టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) మధ్య మాటల యుద్ధానికి తెరపడినట్లే కనిపిస్తోంది. రంజీ ట్రోఫీ 2025-26 మ్యాచ్‌లో గుజరాత్‌పై బెంగాల్ విజయం సాధించిన తర్వాత షమీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
దేశీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ఆడుతున్న షమీ (3/44; 5/38) తన పేస్‌లో పదును ఏమాత్రం తగ్గలేదని బౌలింగ్‌తో నిరూపించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గ్రూప్ ‘సి’లో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో బెంగాల్.. 141 పరుగుల భారీతేడాతో గుజరాత్ (Bengal Vs Gujarat)పై ఘనవిజయం సాధించింది.
185 పరుగులకే కుప్పకూలిన గుజరాత్
ఆఖరి రోజు 170/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బెంగాల్ 214/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్ అనుస్తుప్ (58; 9 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆకాశ్‌దీప్ (25 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మోస్తరు పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 112 పరుగులు కలుపుకొని గుజరాత్ ముందు 327 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
5 కీలక వికెట్లు తీసిన షమీ
ఈ టార్గెట్‌ను చేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ రెండో ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. ఉర్విల్ పటేల్ (109 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ శతకం సాధించాడు. షమీ పదే ఓవర్లు వేసి 5 కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి బాటవేశాడు. షహబాజ్ అహ్మద్‌కు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన షహబాజ్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది
ఇదిలా ఉంటే.. గుజరాత్‌పై విజయం తర్వాత షమీని విలేకరులు పలకరించగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మాట్లాడితే కథ వేరేలా మారుతుందని పేర్కొన్నాడు. ‘‘నేను ఎల్లప్పుడు వివాదాల్లో చిక్కుకుపోతున్నాను. మీరే (మీడియా) నన్ను కాంట్రవర్సీ బౌలర్‌గా మార్చేశారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఇబ్బందుల్లో పడటం ఖాయం.
కాబట్టి ఇప్పుడేం చెప్పగలను? నేను మిమ్మల్ని కూడా నిందించను. ప్రతి ఒక్కరు నా విషయంలో ఇలాగే చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు’’ అంటూ షమీ యూటర్న్ తీసుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం రిపోర్టర్ల వంతైంది.
షమీ వర్సెస్ అగార్కర్
కాగా ఆస్ట్రేలియాతో వన్డేలకు షమీని ఎంపిక చేయకపోవడంపై అగార్కర్ స్పందిస్తూ.. అతడి ఫిట్‌నెస్ గురించి అప్‌డేట్ లేదని చెప్పాడు. ఇందుకు ప్రతిగా షమీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రంజీల్లో ఆడేవాడిని.. వన్డేల్లో ఆడలేనా?.. నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఈ క్రమంలో అగార్కర్ స్పందిస్తూ.. షమీ ఫిట్‌గా లేనందు వల్లే జట్టుకు ఎంపిక చేయలేదని పునరుద్ఘాటించగా... తాను కాదు తన ఆటే మాట్లాడుతుందంటూ షమీ మరోసారి గట్టిగానే ఇచ్చిపడేశాడు.
సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్?
ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్‌పై ఎనిమిది వికెట్లతో చెలరేగిన షమీ.. చెప్పినట్లుగానే ఆటతోనే అగార్కర్‌కు సమాధానమిచ్చాడని ప్రశంసలు కురిశాయి. అయితే, అతడు మాత్రం తాను వివాదాల్లో చిక్కుకోవడానికి మీడియానే కారణమని చెప్పడం గమనార్హం.
కాగా కోల్‌కతాలో జరిగిన ఈ రంజీ మ్యాచ్ సందర్భంగా.. ఈస్ట్‌జోన్ నుంచి టీమిండియా కొత్త సెలక్టర్‌గా ఎంపికైన ఆర్పీ సింగ్.. షమీతో మంతనాలు జరిపాడు. అతడి నుంచి హామీ లభించిన నేపథ్యంలోనే షమీ ఇలా ప్లేట్ తిప్పేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..!


