సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రపంచ రికార్డు | Suryakumar Yadav Becomes Fastest to Smash 150 T20I Sixes Among Test Nations | Sakshi
Sakshi News home page

సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రపంచ రికార్డు

Oct 29 2025 5:21 PM | Updated on Oct 29 2025 5:31 PM

Suryakumar Yadav World Record Becomes 1st Player To Achieve Fastest

టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు హోదా ఉన్న జట్ల తరఫున అత్యంత వేగంగా 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. ముంబైకి చెందిన 35 ఏళ్ల సూర్యకుమార్‌ ఆలస్యంగానే టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు.

ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌ సందర్భంగా భారత్‌ తరఫున 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆ తర్వాత వన్డే, టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ రెండు ఫార్మాట్లలోనూ సత్తా చాటలేక చతికిల పడ్డ సూర్య.. తనకు కలిసి వచ్చిన టీ20 క్రికెట్‌లో మాత్రం వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఎదిగాడు.

వరుస విజయాలు
ఈ క్రమంలో గతేడాది ఏకంగా టీమిండియా టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన సూర్య.. వరుస విజయాలు సాధించాడు. ఇటీవలే ఆసియా టీ20 కప్‌-2025లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. కానీ బ్యాటర్‌గా మాత్రం విఫలం కావడం విమర్శలకు దారితీసింది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న సూర్య.. తొలి టీ20లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. కాన్‌బెర్రా వేదికగా టాస్‌ గెలిచిన ఆసీస్‌.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు
ఈ క్రమంలో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (14 బంతుల్లో 19) వేగంగా ఆడే ప్రయత్నంలోనే.. నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో టిమ్‌ డేవిడ్‌కు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య.. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)తో కలిసి దంచికొట్టాడు. అయితే, వర్షం వల్ల ఈ మ్యాచ్‌ అర్ధంతరంగా ముగిసిపోయింది.

అప్పటికి.. 9.4 ఓవర్ల ఆట సాగగా.. వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేసింది టీమిండియా. గిల్‌ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 37 పరుగులు చేయగా.. సూర్యకుమార్‌ 24 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

 

205 సిక్సర్లతో టాప్‌లో రోహిత్‌ 
ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా సూర్య అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 150 సిక్సర్ల క్లబ్‌లో చేరాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 205 సిక్సర్లతో టాప్‌లో ఉండగా.. సూర్య ఐదో స్థానంలో నిలిచాడు.

అయితే, అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లోనే అంటే.. 86వ ఇన్నింగ్స్‌లోనే 150 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు సూర్య. తద్వారా ఐసీసీ ఫుల్‌ మెంబర్ల (టెస్టు హోదా) జట్ల తరఫున ఫాస్టెస్ట్‌ 150 సిక్సెస్‌ సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇక అసోసియేట్‌ దేశమైన యూఏఈ తరఫున ముహమ్మద్‌ వసీం 66 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-5 క్రికెటర్లు
🏏 రోహిత్‌ శర్మ (ఇండియా)- 159 మ్యాచ్‌లలో 205 సిక్సర్లు
🏏ముహమ్మద్‌ వసీం (యూఏఈ)- 91 మ్యాచ్‌లలో 187 సిక్సర్లు
🏏మార్టిన్‌ గప్టిల్‌ (న్యూజిలాండ్‌)- 122 మ్యాచ్‌లలో 173 సిక్సర్లు
🏏జోస్‌ బట్లర్‌ (ఇంగ్లండ్‌)- 144 మ్యాచ్‌లలో 172 సిక్సర్లు
🏏సూర్యకుమార్‌ యాదవ్‌ (ఇండియా)- 91 మ్యాచ్‌లలో 150 సిక్సర్లు*.

చదవండి: PKL 2025: అత‌డొక అద్భుతం.. తెలుగు టైటాన్స్‌కు దొరికిన ఆణిముత్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement