భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన అరంగేట్రానికి దోహదపడిన సహచర ఆటగాడికి ఓ మాట ఇచ్చానని.. పదిహేనేళ్ల తర్వాత ప్రామిస్ నిలబెట్టుకున్నానని తెలిపాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు?.. అతడికి సచిన్ ఇచ్చిన మాట ఏంటి?!
ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా
టీమిండియా తరఫున 1989 నవంబరులో సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అంతకంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తరఫున సచిన్ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించి టీమిండియాలో అడుగుపెట్టాడు.
అతడి త్యాగంతో సెంచరీ
ఈ విషయాన్ని సచిన్ టెండుల్కర్ ఇటీవలే స్వయంగా వెల్లడించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా (Rest Of India) తొమ్మిది వికెట్లు కోల్పోయిన వేళ.. సచిన్ సెంచరీకి చేరువగా ఉన్నాడు. అలాంటి సమయంలో గురుశరణ్ సింగ్ (Gursharan Singh) విరిగిన చేతితోనే బ్యాటింగ్‌కు వచ్చి.. సచిన్‌కు సహకారం అందించాడు.
ఫలితంగా సచిన్ శతకం పూర్తి చేసుకోవడం.. తద్వారా టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గురుశరణ్ సింగ్ త్యాగానికి ప్రతిగా.. సచిన్ అతడికి ఓ మాట ఇచ్చాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నాడు.
ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్ అవుతావు
ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘రిటైర్ అయిన క్రికెటర్ల కోసం అప్పట్లో బెన్‌ఫిట్ మ్యాచ్‌లు నిర్వహించేవారు. ఆరోజు (1990) న్యూజిలాండ్‌లో గురుశరణ్‌కు నేను ఓ మాట ఇచ్చాను.
‘గుశీ.. జీవితాంతం ఎవరూ ఆడుతూనే ఉండలేరు కదా! ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్ అవుతావు. అలా నువ్వు రిటైర్ అయ్యి బెన్‌ఫిట్ మ్యాచ్ కోసం ఆటగాళ్లు కావాల్సినపుడు నేను నీకోసం వచ్చి ఆడతాను’ అని చెప్పాను. అన్నట్లుగానే అతడి కోసం బెన్‌ఫిట్ మ్యాచ్ ఆడాను.
పదిహేనేళ్ల తర్వాత
‘గుశీ.. న్యూజిలాండ్‌లో నీకు ఓ మాట ఇచ్చాను కదా! పదిహేనేళ్ల తర్వాత (2005) దానిని నిలబెట్టుకుంటున్నా’ అని చెప్పాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో నిల్చిపోతాయి. ‘ఆరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’ అని ఈరోజు సగర్వంగా నేను చెప్పగలను’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే!


