ప్రొ కబడ్డీ లీగ్ చాంపియన్ ఢిల్లీ
రెండో సారి టైటిల్ సాధించిన జట్టు
హోరాహోరీ ఫైనల్లో 31–28తో పుణేరి పల్టన్‌పై గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ మరోసారి విజేతగా నిలిచింది. 12వ సీజన్‌లో ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 2 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ రెండోసారి టైటిల్ సాధించింది. శుక్రవారం ఇక్కడి త్యాగరాజ ఇండోర్ స్టేడియంలో జరిగిన తుది పోరులో ఢిల్లీ జట్టు 31–28తో పుణేరి పల్టన్‌పై నెగ్గింది. 2021–22లో ఎనిమిదో సీజన్‌లో తొలి సారి దబంగ్ ఢిల్లీ చాంపియన్‌గా నిలిచింది.
ప్రస్తుత హెడ్ కోచ్ జోగిందర్ నర్వాల్ అప్పుడు కెప్టెన్. అతని సారథ్యంలో కూడా పాయింట్ తేడాతోనే (37–36) పట్నా పైరేట్స్‌ను ఓడించి టైటిల్ సాధించింది. తాజా ఫైనల్లో దబంగ్ రెయిడర్లు నీరజ్ నర్వాల్ (9), అజింక్యా పవార్ (6) అదరగొట్టారు. 12 సార్లు కూతకెళ్లిన నీరజ్ 2 బోనస్ సహా 8 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను విజయవంతంగా టాకిల్ చేసి మరో పాయింట్ సాధించాడు. అజింక్యా కూడా 12 సార్లు కూతకెళ్లి 6 సార్లు పాయింట్లతో వచ్చాడు.
డిఫెండర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ టాకిలింగ్‌తో చేయలేకపోయినా రెయిడింగ్‌తోనే ఢిల్లీ టైటిల్‌ను మళ్లీ సాకారం చేసుకుంది. డిఫెండర్లలో సౌరభ్, సుర్జీత్ సింగ్ చెరో 2 పాయింట్లే చేయగలిగారు. ప్రత్యర్థి పుణేరి జట్టులో రెయిడర్ ఆదిత్య షిండే (10) జట్టును గెలిపించేందుకు చక్కని పోరాటం చేశాడు. 15 సార్లు కూతకెళ్లిన ఆదిత్య 10 సార్లు పాయింట్లు తెచ్చిపెట్టాడు. మరో రెయిడర్ పంకజ్ మోహిత్ 4 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు.
డిఫెండర్లలో అభినేశ్ నటరాజన్ (4), గౌరవ్ ఖత్రి (3) మెరుగ్గా ఆడారు. 2023–24 చాంపియన్ పుణేరి రెండోసారి విజేతగా నిలవాలని భావించగా, ఫైనల్ ఓటమితో రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2022 ఫైనల్లో పుణేరి పల్టన్‌పై గెలుపొందడం ద్వారానే జైపూర్ పింక్‌పాంథర్స్ పీకేఎల్‌లో రెండో సారి చాంపియన్‌షిప్ సాధించింది. జైపూర్‌లానే ఇప్పుడు ఢిల్లీ కూడా పల్టన్‌ను పల్టీ కొట్టించి రెండో టైటిల్‌తో పండగ చేసుకుంది.


