టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విజయవంతమైనప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గంభీర్ పర్యవేక్షణలో సేనా(సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా) దేశాలపై భారత్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా గత నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో గంభీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అతడిని వెంటనే ప్రధాన కోచ్‌గా తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో బీసీసీఐ కూడా హెడ్ కోచ్ మార్పుపై ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. టెస్టు జట్టు కోసం ప్రత్యేకంగా కోచ్‌ను నియమించాలన్న యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో హెడ్ కోచ్ పదవి కోసం లెజెండరీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు ప్రతినిధులు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ ఆఫర్‌ను లక్ష్మణ్‌ను తిరష్కరించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE) హెడ్‌గా ఉన్నాడు. అయితే ప్రస్తుత బాధ్యతలతోనే తను సంతోషంగా ఉన్నానని, సీనియర్ జట్టు కోచింగ్‌పై ఆసక్తి లేదని బోర్డుకు తెలియజేశాడంట. కానీ మరోసారి లక్ష్మణ్‌తో చర్చలు జరిపేందుకు బోర్డు పెద్దలు సిద్దమైనట్లు సమాచారం.
గంభీర్ మెడపై కత్తి..
కాగా వన్డే ప్రపంచకప్-2027 ముగిసే వరకు బీసీసీఐతో గంభీర్ కాంట్రాక్ట్ ఉంది. కానీ మరి కొద్ది రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రదర్శన బట్టి అతడి కాంట్రాక్ట్‌ను బోర్డు పునః సమీక్షించే అవకాశముంది. గంభీర్ కోచింగ్‌లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియాకప్‌ను సొంతం చేసుకుంది.
గంభీర్ ముందు పొట్టి ప్రపంచకప్‌తో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ 2025-27లో టీమిండియా ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అత్యంత కీలకం. మిగిలిన మ్యాచ్‌లలో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత క్రికెట్ జట్టుకు మరో ఎనిమిది నెలల వరకు ఎటువంటి టెస్టు సిరీస్‌లు లేవు.
చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం


