
ఓటుకు కోట్లు కేసులో ఆయనదే కీలకపాత్ర..
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు నిందితుడు మత్తయ్య లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ‘అంతా ఏపీ సీఎం చంద్రబాబే చేశారు.. ఓటుకు కోట్లు కేసులో అతనూ కీలక నిందితుడే. నన్ను స్టీఫెన్‌సన్ వద్దకు పంపడంలో రేవంత్‌తోపాటు ఆయనదీ కీలకపాత్ర. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పారీ్టకి ఓటేసేలా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ఒప్పించాలని బలవంతం చేశారు. రూ. 5 కోట్లు ఆశ చూపాలని చెప్పా రు. కేసు నమోదయ్యాక పోలీసులకు దొరకకుండా నన్ను లోకేశ్ విజయవాడ తరలించారు. అత ని సన్నిహితుల సహకారంతో ఆరేడు నెలలు నిర్బంధించారు.
ఈ కేసులో బాబు, లోకేశ్, ఏబీ వెంకటేశ్వరరావు సహా మరికొందరిని నిందితులుగా చేర్చి.. విచారణ చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కి నిందితుడు మత్తయ్య లేఖ రాశారు. చంద్రబాబు, లోకేశ్.. ఈ కేసులో చేసిన దారుణాలను వివరించారు. మంగళవారం ఆ లేఖను ఢిల్లీలోని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిజిస్ట్రార్ (ఇన్‌వార్డ్)కు అందజేశారు. సుప్రీంకోర్టు లేదా మరేదైనా హైకోర్టులో కేసు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 17 అంశాలతో రాసిన లేఖలో ఆయన పేర్కొన్న వివరాల మేరకు..
చంద్రబాబు, రేవంత్‌లే పంపారు..
‘ఓటుకు కోట్లు వ్యవహారంలోకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌లే నన్ను పంపారు. తీర్పును ప్రకటించే ముందు మరో సారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలని కోరుతున్నా. కేసులో నా ప్రమేయంతోపాటు నేరానికి ప్రోత్సహించిన చంద్రబాబు, అతని కుమారుడు, మంత్రి లోకేశ్ ను కూడా నిందితులుగా చేర్చాలి. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు, పోలీసు అధికారులు, జడ్జీలు, న్యాయవాదులు, వారికి సహక రించిన ప్రతి ఒక్కరినీ నాతోపాటు సమగ్రంగా విచారించాలి. ఏసీబీ పోలీసుల దర్యాప్తులో అధికారిక సాక్ష్యాలు, చంద్రబాబు మాట్లాడిన రికార్డు.. దీని ఫోరెన్సిక్ నివేదిక, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రూ. 50 లక్షల నగదుపై దర్యాప్తు జరగాలి.
చంద్రబాబు, రేవంత్ ప్రోద్బలంతోనే సెబాస్టియన్‌ను ఒప్పించా. 2016లో జరిగిన మహానాడులో చంద్రబాబు, రేవంత్‌లు నన్ను పిలిపించి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు. టీడీపీ అభ్యరి్థకి ఓటు వేసేలా రూ. 5 కోట్లకు నాటి టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ఒప్పించాలన్నారు. ఈ వ్యవహారంలో నన్ను ప్రోత్సహించి, నాతో నేరం చేయించిన చంద్రబాబు, రేవంత్‌తోపాటు భాగ స్వాములైన వారందరిపై దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయండి’ అని మత్తయ్య విజ్ఞప్తి చేశారు.
రేవంత్‌ను సీఎంగా తప్పించండి..
‘ఈ కేసు విచారణ సజావుగా సాగి, నిజానిజాలు బయటకు రావాలంటే రేవంత్‌ను ముఖ్యమంత్రి హోదా నుంచి తప్పించాలి. నాతో సహా, నిందితులందరినీ విచారించేలా మళ్లీ విచారణకు ఆదేశించాలి. రేవంత్, వేం నరేందర్‌రెడ్డి, వేం కీర్తన్, ఉదయ్‌సింహా తదితరులు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో అధికార పదవుల్లో ఉన్నారు. వారు ఏసీబీ అధికారులను ప్రభావితం చేసే అవకాశమే ఎక్కువ. కేసులో వారి పాత్ర లేకుండా చేసేలా ఒత్తిడి తెస్తారు.
దర్యాప్తులో వారి ప్రమేయం ఉండకుండా, తప్పుదోవ పట్టకుండా, ఏసీబీ అధికారులను ప్రభావితం చేయకుండా ఉండాలంటే.. ముందుగా వారిని పదవుల నుంచి తప్పించాలి. విచారణ ముగిసేదాకా పదవులకు దూరంగా ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలి. అంతేకాదు, ఈ కేసు సుప్రీంకోర్టు లేదా ఏపీ, తెలంగాణేతర హైకోర్టులకు బదిలీ చేసి విచారణ చేపట్టాలి’ అని మత్తయ్య కోరారు.
లోకేశ్, అతని సన్నిహితులే నిర్బంధించారు
ఈ కేసు నమోదైనప్పుడు తెలంగాణ పోలీసులకు నన్ను దొరకకుండా చేసేందుకు ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేశ్ విశ్వప్రయత్నం చేశారు. ఆయన సన్నిహితులు కిలారి రాజేశ్, రేవంత్ అనుచరుడు జిమ్మీ బాబు, మరికొందరు కారులో నిర్బంధించారు. బలవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఆ సమయంలో కాళ్లూ, చేతులూ కట్టేయడంతోపాటు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఉండేందుకు కళ్లకు గంతలు కట్టారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు ఆరేడు నెలలు అజ్ఞాతంలో ఉంచారు.
నా భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకు చూపించకుండా.. నా కుటుంబానికి దూరం చేశారు. ఏపీలోని పలు ప్రదేశాల్లో చీకటి గదిలో బంధించి, అడవుల్లో తిప్పుతూ అప్పటి పోలీసులు, లోకేశ్ సన్నిహితులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. నేను ఎక్కడికీ వెళ్లకుండా కాపలాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాటి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, అప్పటి డీజీపీ, టాస్‌్కఫోర్స్ బృందాలు, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా సహకరించారు. వారందర్నీ నిందితులుగా చేర్చి, విచారించాలి.
విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ కేసులో నాతో బలవంతంగా ఫిర్యాదు చేయించారు. 164 స్టేట్‌మెంట్‌పై బలవంతంగా సంతకం పెట్టించారు. వందకు పైగా తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించున్నారు. నా భార్యకు నామినేటెడ్ పదవి ఇస్తామని, అమరావతిలో ఇల్లు, వ్యాపారాభివృద్ధికి సహకరిస్తామని, పిల్లల చదువు, భవిష్యత్‌కు సహకరిస్తామని నమ్మించారు. అలా 164 స్టేట్‌మెంట్‌పై సంతకం చేయించారు. టీడీపీ న్యాయవాదులు కనకమెడల, దమ్మలపాటి, మరికొందరు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు వారికి సహకరించారు.
లోకేశ్ టీం, టీడీ జనార్ధన్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్, కేబినెట్ మంత్రులు, అందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చి పూర్తిగా విచారణ చేయాలి. నేను ఈ లేఖలో పేర్కొన్న విషయాలన్నీ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టు విచారణలో ప్రత్యక్షంగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టులో ‘‘పార్టీ ఇన్ పర్సన్’’గా పిటిషన్ వేశా. ఒక బాధ్యతగల పౌరుడిగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఓటుకు కోట్లు కేసు నిందితుడిగా ఉన్నాను. చేసిన తప్పుకు సిగ్గుపడి పశ్చాత్తాపపడుతున్నా. తప్పు తెలుసుకొని నిజాలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నా. నన్ను అప్రూవర్‌గా అనుమతించండి’ అంటూ మత్తయ్య సీజేఐని అభ్యరి్థంచారు.