
సాక్షి, ఢిల్లీ: సాక్షి టీవీ డిబేట్ కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు తాజాగా పర్మినెంట్ బెయిల్‌గా మారుస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. అదే సమయంలో గతంలో లైవ్ షో విషయంలో ఇచ్చిన ఆదేశాలనూ సవరించింది. దీంతో ఈ కేసు విచారణ ముగిసినట్లయ్యింది.
సాక్షి చానెల్‌లో ఓ గెస్ట్ చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఎలాంటి విచారణ చేయకుండానే కొమ్మినేని శ్రీనివాసరావును జూన్ 9వ తేదీన ఏపీ పోలీసులు నేరుగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. జూన్ 13వ తేదీన కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో సాక్షి టీవీ డిబేట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తొలగించింది.
టీవీ షో లో గెస్టు చేసే పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతించవద్దంటూ మధ్యంతర బెయిల్ సమయంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే లైవ్‌లో చేసే గెస్ట్‌లు చేసే వ్యాఖ్యలను ఎలా కంట్రోల్ చేయగలమన్న కొమ్మినేని తరపు న్యాయవాది అభ్యర్థించారు. దీంతో ఆ ఆదేశాలను జస్టిస్ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథ్ ధర్మాసనం సవరించింది.
అదే సమయంలో.. అరెస్ట్ విషయంలో ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ తప్పనిసరిగా పాటించాలని, ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో ముందుగా 41 ఏ నోటీసు ఇచ్చి ప్రాథమిక విచారణ చేయాలని ఏపీ పోలీసులకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో కొమ్మినేని తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.
మధ్యంతర బెయిల్ తీర్పు సమయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. గెస్ట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే.. యాంకర్‌ను ఎలా బాధ్యుడ్ని చేస్తారు?. కేవలం టీవీ డిబేటలో నవ్వినంత మాత్రానా అరెస్ట్ చేస్తారా? అలాగైతే కోర్టులో విచారణ సందర్భంగా చాలాసార్లు మేం నవ్వుతాం. వాక్ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. కొమ్మినేనిని తక్షణమే విడుదల చేయాలి అని సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సెలవుల కారణంగా మూడు రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
