ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ల జాబితాలో జోస్ బట్లర్ (Jos Buttler) మరో అడుగు ముందుకేశాడు. ఇవాళ (అక్టోబర్ 29) న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డేలో 9 పరగులు చేసిన అతను.. ఇంగ్లండ్ ఆల్‌టైమ్ హైయెస్ట్ రన్ స్కోరర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఇయాన్ బెల్‌ను (5416) అధిగమించాడు.
ప్రస్తుతం బట్లర్ ఖాతాలో 5245 వన్డే పరుగులు ఉన్నాయి. ఈ జాబితాలో జో రూట్ (7328) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గన్ (6975) రెండో స్థానంలో నిలిచాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ టాప్-10 బ్యాటర్లు..
జో రూట్ - 7328
ఇయాన్ మోర్గన్ - 6957
జోస్ బట్లర్ - 5425
ఇయాన్ బెల్ - 5416
పాల్ కాలింగ్‌వుడ్ - 5092
అలెక్ స్టీవర్ట్ - 4677
కెవిన్ పీటర్సన్ - 4422
మార్కస్ ట్రెస్కోథిక్ - 4335
గ్రహం గూచ్ - 4290
జేసన్ రాయ్ - 4271
ఇదిలా ఉంటే, బట్లర్ కెరీర్ గత కొంతకాలంగా బాగా నెమ్మదించింది. అతను ఏ ఫార్మాట్‌లో అయినా సెంచరీ చేసి నాలుగేళ్లవుతుంది. చివరిగా 2021 అక్టోబర్ 30న శ్రీలంకపై T20 వరల్డ్‌కప్‌లో మూడంకెల మార్కును తాకాడు.
అప్పటి నుంచి కొన్ని మంచి ఆరంభాలు లభించినా అతను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. పెద్ద స్కోర్లు చేయకపోయినా బట్లర్ స్ట్రయిక్‌రేట్‌ను మెయింటైన్ చేస్తూ ఇంగ్లండ్ విజయాల్లో పాలు పంచుకుంటున్నాడు. యువ ఓపెనర్ల రాకతో బట్లర్ మిడిలార్డర్‌లో వస్తున్నాడు. ఇదే అతన్ని సెంచరీలు చేయనివ్వడం లేదు.
మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) చెలరేగడంతో 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్‌వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్‌ను మట్టుబెట్టడంలో పాలుపంచుకున్నారు.
జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దైన టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-0 తేడాతో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.
చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్?


