breaking news
TV broadcasts
-
‘సాక్షి’ నిలిపివేతపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రైవేట్ మల్టీసిస్టమ్ ఆపరేటర్ ఎలా వాదిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో తన వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ.. తమ చానల్‌ను ప్రజలకు చేరకుండా అణచివేస్తున్నారంటూ ‘సాక్షి’ టీవీ యాజమాన్యం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రజలను, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్‌కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తూ.. ‘సాక్షి టీవీ ప్రసారాలను ఏపీ ప్రభుత్వం పూర్తిగా అడ్డుకుంటోంది. తన అధికారాన్ని, యంత్రాంగాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించి సాక్షి చానల్‌ను ప్రజలకు దూరం చేస్తోంది. మా ప్రసారాలు ఎక్కడా కనిపించడం లేదు. కొందరు ఎమ్మెస్వోలు నిబంధనల ప్రకారం ‘అలా కార్టే’ పద్ధతిలో చానళ్లను అందిస్తున్నామని చెప్పడం కేవలం కంటితుడుపు చర్యే. కోర్టు విచారణకు రెండు రోజుల ముందు మాత్రమే మా చానల్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. విచారణ ముగిసిన వెంటనే మళ్లీ ప్రసారాలు నిలిపివేస్తున్నారు. ఇది ప్రజలను, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడమే’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరఫున ప్రైవేట్ ఆపరేటర్ ఎలా వాదిస్తారు? ఎమ్మెస్వో తరఫు న్యాయవాది ఆర్యమ సుందరం స్పందిస్తూ.. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. పిటిషనర్ చానల్‌ను ‘అలా కార్టే’ విధానంలో అందిస్తున్నామని తెలిపారు. దీనిపై జస్టిస్ నరసింహం అసహనం వ్యక్తం చేశారు. ‘అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటప్పుడు, ప్రభుత్వం తరఫున ఒక ప్రైవేట్ ఆపరేటర్ ఎలా వాదిస్తారు? ఇది ఎంతమాత్రం సరికాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి బదులుగా సమాధానం చెప్పడాన్ని తాము అంగీకరించబోమని హెచ్చరించారు. ప్రధాన ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నందున.. ఈ కేసులో వారే స్వయంగా సమాధానం చెప్పాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ స్పందన అత్యంత కీలకమని పేర్కొంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేసేందుకు.. విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వీలైనంత త్వరగా చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
‘జీ’ పై చర్యలకు డిస్నీ స్టార్ కసరత్తు
న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులకు సంబంధించిన ఒప్పందం నుంచి తప్పుకున్నందుకు గాను కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిస్నీ స్టార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ భారత విభాగం విలీన డీల్ రద్దుతో సతమతమవుతున్న జీకి ఈ పరిణామం మరింత సమస్యాత్మకంగా మారవచ్చని వివరించాయి. నాలుగేళ్ల పాటు ఐసీసీ మెన్స్, అండర్–19 క్రికెట్ టీవీ ప్రసార హక్కుల కోసం డిస్నీ స్టార్‌తో 2022లో జీ 1.4 బిలియన్ డాలర్ల సబ్–లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద తొలి విడతగా 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. సోనీతో డీల్ కుదిరితే వచ్చే నిధుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లించవచ్చని జీ భావించింది. కానీ అది రద్దవడంతో చెల్లింపులు జరపలేకపోయింది. తదుపరి ఈ విషయంలో ముందుకెళ్లదల్చుకోవడం లేదంటూ డిస్నీ స్టార్‌కి తెలిపింది. దీంతో డిస్నీ స్టార్ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా సమాచారం. -
వచ్చే ఏడాది నుంచి మొబైల్ ఫోన్లలో టీవీ ప్రసారాలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి మొబైల్ ఫోన్లలో టీవీ కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ప్రసారభారతి కసరత్తు చేస్తోంది. ప్రైవేట్ మీడియా హౌజెస్ భాగస్వామ్యంతో మోబైల్ ఫోన్లలో సుమారు 20 చానెల్స్‌ను ప్రసారం చే యనుంది. ప్రస్తుతం మూడు విధాలుగా డిష్, కేబుల్, ఎంటినాల ద్వారా ప్రసారాలను అందజేస్తోంది. నాలుగో విధానంలో డిజిటల్ ఎంటీనాల ద్వారా 20 ప్రీ చానెళ్లను టీవీల్లో, వచ్చే ఏడాది మోబైళ్లలో ప్రసారం చేయనున్నట్లు ప్రసార భారతి ఎగ్జిక్యూటీవ్ అధికారి జవహార్ సిర్కార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముందుగా ఢిల్లీ, ముంబై నగరాల్లో మొబైళ్లలో మొదట ప్రారంభించనున్నారు. ఇందుకోసం దూరదర్శన్ డీవీబీటీ2 సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. డోంగుల్(వైర్లెస్ కనెక్షన్) ప్రవేశపెడుతారు. డీటీహెచ్ ప్లాట్‌ఫాం నుంచే అన్ని ఫ్రీ చానెల్స్‌ను ప్రసారం చేయడమే ధ్యేయమని, ఇందుకోసం ప్రైవేట్ కంపెనీలను భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. డీవీబీటీ(డిజిటల్ వీడియో బ్రాడ్కాస్ట్ టెర్రిస్టియల్) ప్రసారాలు టీవీ టవర్స్ నుంచి అందుతాయి, కానీ ఇందుకు అవసరమైన అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్లలో ఆయా కంపెనీలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కార్యాలయాల పనివేళల్లో టీవీలను చూడలేరు. ఇందుకు మొబైల్ ఫోన్లు, టాబ్లాయిడ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రయాణం చేసేటప్పుడు బ్యాటరీ ద్వారా పనిచేసే మొబైల్ ఫోన్లలో ఎలాంటి ఖర్చు లేకుండా టీవీ చానెళ్లను చూసుకోవచ్చు. అడ్వర్టైజ్ మెంట్ ద్వారా ఆదాయా రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో 225 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు వినియోగంలో ఉన్నాయి. ఇంకా 185190 మిలియన్ల ఫోన్లు వినియోగించనున్నారు. ఇది కొన్ని దేశాల జనాభా కంటే సమానం.