ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో (73, 121 నాటౌట్) చెలరేగడంతో 36 రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకొని, తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు.
ఈ ఘనతను రోహిత్ 38 ఏళ్ల 182 రోజల వయసులో సాధించాడు. తద్వారా అత్యంత లేటు వయసులో నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉండిన రోహిత్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ ప్లేస్‌కు చేరాడు.
ఈ క్రమంలో అగ్రపీఠంపై తిష్ట వేసిన సహచరుడు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కిందికి దించాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ తర్వాత నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా అవతరించిన భారత బ్యాటర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.
ఆసీస్‌తో తాజాగా జరిగిన 3 మ్యాచ్‌లో సిరీస్‌లో (10, 9, 24) విఫలమైన గిల్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన మరో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఓ స్థానం కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయాడు. ఇదే సిరీస్‌లోని రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 10 నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 3 స్థానాలు ఎగబాకి నాలుగో ప్లేస్‌కు చేరుకున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు.
టాప్-10లో ఏకైక టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ స్థానం కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరగా.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ టాప్ ప్లేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
చదవండి: రాణించిన రచిన్, మిచెల్.. న్యూజిలాండ్‌దే వన్డే సిరీస్


