ఒక ఊపు ఊపిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది? | Assam Gana Parishad Rise And Fall Explained | Sakshi
Sakshi News home page

ఒక ఊపు ఊపిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది?

Dec 29 2025 9:35 PM | Updated on Dec 29 2025 9:38 PM

Assam Gana Parishad Rise And Fall Explained

అస్సాం గణ పరిషత్..! ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలన విజయంతో రాజకీయాల్లో ఓ ఊపు ఊపిన ఏజీపీ ఇప్పుడు చతికిలపడిపోయిందా? విద్యార్థి నేతలు నడిపిన ఉద్యమంతో.. అధికారంవైపు అడుగులు వేసి.. రికార్డులు సృష్టించిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది? నాలుగు దశాబ్దాల క్రితం క్రిస్మస్‌కు ముందు అస్సాంలో అధికారాన్ని చేపట్టిన ఈ పార్టీ.. ఇప్పుడు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎందుకు తంటాలు పడుతోంది? ఒకప్పుడు అస్సాం రాజకీయాలను పూర్తిగా మార్చేసిన ఏజీపీ ఇప్పుడు పతనం అంచుల్లో ఉందా?  అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నాలుగు దశాబ్దాల క్రితం.. అంటే.. 1985 అక్టోబరు 14న భారత రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అస్సాం గణ పరిషత్ పేరుతో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చరిత్రలో విద్యార్థులు, విద్యార్థి ఉద్యమ నాయకులు నేరుగా రాజకీయాల్లోకి వచ్చి, అదే సంవత్సరం సరిగ్గా క్రిస్మస్ ఈవ్ రోజున.. అంటే.. 1985 డిసెంబరు 24న అధికారాన్ని చేపట్టిన అరుదైన ఘట్టం చోటుచేసుకుంది అప్పుడే..! ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అడ్డుకుని, స్వదేశీయుల అస్తిత్వాన్ని కాపాడేందుకు అప్పట్లో విద్యార్థులు చేసిన ఉద్యమమే.. వారిని అస్సాంలో అధికారం వైపు నడిపించింది. నిజానికి ఇప్పుడు ఎన్నో దేశాల్లో జెన్-జీ ఉద్యమాలు జరుగుతున్నా.. చైనాలోని తియానన్మనెన్ స్క్వేర్ విద్యార్థి ఉద్యమం చరిత్ర పుటల్లో నిలిచినా.. అస్సాం విద్యార్థుల ఉద్యమం ప్రజాస్వామ్య చరిత్రలో ఓ విప్లవమేనని చెప్పవచ్చు. 

బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా ఆరేళ్ల పాటు జరిగిన అస్సాం విద్యార్థి ఉద్యమంలో రెండు విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత.. 1985 ఆగస్టు 15న ఈ రెండు విద్యార్థి సంఘాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. దాని ప్రకారమే అదే ఏడాది అక్టోబరు 14న అస్సాం గణ పరిషత్ పార్టీని ఏర్పాటు చేశాయి. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘన విజయం సాధించింది. క్రిస్మస్ ఈవ్ రోజున అధికార పగ్గాలను చేపట్టింది. అదేరోజున దేశంలోనే అత్యంత యువ ముఖ్యమంత్రిగా ప్రపుల్లకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అలా ఏజీపీ ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంది. కాలేజీ నుంచి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన నేత కూడా ప్రపుల్ల కావడం గమనార్హం..! ఆ సమయంలో ఆయన వయసు 33 సంవత్సరాలే..!

ఏజీపీ ప్రస్తానం తెలుసుకోవాలంటే.. 70లలో జరిగిన పరిణామాలను పరిశీలించాల్సిందే..! 1971లో బంగ్లాదేశ్ అవతరణ జరిగాక.. లక్షల మంది భారత్‌కు అక్రమంగా వలస వచ్చారు. ఇప్పటికీ అస్సాంలో అక్రమ వలసల సమస్య తీవ్రస్థాయిలో ఉంది. అక్రమ వలసలు ఓ ముగింపు లేని సమస్యగా మారిపోయాయి. 1971లో భారత్‌లోకి చొరబడ్డ అక్రమ వలసదారులకు స్థానికులుగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తుండడంతో.. విద్యార్థి సంఘాలు అప్రమత్తమయ్యాయి. ఈ వలసల కారణంగా వెనకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగడం మొదలైంది. 1979 మార్చిలో లోక్‌సభ సభ్యుడు హీరాలాల్ పట్వారీ మరణంతో జరిగిన ఉప ఎన్నికలో.. వేల మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు ఓటర్ల జాబితాలో చోటు లభించిన విషయం వెలుగులోకి వచ్చింది. 

దాంతో.. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. అదే ఏడాది జూన్‌లో ఏఏఎస్‌యూ పిలుపునిచ్చిన బంద్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దాంతో.. మరో కీలక విద్యార్థి సంఘం అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ కూడా ఉద్యమంలో భాగమైంది. అలా.. 1979 నుంచి 1985 ఆగస్టు వరకు విద్యార్థులు నిరంతరాయంగా తమ పోరాటాన్ని సాగించారు. ఈ సుదీర్ఘ ఉద్యమంతో దిగివచ్చిన అప్పటి కేంద్ర ప్రభుత్వం.. విద్యార్థి నాయకుల డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. 1985 ఆగస్టు 15న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 1971 తరువాత అస్సాంలోకి ప్రవేశించిన వారిని బేషరతుగా బంగ్లాదేశ్‌కు తిప్పిపంపాలి. 1966–71 మధ్యకాలంలో వలస వచ్చిన వారికి మాత్రం షరతులతో కూడిన పౌరసత్వం ఇవ్వాలి. ఈ విజయంతో రెండు విద్యార్థి సంఘాలు కలిసి అస్సాం గణ పరిషత్‌గా రాజకీయ పార్టీని నెలకొల్పాయి. అస్సాం సాహిత్య సభ, అస్సాం జాతీయవాద దళ్, పూర్వాంచల్య లోక్ పరిషత్‌తోపాటు పలు ఉద్యోగ సంఘాలు కూడా ఏజీపీతో జతకట్టాయి. పార్టీ అధ్యక్షుడిగా ప్రపుల్ల కుమార్ మహంతా ఎన్నికయ్యారు.

పార్టీగా ఆవిర్భవించిన వెంటనే జరిగిన ఎన్నికల్లో అస్సాం గణ పరిషత్ అఖండ విజయాన్ని సాధించింది. నిజానికి ఏజీపీ నేతలు ఆ ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేశారు. ఘన విజయం తర్వాత ఏజీపీ గొడుగు కిందకు వచ్చారు. అంటే.. ఏజీపీ ఓ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందక ముందే.. 126 స్థానాలకు గాను 92 చోట్ల స్వతంత్రులుగా విద్యార్థి సంఘాల నేతలు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లకు పరిమితమైంది. ఫలితంగా అస్సాం రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. ప్రపుల్లకుమార్ మహంత సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్యమం ముగిసిన వెంటనే.. ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడం భారతదేశ చరిత్రలోనే అది మొదటిసారి. ఆ తర్వాతి కాలంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా, తెలంగాణలో బీఆర్ఎస్ ఆ ఘనతను సాధించాయి.

అధికార పగ్గాలను చేపట్టినకప్పటికీ.. అనుభవ లోపం కారణంగా పరిపాలనలో ఏజీపీ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ప్రపుల్ల కుమార్ నేతృత్వంలోని సర్కారులో భృగు కుమార్ భూయాన్, కేశబ్ మహంత, అతుల్ బోరా లాంటి యువ నేతలు మంత్రులుగా కొనసాగారు. అధికారంలోకి వచ్చినప్పటికీ అనుభవం లేకపోవడంతో చోటుచేసుకున్న పరిణామాలు.. ఏజీపీ సర్కారును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు దారితీసింది. ఉల్ఫా ఉగ్రవాదం, ప్రభుత్వ పెద్దల అవినీతి కారణంగా.. 1980లో కేంద్రం అస్సాం సర్కారును రద్దు చేసింది. 1991లో ఏజీపీ చీలిపోయింది. నూతన్ ఏజీపీ ఏర్పాటైంది. దాంతో.. ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ పతనం దిశలో అడుగులు వేసింది. 1991లో జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 19 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారపగ్గాలను చేపట్టింది.

విడిపోయి ఓటమిపాలైన ఏజీపీ నేతలు తమ తప్పును తెలుసుకుని, మళ్లీ కలిశారు. 1996 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. 59 స్థానాల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చారు. అత్తెసరు మెజారిటీ కావడంతో.. పరిపాలన సవ్యంగా సాగలేదనే చెప్పలి. 2001లో ఏజీపీ మరోమారు పరాజయం పాలవ్వగా.. కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అస్సాంలో బలమైన పునాదులను వేసుకుంది. అయితే.. బీజేపీ వైపు మళ్లే ప్రతీ ఓటు.. ఏజీపీ ఖాతా నుంచి మైనస్ కావడం మొదలైంది. 

అలా బీజేపీ బలపడుతున్న కొద్దీ.. ఏజీపీ పునాదులు దెబ్బతినడం మొదలైంది. అనుభవరాహిత్యంతో పరిపాలనలో లోపాలు.. అవినీతి.. మహంతపై పెరిగిన వ్యతిరేకత వెరసి ఏజీపీ పతనం వేగవంతమైంది. నిజానికి ఏజీపీ ఆలోచనల నుంచే.. అస్సాంలో బీజేపీ ఎదిగిందనే అభిప్రాయాలు లేకపోలేదు. కాలక్రమంలో ఏజీపీకి చెందిన కీలక నేతలు బీజేపీలోకి వెళ్లారు. ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర మాజీ మంత్రి బిజోయ్ చక్రవర్తి కూడా అలాంటి నేతల్లో కొందరు. అస్తిత్వం కోసం ఏజీపీ అనేక పొత్తులను పరీక్షించింది. బీజేపీ ప్రధాన శక్తిగా మారడంతో.. ఆ పార్టీతో కలిసి నడుస్తోంది. 2016లో బీజేపీతో పొత్తుతో.. 14 స్థానాలను సాధించింది. 

పౌరసత్వ సవరణ చట్టం-2019తో మళ్లీ ఈ పొత్తు విఫలమైంది. ఆ తర్వాతి కాలంలో కుదిరిన రాజీతో తిరిగి బీజేపీతో జతకట్టింది. ప్రస్తుతం 9 మంది ఎమ్మెల్యేలున్న ఏజీపీ.. హిమంత బిశ్వ శర్మ సర్కారులో భాగంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ప్రపుల్ల పోటీ చేయలేదు. పార్టీ అధ్యక్షుడిగా అతుల్ బోరా ఉన్నారు. 2024లో బార్‌పేట లోక్‌సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. దీంతో.. రెండు దశాబ్దాల తర్వాత ఆ పార్టీకి ఓ ఎంపీ సీటు దక్కినట్లైంది. పార్టీ తొలినాళ్లలో ప్రభుత్వంలో ఉన్న దినేశ్ గోస్వామి, భృగు భూయాన్ వంటి కీలక నేతల అకాల మరణం పార్టీకి తీరని నష్టమేనని చెప్పవచ్చు. క్రమంగా గ్రాఫ్ పడిపోతున్న ఏజీపీ భవిష్యత్‌లో నిలదొక్కుకుంటుందా? లేదా.. పలు ప్రాంతీయ పార్టీల్లాగా కనుమరుగైపోతుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. 
-హెచ్.కమలాపతిరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement