నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో రేపు (అక్టోబర్ 30) జరుగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌కు (India vs Australia) ముందు టీమిండియాకు (Team India) బ్యాడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు (ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా) దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ అలైస్సా హీలీ (Alyssa Healy) ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానుంది.
ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. హీలీ ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆమె, పునరాగమనం సంకేతాలు ఇచ్చింది. సెమీస్‌లో హీలీ బరిలోకి దిగితే టీమిండియాను కష్టాలు తప్పవు.
గాయపడక ముందు ఆమె అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండింది. వరుసగా భారత్, బంగ్లాదేశ్‌పై సెంచరీలు (142, 113 నాటౌట్) చేసింది. ఇదే ఫామ్‌ను హీలీ సెమీస్‌లోనూ కొనసాగిస్తే.. టీమిండియా ప్రపంచకప్ సాధించాలన్న కల తలకిందులయ్యే ప్రమాదం ఉంది.
ఈ టోర్నీలో హీలీ 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 98 సగటున 298 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా సెమీస్‌కు చేరింది. లీగ్ దశలో న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై విజయాలు సాధించి, జైత్రయాత్రను కొనసాగిస్తుంది.
భారత్ విషయానికొస్తే.. చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించిన భారత్.. టోర్నీ ప్రారంభంలో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌లపై విజయాలు సాధించి, ఆతర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇంగ్లండ్ చేతుల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది.
ఈ టోర్నీ నుంచి మరో రెండు సెమీస్ బెర్త్‌లు ఇంగ్లండ్, సౌతాఫ్రికాకు దక్కాయి. ఇరు జట్లు ఇవాళ (అక్టోబర్ 29) జరుగబోయే తొలి సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.


