
దీనిపై ప్రభుత్వం సమాధానమివ్వాల్సిందేని స్పష్టీకరణ
రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం
వెంటనే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రైవేట్ మల్టీసిస్టమ్ ఆపరేటర్ ఎలా వాదిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో తన వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ.. తమ చానల్‌ను ప్రజలకు చేరకుండా అణచివేస్తున్నారంటూ ‘సాక్షి’ టీవీ యాజమాన్యం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్‌కర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
ప్రజలను, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు..
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్‌కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తూ.. ‘సాక్షి టీవీ ప్రసారాలను ఏపీ ప్రభుత్వం పూర్తిగా అడ్డుకుంటోంది. తన అధికారాన్ని, యంత్రాంగాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించి సాక్షి చానల్‌ను ప్రజలకు దూరం చేస్తోంది. మా ప్రసారాలు ఎక్కడా కనిపించడం లేదు. కొందరు ఎమ్మెస్వోలు నిబంధనల ప్రకారం ‘అలా కార్టే’ పద్ధతిలో చానళ్లను అందిస్తున్నామని చెప్పడం కేవలం కంటితుడుపు చర్యే. కోర్టు విచారణకు రెండు రోజుల ముందు మాత్రమే మా చానల్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. విచారణ ముగిసిన వెంటనే మళ్లీ ప్రసారాలు నిలిపివేస్తున్నారు. ఇది ప్రజలను, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడమే’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం తరఫున ప్రైవేట్ ఆపరేటర్ ఎలా వాదిస్తారు?
ఎమ్మెస్వో తరఫు న్యాయవాది ఆర్యమ సుందరం స్పందిస్తూ.. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. పిటిషనర్ చానల్‌ను ‘అలా కార్టే’ విధానంలో అందిస్తున్నామని తెలిపారు. దీనిపై జస్టిస్ నరసింహం అసహనం వ్యక్తం చేశారు. ‘అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటప్పుడు, ప్రభుత్వం తరఫున ఒక ప్రైవేట్ ఆపరేటర్ ఎలా వాదిస్తారు? ఇది ఎంతమాత్రం సరికాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి బదులుగా సమాధానం చెప్పడాన్ని తాము అంగీకరించబోమని హెచ్చరించారు. ప్రధాన ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నందున.. ఈ కేసులో వారే స్వయంగా సమాధానం చెప్పాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ స్పందన అత్యంత కీలకమని పేర్కొంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేసేందుకు.. విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వీలైనంత త్వరగా చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది.