యాషెస్ సిరీస్‌కు (Ashes Series 2025-26) ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సింహ గర్జన చేశాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాడు. న్యూ సౌత్ వేల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్.. 158 బంతుల్లో 16 ఫోర్లు, సిక్సర్ సాయంతో మూడంకెల మార్కును చేరాడు.
ఈ సెంచరీతో యాషెస్ తొలి టెస్ట్‌కు ముందు ప్రత్యర్ది ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపాడు. ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో స్మిత్ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్‌గా లేకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది.
తొలి టెస్ట్ కోసం ఆసీస్ జట్టును ప్రకటించాల్సి ఉంది. 2018లో సాండ్‌పేపర్ వివాదం తర్వాత స్మిత్ కెప్టెన్సీ కోల్పోయాడు. అప్పటి నుంచి వైస్ కెప్టెన్‌గా కొనసాగుతూ ఆరు టెస్టుల్లో తాత్కాలిక నాయకత్వం వహించాడు. సాధారణ ఆటగాడిగా కంటే కెప్టెన్‌గా స్మిత్ బ్యాటింగ్ రికార్డు అద్భుతంగా ఉంది. సాధారణ ఆటగాడిగా అతని సగటు 49.9గా ఉంటే, కెప్టెన్‌గా అది 68.98గా ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. క్వీన్స్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూ సౌత్ వేల్స్ రెండో రోజు మూడో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్‌తో పాటు కర్టిస్ ప్యాటర్సన్ (112) సెంచరీ పూర్తి చేసుకొని బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు. న్యూ సౌత్ వేల్స్‌కే ఆడే ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ 10 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.
చదవండి: బట్లర్ మరో ఆడుగు ముందుకు..!


