breaking news
Nari Contractor
-
ముక్కు, చెవుల్లో నుంచి రక్తం.. చావు అంచులకు వెళ్లినా..
బార్బడోస్.. 1962వ సంవత్సరం.. బ్యాటింగ్ చేస్తున్న క్రికెటర్.. ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు.. అతడి ముక్కు, చెవుల నుంచి రక్తం.. చార్లీ గ్రిఫిత్ వేసిన బంతి వేసిన బంతి అతడి ఇన్నింగ్స్నే కాదు.. టెస్టు కెరీర్‌నే ముగించి వేసింది.. ఒక రకంగా అతడు చచ్చి బతికాడు. ఇంతకూ ఎవరా ఆటగాడు?నారీమన్ జంషెడ్జీ కాంట్రాక్టర్ అలియాస్ నారీ కాంట్రాక్టర్.. భారత జట్టు మాజీ కెప్టెన్. 1955లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ బాంబే ప్లేయర్.. 1962 వరకు కెరీర్ కొనసాగించాడు. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా 1960- 61 మధ్య 26 ఏళ్ల వయసులో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.మొత్తంగా తన కెరీర్లో 31 టెస్టులు ఆడిన నారీ కాంట్రాక్టర్.. 1611 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఖాతాలో ఓ సెంచరీ, 11 అర్ధ శతకాలు ఉన్నాయి. నారీ కాంట్రాక్టర్ ఓ ఫైటర్.రైలులో పుట్టాడు..నారీ కాంట్రాక్టర్ ఈ ప్రపంచంలోకి వచ్చిన తీరు అసాధారణమైనది. అతడి తల్లి దాహోద్ నుంచి బాంబేకు రైలులో ప్రయాణిస్తున్న సమయంలోనే పురిటి నొప్పులు వచ్చాయి. అదృష్టవశాత్తూ.. ఆ రైలుకు లోకో పైలెట్ ఆమె సొంత అన్ననే. వెంటనే పరిస్థితిని గమనించి గోధ్రా స్టేషన్లో రైలును ఆపి చెల్లెలికి సుఖ ప్రసవం అయ్యేలా ఏర్పాట్లు చేశాడు. అలా నారీ ఈ భూమ్మీదకు వచ్చాడు.అలా గోధ్రా స్టేషన్లో జన్మించిన నారీ కాంట్రాక్టర్ సొంత జట్టు బాంబేకు కాకుండా.. తన పురిటి స్థానమైన గుజరాత్‌కు దేశీ క్రికెట్లో ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ల్క్టాస్ క్రికెట్ అరంగేట్రంలోనే ఒకే మ్యాచ్‌లో రెండు శతకాలు బాది.. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు.పక్కటెముక నొప్పి వేధిస్తున్నా..ఇలా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన నారీ కాంట్రాక్టర్.. అనతికాలంలోనే జాతీయ జట్టులోకి వచ్చేశాడు. పక్కటెముక విరిగినప్పటికీ లార్డ్స్‌లో అలాగే బ్యాటింగ్ చేశాడు. జట్టు మొత్తం కలిపి ఆ మ్యాచ్‌లో 168 పరుగులు చేస్తే అందులో నారీవే 81 పరుగులు. ఆట పట్ల ఇంతటి అంకిత భావం ఉన్నందు వల్లే.. టీమిండియా యంగెస్ట్ కెప్టెన్‌గా నాడు అతడు నియమితుడయ్యాడు.1961-62లో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టు చేతిలో ఘోరంగా ఓడిపోయింది. కాంట్రాక్టర్ కూడా ఫామ్‌లో లేడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 26 పరుగులే చేశాడు.అరివీర భయంకర పేసర్లుసబీనా పార్కులో రెండో టెస్టు పరాజయం తర్వాత బార్బడోస్‌తో టూర్ మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లింది టీమిండియా. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత భయంకరమైన పేస్ బౌలింగ్ విభాగం కలిగిన జట్టుగా విండీస్‌కు పేరు. నాటి జట్టులో చార్లీ గ్రిఫిత్ (charles griffith), వెస్ హాల్, జార్జ్ రాక్ వంటి అరివీర భయంకర పేసర్లు ఉన్నారు. ప్రపంచ బ్యాటర్లకు వాళ్లంటే అప్పట్లో వణుకు.గ్రిఫిత్‌తో జాగ్రత్తఈ మ్యాచ్‌కు ముందు కాంట్రాక్టర్ ఓ కాక్టెయిల్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడ విండీస్ కెప్టెన్ ఫ్రాంక్ వోరెల్ కూడా ఉన్నాడు. నారీని పక్కకు తీసుకువెళ్లి.. ‘వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లతో జాగ్రత్త. మా వాళ్లు ఇటీవలి కాలంలో బ్యాటర్లను వరుసగా గాయపరుస్తున్నారు. ముఖ్యంగా గ్రిఫిత్‌తో జాగ్రత్త’ అని హెచ్చరించాడు.గ్రిఫిత్ 18 ఏళ్ల ఓ బ్యాటర్‌ను తీవ్రంగా గాయపరిచి.. కనీసం సారీ కూడా చెప్పలేదని.. కాబట్టి అతడితో జాగ్రత్త ఉంటే మంచిదని ఫ్రాంక్.. నారీకి వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి నారీ కాంట్రాక్టర్ ఆ నామమాత్రపు మ్యాచ్ ఆడవద్దని అనుకున్నాడు. విశ్రాంతి తీసుకోవాలని భావించాడు.ఫాస్ట్ బౌలింగా.. తొక్కా!అయితే, భారత జట్టును అప్పటికే గాయాల బెడద వేధిస్తుండటంతో నారీ కూడా ఆడాల్సి వచ్చింది. బార్బడోస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 394 పరుగులు సాధించింది. రెండో రోజు భోజన విరామ సమయానికి ముందు భారత్ బ్యాటింగ్‌కు దిగింది. గ్రిఫిత్ లంచ్‌కు ముందు ఓ ఓవర్ వేశాడు.అయితే, ఫ్రాంక్ హెచ్చరించినంతగా అతడు అంత డేంజరేమీ కాదని నారీకి అనిపించింది. బ్రేక్ సమయంలో సర్దేశాయ్ సైతం.. ‘‘ఫాస్ట్ బౌలింగా.. తొక్కా’’ అంటూ గ్రిఫిత్‌ను తక్కువ చేసేలా మాట్లాడాడు. అయితే, భోజనం తర్వాత అంతా తలకిందులైంది. తన తొలి ఓవర్లోనే గ్రిఫిత్ సర్దేశాయ్‌ను డకౌట్‌గా వెనక్కి పంపాడు.దీంతో రూసి సుర్తి క్రీజులోకి వచ్చాడు. అతడు చకింగ్ (అనుమానాస్పద రీతిలో బౌలింగ్)చేస్తున్నాడంటూ గ్రిఫిత్‌పై పెద్దగా అరిచాడు. ఇంతలో మరో ఎండ్‌లో ఉన్న నారీ జోక్యం చేసుకుంటూ అంపైర్‌కు ఫిర్యాదు చేయమని చెప్పాడు. అయితే, అందుకు రూసి సమయం తీసుకోగా.. గ్రిఫిత్ బౌలింగ్‌లో నాలుగో బంతిని నారీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ బాల్‌ను డిఫెండ్ చేసుకున్న నారీ కాంట్రాక్టర్.. ఐదో బంతిని ఎదుర్కోనేందుకు సిద్ధమయ్యాడు.ముక్కు, చెవుల్లో నుంచి రక్తంఅప్పుడు గ్రిఫిత్ రాకాసి బౌన్సర్ వేశాడని కొందరు.. లేదు లేదు అది షార్ట్ లెంగ్త్ బాల్ అని మరి కొందరు అనుకున్నారు. నారీ కూడా బంతిని జడ్జ్ చేయలేకపోయాడు. దీంతో బంతి ముఖంపై బలంగా తాకడంతో నారీ కుప్పకూలిపోయాడు. ముక్కు, చెవుల్లో నుంచి రక్తం కారడం మొదలైంది. అప్పటి టీమిండియా మేనేజర్ గులామ్ అహ్మద్ వెంటనే మైదానంలోకి వచ్చి అతడిని తీసుకుని వెళ్లాడు.రక్తపు మరకలతో నిండిన దుస్తులను నారీ మార్చుకున్నాడు. అయితే, ఆ తర్వాత కూడా రక్తస్రావం ఆగలేదు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఓవైపు నారీ ప్రాణాల కోసం పోరాడుతుంటే.. మరోవైపు మ్యాచ్ కొనసాగింది. క్రీజులోకి వచ్చిన విజయ్ మంజ్రేకర్‌ను కూడా గ్రిఫిత్ గాయపరిచాడు. అతడి ముక్కుపై బంతి బలంగా తాకింది.ప్రాణాలకు ముప్పు మరోవైపు.. ఆస్పత్రిలో ఉన్న నారీ కాంట్రాక్టర్ పరిస్థితి దిగజారింది. వాంతులు మొదలయ్యాయి. అతడి శరీరంలోని ఎడమభాగం స్టక్ అయిపోయింది. వెంటనే అతడికి ఆపరేషన్ చేయించాలని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే, బ్రెయిన్ స్పెషలిస్టు ఎవరూ అక్కడ అందుబాటులో లేరు.ట్రినిడాడ్ నుంచి మరునాడు ఉదయమే డాక్టర్ వస్తాడు. అప్పటిదాకా వేచి ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. లోకల్ సర్జన్ వచ్చి తను చేయాల్సిన పని చేశాడు. ఏదైతేనేమి నారీ కాంట్రాక్టర్ ప్రాణం నిలిచింది. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి.విండీస్ కెప్టెన్ రక్తదానంవిండీస్ కెప్టెన్ ఫ్రాంక్ వోరెల్ సహా చాలా మంది ఆటగాళ్లు రక్త దానం చేసి.. నారీ కాంట్రాక్టర్‌ను బతికించుకునే ప్రయత్నం చేశారు. చందూ బోర్డే, బాపూ నడ్కర్ణి, పాలీ ఉమ్రిగర్ తదితరులు రక్తం ఇచ్చారు. నిజమైన క్రీడా స్ఫూర్తి, స్నేహ భావానికి వీళ్లంతా ప్రతీకలుగా నిలిచారు. ఆపరేషన్ పూర్తైన ఆరు రోజుల తర్వాత నారీ కాంట్రాక్టర్ స్పృహలోకి వచ్చాడు.నా వల్లే జరిగిందిఅతడి భార్య హుటాహుటిన ఇండియా నుంచి బయల్దేరి బార్బడోస్‌కు వచ్చింది. బార్బడోస్‌ను వీడే ముందు కాంట్రాక్టర్ తన భార్యకు ఓ మాట చెప్పాడు. ‘ఇందులో గ్రిఫిత్ తప్పేమీ లేదు. ఇదంతా నా పొరపాటు వల్లే జరిగింది’ అని కాంట్రాక్టర్ అన్నాడు. ఆ తర్వాత కూడా అప్పట్లో హెల్మెట్లు లేకపోవడం, ఓవర్లో ఎన్ని బౌన్సర్లు వేస్తారో ముందుగానే చెప్పకపోవడం వంటివి తన గాయానికి కారణమని నారీ చెప్పుకొచ్చాడు. అందరు ఆటగాళ్లకు ఒకే రకమైన నిబంధనలు ఉండేవని.. అయితే, తన అజాగ్రత్త వల్లే ప్రాణాలకు ముప్పు వచ్చిందని కుండబద్దలు కొట్టాడు.అయితే, ఆ తర్వాత నారీ కాంట్రాక్టర్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సివచ్చింది. తలకు బలంగా గాయమైనందున ఆటకు దూరంగా ఉంటేనే మంచిదని వైద్యులు సలహా ఇచ్చారు.పట్టువీడని ఫైటర్అయితే, నారీ ఫైటర్ కదా!.. గాయం నుంచి కోలుకున్న పది నెలల తర్వాత మళ్లీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. పరుగులు రాబట్టాడు. అయితే, టీమిండియా సెలక్టర్లు మాత్రం అతడిని మళ్లీ ఎంపిక చేయలేదు. నారీ పరిస్థితి గుర్తుకువచ్చి బహుశా వారు భయపడి ఉంటారు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత వహించాల్సి వస్తుందని నారీని పూర్తిగా పక్కనపెట్టారు.ఇక గుజరాత్ తరఫున 1971 వరకు నారీమన్ కాంట్రాక్టర్ క్రికెట్ ఆడాడు. తన చివరి మ్యాచ్‌లో 93 పరుగులు సాధించాడు. అయితే, వెస్టిండీస్ టూర్ తర్వాత అతడు మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోలేకపోయాడు. అయినా తనకు ఇష్టమైన ఆటను కొనసాగిస్తూ పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగాడు.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు -
కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ అయ్యర్ దాకా..!
