స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను (New Zealand vs England) న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 29) జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) ధాటికి 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్‌వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్‌ను మట్టుబెట్టడంలో తమవంతు పాత్ర పోషించారు.
జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ 33.1 ఓవర్లలోనే ముగించింది. అయితే లక్ష్యాన్ని చేరుకునేందుకు సగం వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర (54), డారిల్ మిచెల్ (56 నాటౌట్) రాణించారు. కేన్ విలియమ్స్ (21) మంచి ఆరంభం లభించినా పెద్ద స్కోర్‌గా మలచలేకపోయాడు.
ఆఖర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (17 బంతుల్లో 34 నాటౌట్) బ్యాట్ ఝులిపించి మ్యాచ్‌ను వేగంగా ముగించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (10-4-23-3) ప్రమాదకరంగా బౌలింగ్ చేశాడు. ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-0 తేడాతో (2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి) కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే ఖాతాలో వేసేసుకుంది.
చదవండి: శతక్కొట్టిన స్టీవ్ స్మిత్.. యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు వార్నింగ్


