జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేతగా సాక్షి టీవీ నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో టీవీ-9ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సాక్షి.. తొలి జేపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. తుది పోరులో ప్రత్యర్ధి జట్టు నిర్ధేశించిన 92 పరుగుల లక్ష్యాన్ని సాక్షి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఊదిపడేసింది.

ఓపెనర్లు చైతన్య(21), రమేశ్(35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీవీ-9.. 19.4 ఓవర్లలో 91 పరుగులకే కుప్పకూలింది. సాక్షి బౌలర్లలో రమేశ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శ్రీనాథ్ రెండు, శ్రీను, అగ్ని ఓ వికెట్ సాధించారు.
ఈ ఏడాది సీజన్‌ను సాక్షి టీవీ అజేయంగా ముగించింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ విజయ ఢంకా మోగించింది. ఈ సీజన్ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రమేష్ (190 పరుగులు) ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు కూడా అతడికే లభించింది.
సాక్షి టీమ్‌కు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు
జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేత అయిన సాక్షి టీవీ జట్టు కు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితెలియజేశారు . క్రీడా స్ఫూర్తితో ఈ లీగ్ లో పాల్గొన్న అన్ని మీడియా సంస్థలను మంత్రి అభినందించారు.
నిత్యం వార్తల సేకరణలో ఉంటూ బిజీ షెడ్యూల్ గడిపే జర్నలిస్టు లకు ఇలాంటి క్రీడలు ఉల్లాసాన్నిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో మీడియా మిత్రులకు ఇలాంటి క్రీడలపై ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు.