క్రికెటర్లు మైదానంలో గాయపడటం సహజమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదో ఒక రకంగా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కొన్ని సార్లు చిన్న దెబ్బలతో బయటపడినా, మరికొన్ని సార్లు వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. గాయాల వల్ల కొందరి కెరీర్లు అర్దంతరంగా ముగియగా.. దురదృష్టకర ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు.తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. స్ప్లీన్‌లో లేసరేషన్ గాయం కావడంతో అతను కొన్ని రోజులు ఐసీయూలో ఉన్నాడు. మొదట్లో శ్రేయస్ గాయం ఆందోళన చెందాల్సింది కాదని అంతా అనుకున్నారు.అయితే రోజుల గడిచే కొద్ది దాని తీవ్రత బయటపడింది. శ్రేయస్‌కు పక్కటెముకల్లో రక్తస్రావం జరిగి, పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్లరు తెలిపారు. దీంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందోనని భారత్ క్రికెట్ అభిమానులు ఆందోళన పడ్డారు.అయితే అత్యుత్తమ చికిత్స అందడం వల్ల శ్రేయస్ త్వరగానే కోలుకొని సేఫ్ జోన్లో పడ్డాడు. శ్రేయస్ ఉదంతం తర్వాత మైదానంలో తీవ్ర గాయాలపాలైన క్రికెటర్లపై చర్చ మొదలైంది.ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఫిలిప్ హ్యూస్. మంచి భవిష్యత్తు ఉండిన ఈ ఆస్ట్రేలియా యువ బ్యాటర్, 2014లో తలకు బౌన్సర్ తగిలి, రెండు రోజుల అనంతరం మృత్యువాత పడ్డాడు.మైదానంలో తగిలిన గాయం కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో క్రికెటర్ రామన్ లాంబా. ఈ టీమిండియా ఆటగాడు 1998లో ఢాకాలో జరిగిన ఓ మ్యాచ్‌లో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా, బంతి తలపై బలంగా తాకింది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో లాంబా మూడు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ చరిత్రలో ఇటీవలికాలంలో జరిగిన రెండు దురదృష్టకర ఘటనల ఇవి. మైదానంలో తీవ్రంగా గాయపడి అర్దంతరంగా కెరీర్లు ముగించిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితా చాలా పెద్దదిగా ఉంది. నారీ కాంట్రాక్టర్ మొదలుకొని శ్రేయస్ అయ్యర్ దాకా ఈ జాబితాలో చాలా మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు.1962లో వెస్టిండీస్ బౌలర్ చార్లీ గ్రిఫిత్ వేసిన బౌన్సర్ తలపై బలంగా తాకడంతో భారత ఆటగాడు నారీ కాంట్రాక్టర్ కెరీర్ అర్దంతరంగా ముగిసింది.2000 సంవత్సరంలో టీమిండియా ఆటగాడు సబా కరీం అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో వికెట్‌కీపింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఉదంతంలో కరీం కుడి కంటిని కోల్పోయేవాడు. అదృష్టం కొద్ది చూపు దక్కించుకున్నా, అతని కెరీర్ అక్కడితో ముగిసింది.2012లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ మార్క్ బౌచర్ కంటికి తీవ్ర రక్తస్రావ గాయమైంది. దీంతో అతను తక్షణమే ఆటకు వీడ్కోలు పలికాడు. బౌచర్ మరో క్యాచ్ కానీ స్టంపింగ్ కానీ చేసుంటే, ప్రపంచంలో 1000 డిస్మిసల్స్లో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కేవాడు.2014లో ఇంగ్లండ్ ప్రామిసింగ్ క్రికెటర్ క్రెయిగ్ కీస్వెట్టర్ బ్యాటింగ్ చేస్తుండగా, బంతి గ్రిల్ లోపటి నుంచి దూసుకొచ్చి ముక్కుపై, కంటిపై తీవ్ర గాయాలు చేసింది. ఈ ఉదంతం తర్వాత అతను 27 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు మైదానంలో చాలానే జరిగాయి. వాటిలో ఇవి కొన్ని మాత్రమే. మైదానం వెలుపల జరిగిన ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ల విషయానికొస్తే.. ముందుగా గుర్తొచ్చే పేరు రిషబ్ పంత్. 2022లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ తిరిగి క్రికెట్ ఆడతాడని ఎవరూ ఊహించలేదు. ఈ ప్రమాదంలో అతని కాలు తీసేసినంత పని అయ్యింది. అయినా అతను దృడ సంకల్పంతో గాయాన్ని అధిగమించి తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. మునుపటి తరమా ప్రదర్శనలతో సత్తా చాటాడు.ఒంటి కన్నుతో దేశాన్ని నడిపించిన పటౌడీ1961లో ఇంగ్లండ్‌లో జరిగిన కారు ప్రమాదంలో భారత దిగ్గజ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ఓ కంటిని కోల్పోయాడు. ఆతర్వాత అతను ఒంటి కన్నుతో భారత క్రికెట్ జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు. 21 ఏళ్ల వయసులో భారత జట్టు కెప్టెన్‌గా నియమితుడైన పటౌడీ.. అప్పట్లో టెస్ట్ క్రికెట్లో అత్యంత చిన్న వయసు గత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.చదవండి: ఆస్ట్రేలియాతో సెమీస్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ -
టీమిండియా మాజీ కెప్టెన్ తలలో మెటల్ ప్లేట్.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు!
నారీ కాంట్రాక్టర్.. ఈ పేరు ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేదు. కాలంలో కొంచెం వెనక్కి వెళితే మాత్రం నారీ కాంట్రాక్టర్ పేరు సుపరిచితమే. 1950-60ల మధ్య కాలంలో టీమిండియా క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాదు నారీ కాంట్రాక్టర్ టీమిండియాకు కెప్టెన్‌గానూ పని చేయడం విశేషం. ఇదంతా సరే.. ఇప్పుడెందుకు ఈ క్రికెటర్ ప్రస్తావన అనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. బౌన్సర్ దాటికి నారీ కాంట్రాక్టర్ తలకు దెబ్బ తగలడంతో క్రికెట్ కెరీర్ అర్థంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత అతని తలలో ఒక మెటల్ ప్లేట్ అమర్చారు. ఇదంతా 1962 నాటి మాట.. కట్‌చేస్తే 60 ఏళ్ల తర్వాత వైద్యులు నారీ కాంట్రాక్టర్ తలలో నుంచి మెటల్ ప్లేట్‌ను విజయవంతగా తొలగించారు. ప్రస్తుతం నారీ కాంట్రాక్టర్ వయసు 80 ఏళ్లు. మెటల్ ప్లేట్ తొలగింపు తర్వాత ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు నారీ కాంట్రాక్టర్ కుమారుడు హెషెడర్ పేర్కొన్నాడు. అసలేం జరిగింది..? 1962లో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించింది. ఆ పర్యటనే నారీ కాంట్రాక్టర్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుంతుందని బహుశా ఊహించి ఉండడు. విండీస్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బౌలర్ వేసిన బౌన్సర్ నారీ కాంట్రాక్టర్ తలకు బలంగా తగిలింది. దీంతో క్రీజులోనే నారీ కాంట్రాక్టర్ కుప్పకూలాడు. అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఆ తర్వాత భారతదేశానికి పంపించారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ చండీ ఆధ్వర్యంలో నారీ కాంట్రాక్టర్ తలకు తగిలిన దెబ్బను పరిశీలించి మెటల్ ప్లేట్‌ను అమర్చారు. అప్పటినుంచి బాగానే ఉన్నప్పటికి ఇటీవలే స్కానింగ్ చేయగా.. మెటల్ ప్లేట్ వల్ల చర్మం ఉడిపోతూ వచ్చింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆపరేషన్ నిర్వహించి తలలోని మెటల్ ప్లేట్‌ను తొలగించారు. కాగా నారీ కాంట్రాక్టర్ తలకు దెబ్బ తగలడానికి ముందే ఔటయ్యే అవకాశం వచ్చింది. నారీ ఇచ్చిన క్యాచ్ విండీస్ ఫీల్డర్ జారవిడవడంతో.. బౌన్సర్ ఆడి శాశ్వతంగా క్రికెట్‌కు దూరమయ్యాడు నారీ కాంట్రాక్టర్. టీమిండియా తరపున 1955-62 మధ్య కాలంలో 31 టెస్టుల్లో 1611 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1955-62 మధ్య కొంతకాలం టీమిండియా కెప్టెన్‌గానూ పని చేశాడు. చదవండి: Deepak Hooda-Krunal Pandya: 'ఒకప్పుడు కొట్టుకునే స్థాయికి'.. కట్‌చేస్తే మ్యాచ్ గెలిచిన సంతోషం ముద్దుతో ఉక్కిరిబిక్కిరి; ట్విస్ట్ ఏంటంటే


