్రువీకరించింది. 

అయితే, ఇప్పటికే హాజిల్‌వుడ్‌కు బ్యాకప్‌గా ప్రకటించిన సీన్‌ అబాట్‌ను జట్టుతోనే కొనసాగించిన యాజమాన్యం.. ప్రధాన జట్టులో హాజిల్‌వుడ్‌ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని మాత్రం ఎంపిక చేయలేదు.

కాగా గాయాల బెడద కారణంగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కు హాజిల్‌వుడ్‌ దూరమైన సంగతి తెలిసిందే. నవంబరు నుంచి ఇప్పటివరకు అతడు మైదానంలో దిగనే లేదు. అయితే, వరల్డ్‌కప్‌ నాటికి కోలుకుంటాడని భావించిన సెలక్టర్లు అతడికి జట్టులో చోటిచ్చారు. కానీ హాజిల్‌వుడ్‌ పరిస్థితి మెరుగుపడలేదు.

రిస్క్‌ తీసుకోలేము
ఈ విషయం గురించి ఆసీస్‌ సెలక్టర్‌ టోనీ డొడెమేడ్‌ మాట్లాడుతూ.. "జోష్‌ సూపర్‌-8 దశ వరకైనా ఫిట్‌నెస్‌ సాధిస్తాడని భావించాము. అయితే, ఇంకా అతడు కోలుకోలేదు.ఇందుకు ఇంకాస్త సమయం పడుతుంది. ఈ విషయంలో మేము రిస్క్‌ తీసుకోవాలని అనుకోవడం లేదు.

అయితే, జోష​్‌ స్థానంలో ఇప్పుడే ఆటగాడిని ప్రకటించడం లేదు. ఆరంభమ్యాచ్‌లలో మాకంత అవసరం లేదనిపిస్తోంది. కొన్నాళ్ల తర్వాత జోష్‌ స్థానంలో వేరే ఆటగాడిని ఎంపిక చేసే విషయం గురించి ఆలోచిస్తాము’’ అని తెలిపాడు. కాగా వెన్నునొప్పి నుంచి కోలుకోని కారణంగా కమిన్స్‌ దూరం కాగా.. అతడి స్థానాన్ని బెన్‌ డ్వార్షుయిస్‌ భర్తీ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభం. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో ఆసీస్‌.. ఐర్లాండ్‌, జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఒమన్‌లతో కలిసి గ్రూప్‌-బిలో ఉంది. కాగా ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో ఆసీస్‌ తమ తొలిమ్యాచ్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా 
ట్రావెలింగ్ రిజర్వ్: సీన్ అబాట్

చదవండి: మాపై ఉగ్రదాడి జరిగింది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement