
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేత కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏపీ ఫైబర్ నెట్ సహా పలు ఎంఎస్వోలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై మూడు వారాల్లోగా జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం.. కేబుల్ టీవీ నిబంధనలను ఉల్లంఘించి సాక్షి టీవీ ప్రసారాలను అడ్డుకుంది. ఏపీ ఫైబర్ నెట్, ఎంఎస్వోలు సాక్షి టీవీ ప్రసారాలను అక్రమంగా నిలిపివేయడంపై యాజమాన్యం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ పీఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్ విచారణ జరిపింది. నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వమే సాక్షి టీవీ ప్రసారాలను అడ్డుకుంటున్న వైనాన్ని సుప్రీంకోర్టు దృష్టికి సీనియర్ న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, వి.గిరి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేతపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
పిటిషన్‌లోని కీలక అంశాలు..
- టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ ఫైబర్ నెట్ చానెల్స్ ప్యాకేజీ నుంచి సాక్షి టీవీని తొలగించారు
- సాక్షి టీవీ ప్రసారాలు ఆపి స్వతంత్ర జర్నలిజం గొంతు నొక్కుతున్నారు
- రాష్ట్రంలోని మేజర్ ఎంఎస్వో ఆపరేటర్స్‌ను అధికారులు తీవ్రంగా బెదిరించారు
- సాక్షి టీవీని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు
- తమ మాట వినని ఎంఎస్వోలకు కరెంటు కట్ చేస్తున్నారు
- రాజకీయ ప్రయోజనాలతో సాక్షిటీవీని బ్లాక్ చేస్తున్నారని.. దీని వల్ల తమకు ఆర్థికంగా నష్టం జరుగుతోందని ఎంఎస్వోలు అంటున్నారు
- ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వమే మీడియా స్వేచ్చను హరిస్తోంది
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(ఎ) ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు
- ఏపీ ఫైబర్ నెట్ నుంచి సాక్షి టీవీని తొలగించడం చట్ట విరుద్ధం
- ఇది టెలికమ్యూనికేషన్స్ నియంత్రణ చట్టం 2017, క్లాజ్ 17కు విరుద్ధం
- ఏదైనా చానల్‌ను తొలగించాలంటే 21 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి, కానీ దీన్ని పాటించలేదు
- ఇదే తరహాలో మల్టీసిస్టం ఆపరేటర్స్ (ఎంఎస్ఓ)లపై ఒత్తిడి తెచ్చి సాక్షి టీవీని తొలగించారు
- సాక్షి టీవీని తిరిగి ప్యాకేజీ చానల్స్‌లో పెట్టాలని ఢిల్లీ హైకోర్టు, టీడీ శాట్ ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఫైబర్‌నెట్ అమలు చేయలేదు
- అన్ని అంశాలను పరిశీలించి సాక్షి టీవీ ప్రసారాలను అన్ని ప్లాట్‌ఫాంలలో పునరుద్ధరించాలి
- మీడియా స్వేచ్ఛను హరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని నియంత్రించాలి.