కాంట్రాక్టర్‌ నుంచి శ్రేయస్‌ అయ్యర్‌ దాకా..! | Here's The List Of Players Who Suffered Horrific Injuries On Cricket Field, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్‌ నుంచి శ్రేయస్‌ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..!

Oct 29 2025 9:40 AM | Updated on Oct 29 2025 12:25 PM

Players who suffered horrific injuries on cricket field

క్రికెటర్లు మైదానంలో గాయపడటం సహజమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదో ఒక రకంగా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కొన్ని సార్లు చిన్న దెబ్బలతో బయటపడినా, మరికొన్ని సార్లు వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. గాయాల వల్ల కొందరి కెరీర్‌లు అర్దంతరంగా ముగియగా.. దురదృష్టకర ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు.

తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) ఫీల్డింగ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. స్ప్లీన్‌లో లేసరేషన్ గాయం కావడంతో అతను కొన్ని రోజులు ఐసీయూలో ఉన్నాడు. మొదట్లో శ్రేయస్‌ గాయం ఆందోళన చెందాల్సింది కాదని అంతా అనుకున్నారు.

అయితే రోజుల గడిచే కొద్ది దాని తీవ్రత బయటపడింది. శ్రేయస్‌కు పక్కటెముకల్లో రక్తస్రావం జరిగి, పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్లరు​ తెలిపారు. దీంతో క్రికెట్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందోనని భారత్‌ క్రికెట్‌ అభిమానులు ఆందోళన పడ్డారు.

అయితే అత్యుత్తమ చికిత్స అందడం వల్ల శ్రేయస్‌ త్వరగానే కోలుకొని సేఫ్‌ జోన్‌లో పడ్డాడు. శ్రేయస్‌ ఉదంతం తర్వాత మైదానంలో తీవ్ర గాయాలపాలైన క్రికెటర్లపై చర్చ మొదలైంది.

ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఫిలిప్‌ హ్యూస్‌. మంచి భవిష్యత్తు ఉండిన ఈ ఆస్ట్రేలియా యువ బ్యాటర్‌, 2014లో తలకు బౌన్సర్‌ తగిలి, రెండు రోజుల అనంతరం మృత్యువాత పడ్డాడు.

మైదానంలో తగిలిన గాయం కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో క్రికెటర్‌ రామన్‌ లాంబా. ఈ టీమిండియా ఆటగాడు 1998లో ఢాకాలో జరిగిన ఓ మ్యాచ్‌లో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా, బంతి తలపై బలంగా తాకింది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో లాంబా మూడు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్‌ చరిత్రలో ఇటీవలికాలంలో జరిగిన రెండు దురదృష్టకర ఘటనల ఇవి.  

మైదానంలో తీవ్రంగా గాయపడి అర్దంతరంగా కెరీర్‌లు ముగించిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితా చాలా పెద్దదిగా ఉంది. నారీ కాంట్రాక్టర్‌ మొదలుకొని శ్రేయస్‌ అయ్యర్‌ దాకా ఈ జాబితాలో చాలా మంది స్టార్‌ క్రికెటర్లు ఉన్నారు.

1962లో వెస్టిండీస్ బౌలర్ చార్లీ గ్రిఫిత్ వేసిన బౌన్సర్ తలపై బలంగా తాకడంతో భారత ఆటగాడు నారీ కాంట్రాక్టర్‌ కెరీర్‌ అర్దంతరంగా ముగిసింది.

2000 సంవత్సరంలో టీమిండియా ఆటగాడు సబా కరీం అనిల్‌ కుంబ్లే బౌలింగ్‌లో వికెట్‌కీపింగ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఉదంతంలో కరీం కుడి కంటిని కోల్పోయేవాడు. అదృష్టం కొద్ది చూపు దక్కించుకున్నా, అతని కెరీర్‌ అక్కడితో ముగిసింది.

2012లో సౌతాఫ్రికా వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్‌ కంటికి తీవ్ర రక్తస్రావ గాయమైంది. దీంతో అతను తక్షణమే ఆటకు వీడ్కోలు పలికాడు. బౌచర్‌ మరో క్యాచ్‌ కానీ స్టంపింగ్‌ కానీ చేసుంటే, ప్రపంచంలో 1000 డిస్మిసల్స్‌లో భాగమైన తొలి వికెట్‌ కీపర్‌గా చరిత్రకెక్కేవాడు.

2014లో ఇంగ్లండ్‌ ప్రామిసింగ్‌ క్రికెటర్‌ క్రెయిగ్‌ కీస్వెట్టర్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా, బంతి గ్రిల్‌ లోపటి నుంచి దూసుకొచ్చి ముక్కుపై, కంటిపై తీవ్ర గాయాలు చేసింది. ఈ ఉదంతం తర్వాత అతను 27 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు మైదానంలో చాలానే జరిగాయి. వాటిలో ఇవి కొన్ని మాత్రమే. 

మైదానం వెలుపల జరిగిన ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ల విషయానికొస్తే.. ముందుగా గుర్తొచ్చే పేరు రిషబ్‌ పంత్‌. 2022లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పంత్‌ తిరిగి క్రికెట్‌ ఆడతాడని ఎవరూ ఊహించలేదు. 

ఈ ప్రమాదంలో అతని కాలు తీసేసినంత పని అయ్యింది. అయినా అతను దృడ సంకల్పంతో గాయాన్ని అధిగమించి తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. మునుపటి తరమా ప్రదర్శనలతో సత్తా చాటాడు.

ఒంటి కన్నుతో దేశాన్ని నడిపించిన పటౌడీ
1961లో ఇంగ్లండ్‌లో జరిగిన కారు ప్రమాదంలో భారత దిగ్గజ క్రికెటర్‌ మన్సూర్‌ అలీ ఖాన్ పటౌడి ఓ కంటిని కోల్పోయాడు. ఆతర్వాత అతను ఒంటి కన్నుతో భారత క్రికెట్‌ జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు. 21 ఏళ్ల వయసులో భారత జట్టు కెప్టెన్‌గా నియమితుడైన పటౌడీ.. అప్పట్లో టెస్ట్ క్రికెట్లో అత్యంత చిన్న వయసు గత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

చదవండి: ఆస్ట్రేలియాతో సెమీస్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్‌ న్యూస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement