ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. తొలి పీకేఎల్ టైటిల్‌ను ముద్దాడేందుకు టైటాన్స్ అత్యంత చేరువలో ఉంది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్-3లో మూడుసార్లు ఛాంపియన్ అయిన పట్నా పైరేట్స్‌పై 46-39 పాయింట్ల తేడాతో టైటాన్స్ ఘన విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్-2కు తెలుగు టైటాన్స్ అర్హత సాధించింది. బుధవారం జరగనున్న క్వాలిఫయర్-2లో పుణేరి పల్టన్‌ను ఓడించి తుది పోరుకు క్వాలిఫై అవ్వాలన్న పట్టుదలతో టైటాన్స్ ఉంది.
దుమ్ములేపుతున్న భరత్
కాగా తెలుగు టైటాన్స్ తమ తొలి టైటిల్‌కు చేరువ కావడంలో ఆల్‌రౌండర్ భరత్ హుడాది కీలక పాత్ర. ఈ ఏడాది సీజన్‌లో భరత్ తన అద్బుతమైన ప్రదర్శనలతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. గతంలో యూపీ యోధాకు ప్రాతినిథ్యం వహించిన భరత్ హుడాను.. ఈ ఏడాది వేలంలో రూ. 81 లక్షలకు టైటాన్స్ కొనుగోలు చేసింది.
ఈ వేలంలో అతడు మూడవ అత్యంత ఖరీదైన ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. అయితే టైటాన్స్ మెనెజ్‌మెంట్ తన పెట్టుకున్న నమ్మకాన్ని భరత్ వమ్ము చేయలేదు. భరత్ హూడా.. కెప్టెన్ విజయ్ మాలిక్‌తో కలిసి జట్టు రైడింగ్ విభాగాన్ని నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. ఎలిమినేటర్-3 మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌పై కూడా భరత్ సత్తాచాటాడు.
23 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు బెంగళూరు బుల్స్‌పై గెలుపొందిన మినీ క్వాలిఫయర్ మ్యాచ్‌లో అతడు 12 పాయింట్లతో రాణించాడు. మొత్తంగా అత్యధిక రైడ్ పాయింట్ల సాధించిన జాబితాలో భరత్ హుడా(207) నాలుగో స్ధానంలో కొనసాగుతున్నాడు. దీంతో అతడిపై టైటాన్స్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతడు టైటాన్స్‌కు దొరికిన అణిముత్యమని కొనియాడుతున్నారు. మరోవైపు కెప్టెన్ విజయ్ మాలిక్(156) కూడా సత్తాచాటుతున్నాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ


