పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఫార్మాట్లకతీతంగా అతను వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్ సెంచరీ చేసి రెండేళ్లైపోయింది. ఈ మధ్యలో 75 ఇన్నింగ్స్‌లు ఆడినా ఓ మూడంకెల స్కోర్ లేదు.
టెస్ట్‌ల్లో, వన్డేల్లో వరుస వైఫల్యాలు ఎదుర్కొన్న బాబర్.. తాజాగా టీ20 ఫార్మాట్‌లోనూ చెత్త ప్రదర్శనను కొనసాగించాడు. దాదాపుగా ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చి రెండు బంతుల్లో డకౌటయ్యాడు. ఈ ప్రదర్శన తర్వాత బాబర్‌పై ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది.
సొంత అభిమానులు కూడా అతన్ని భరించడం లేదు. వీడు మనకొద్దు రా బాబూ అంటూ తలలు బాదుకుంటున్నారు.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య నిన్న (అక్టోబర్ 28) తొలి టీ20 (Pakistan vs South Africa) జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ సహా పాక్ ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా ఆ జట్టు సౌతాఫ్రికా చేతిలో 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. టోనీ డి జోర్జి (33), జార్జ్ లిండే (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ (40-26-3), సైమ్ అయూబ్ (4-0-31-2) రాణించారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఓ మోస్తరు ఆరంభం లభించినా ఆ తర్వాత పేకమేడలా కూలింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ 24, సైమ్ అయూబ్ 37 పరుగులకు ఔటయ్యారు. అంతా అయిపోయాక మొహమ్మద్ నవాజ్ (36) కాసేపు బ్యాట్ ఝులిపించాడు.
సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ (4-0-14-4), జార్జ్ లిండే (3-0-31-3), లిజాడ్ విలియమ్స్ (3.1-0-21-2) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ పతనాన్ని శాశించారు. ఈ మ్యాచ్‌లో 9 మంది రెగ్యులర్ ప్లేయర్లు లేకపోయినా సౌతాఫ్రికా పాక్‌ను చిత్తుగా ఓడించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 అక్టోబర్ 31న లాహోర్‌లో జరుగుతుంది.
చదవండి: మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం..


