ప్రోకబడ్డీ లీగ్-2025లో తెలుగు టైటాన్స్ అద్భుత ప్రయాణం కొనసాగుతోంది. మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన ఎలిమినేటర్ 3లో పాట్నా పైరేట్స్‌ను 46-39 తేడాతో చిత్తు చేసిన టైటాన్స్.. క్వాలిఫయర్-2 పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరగనున్న క్వాలిఫయర్-2లో పుణేరి పల్టన్‌తో టైటాన్స్ అమీతుమీ తెల్చుకోనుంది.
కాగా తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో ఆ జట్టు హెడ్ కోచ్ కృష్ణన్ కుమార్ హుడా కీలక పాత్ర. ఈ ఏడాది సీజన్‌లో కృష్ణన్ కుమార్ పర్యవేక్షణలో టైటాన్స్ సంచలన ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశలో వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించిన తెలుగు టైటాన్స్.. ఇప్పుడు నాకౌట్స్‌లోనూ అదే జోరును కనబరుస్తోంది. మినీ-క్వాలిఫైయర్‌లో బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. ఎలిమినేటర్-3లో మూడుసార్లు ఛాంపియన్ అయిన పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది.
కన్నీరు పెట్టుకున్న కృష్ణన్ కుమార్..
కాగా ఎలిమినేటర్-3లో పాట్నాపై విజయం అనంతరం టైటాన్స్ హెడ్ కోచ్ కృష్ణన్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. అధికారిక బ్రాడ్ క్రాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో కృష్ణన్ మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.
"ఈ ఏడాది సీజన్‌లో మా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. తొమ్మిది సీజన్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాము. ఇప్పుడు సెమీఫైనల్(క్వాలిఫయర్-2) ఆడేందుకు సిద్దమయ్యాము. ఇది మాకు డూ-ఆర్-డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తాము.
తెలుగు టైటాన్స్ ఇక్కడ వరకు వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. గతంలో మమ్మల్ని ప్రతీ జట్టు తేలికగా తీసుకునేది. రెండు పాయింట్లు సులువగా సాధించవచ్చు అని అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి జట్టు మమ్మల్ని చూసి భయపడుతోంది" అని హుడా పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన టైటాన్స్ అభిమానులు బాధ పడొద్దు సార్.. ఈసారి కప్ మనదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా పీఎకేఎల్ చరిత్రలో టైటాన్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుండడం ఇదే తొలిసారి.
చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు


