breaking news
AGP
-
ఒక ఊపు ఊపిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది?
అస్సాం గణ పరిషత్..! ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలన విజయంతో రాజకీయాల్లో ఓ ఊపు ఊపిన ఏజీపీ ఇప్పుడు చతికిలపడిపోయిందా? విద్యార్థి నేతలు నడిపిన ఉద్యమంతో.. అధికారంవైపు అడుగులు వేసి.. రికార్డులు సృష్టించిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది? నాలుగు దశాబ్దాల క్రితం క్రిస్మస్కు ముందు అస్సాంలో అధికారాన్ని చేపట్టిన ఈ పార్టీ.. ఇప్పుడు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎందుకు తంటాలు పడుతోంది? ఒకప్పుడు అస్సాం రాజకీయాలను పూర్తిగా మార్చేసిన ఏజీపీ ఇప్పుడు పతనం అంచుల్లో ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.నాలుగు దశాబ్దాల క్రితం.. అంటే.. 1985 అక్టోబరు 14న భారత రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అస్సాం గణ పరిషత్ పేరుతో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చరిత్రలో విద్యార్థులు, విద్యార్థి ఉద్యమ నాయకులు నేరుగా రాజకీయాల్లోకి వచ్చి, అదే సంవత్సరం సరిగ్గా క్రిస్మస్ ఈవ్ రోజున.. అంటే.. 1985 డిసెంబరు 24న అధికారాన్ని చేపట్టిన అరుదైన ఘట్టం చోటుచేసుకుంది అప్పుడే..! ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అడ్డుకుని, స్వదేశీయుల అస్తిత్వాన్ని కాపాడేందుకు అప్పట్లో విద్యార్థులు చేసిన ఉద్యమమే.. వారిని అస్సాంలో అధికారం వైపు నడిపించింది. నిజానికి ఇప్పుడు ఎన్నో దేశాల్లో జెన్-జీ ఉద్యమాలు జరుగుతున్నా.. చైనాలోని తియానన్మనెన్ స్క్వేర్ విద్యార్థి ఉద్యమం చరిత్ర పుటల్లో నిలిచినా.. అస్సాం విద్యార్థుల ఉద్యమం ప్రజాస్వామ్య చరిత్రలో ఓ విప్లవమేనని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా ఆరేళ్ల పాటు జరిగిన అస్సాం విద్యార్థి ఉద్యమంలో రెండు విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత.. 1985 ఆగస్టు 15న ఈ రెండు విద్యార్థి సంఘాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. దాని ప్రకారమే అదే ఏడాది అక్టోబరు 14న అస్సాం గణ పరిషత్ పార్టీని ఏర్పాటు చేశాయి. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘన విజయం సాధించింది. క్రిస్మస్ ఈవ్ రోజున అధికార పగ్గాలను చేపట్టింది. అదేరోజున దేశంలోనే అత్యంత యువ ముఖ్యమంత్రిగా ప్రపుల్లకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అలా ఏజీపీ ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంది. కాలేజీ నుంచి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన నేత కూడా ప్రపుల్ల కావడం గమనార్హం..! ఆ సమయంలో ఆయన వయసు 33 సంవత్సరాలే..!ఏజీపీ ప్రస్తానం తెలుసుకోవాలంటే.. 70లలో జరిగిన పరిణామాలను పరిశీలించాల్సిందే..! 1971లో బంగ్లాదేశ్ అవతరణ జరిగాక.. లక్షల మంది భారత్‌కు అక్రమంగా వలస వచ్చారు. ఇప్పటికీ అస్సాంలో అక్రమ వలసల సమస్య తీవ్రస్థాయిలో ఉంది. అక్రమ వలసలు ఓ ముగింపు లేని సమస్యగా మారిపోయాయి. 1971లో భారత్‌లోకి చొరబడ్డ అక్రమ వలసదారులకు స్థానికులుగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తుండడంతో.. విద్యార్థి సంఘాలు అప్రమత్తమయ్యాయి. ఈ వలసల కారణంగా వెనకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగడం మొదలైంది. 1979 మార్చిలో లోక్‌సభ సభ్యుడు హీరాలాల్ పట్వారీ మరణంతో జరిగిన ఉప ఎన్నికలో.. వేల మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు ఓటర్ల జాబితాలో చోటు లభించిన విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో.. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. అదే ఏడాది జూన్‌లో ఏఏఎస్‌యూ పిలుపునిచ్చిన బంద్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దాంతో.. మరో కీలక విద్యార్థి సంఘం అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ కూడా ఉద్యమంలో భాగమైంది. అలా.. 1979 నుంచి 1985 ఆగస్టు వరకు విద్యార్థులు నిరంతరాయంగా తమ పోరాటాన్ని సాగించారు. ఈ సుదీర్ఘ ఉద్యమంతో దిగివచ్చిన అప్పటి కేంద్ర ప్రభుత్వం.. విద్యార్థి నాయకుల డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. 1985 ఆగస్టు 15న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 1971 తరువాత అస్సాంలోకి ప్రవేశించిన వారిని బేషరతుగా బంగ్లాదేశ్‌కు తిప్పిపంపాలి. 1966–71 మధ్యకాలంలో వలస వచ్చిన వారికి మాత్రం షరతులతో కూడిన పౌరసత్వం ఇవ్వాలి. ఈ విజయంతో రెండు విద్యార్థి సంఘాలు కలిసి అస్సాం గణ పరిషత్గా రాజకీయ పార్టీని నెలకొల్పాయి. అస్సాం సాహిత్య సభ, అస్సాం జాతీయవాద దళ్, పూర్వాంచల్య లోక్ పరిషత్‌తోపాటు పలు ఉద్యోగ సంఘాలు కూడా ఏజీపీతో జతకట్టాయి. పార్టీ అధ్యక్షుడిగా ప్రపుల్ల కుమార్ మహంతా ఎన్నికయ్యారు.పార్టీగా ఆవిర్భవించిన వెంటనే జరిగిన ఎన్నికల్లో అస్సాం గణ పరిషత్ అఖండ విజయాన్ని సాధించింది. నిజానికి ఏజీపీ నేతలు ఆ ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేశారు. ఘన విజయం తర్వాత ఏజీపీ గొడుగు కిందకు వచ్చారు. అంటే.. ఏజీపీ ఓ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందక ముందే.. 126 స్థానాలకు గాను 92 చోట్ల స్వతంత్రులుగా విద్యార్థి సంఘాల నేతలు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లకు పరిమితమైంది. ఫలితంగా అస్సాం రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. ప్రపుల్లకుమార్ మహంత సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్యమం ముగిసిన వెంటనే.. ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడం భారతదేశ చరిత్రలోనే అది మొదటిసారి. ఆ తర్వాతి కాలంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా, తెలంగాణలో బీఆర్ఎస్ ఆ ఘనతను సాధించాయి.అధికార పగ్గాలను చేపట్టినకప్పటికీ.. అనుభవ లోపం కారణంగా పరిపాలనలో ఏజీపీ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ప్రపుల్ల కుమార్ నేతృత్వంలోని సర్కారులో భృగు కుమార్ భూయాన్, కేశబ్ మహంత, అతుల్ బోరా లాంటి యువ నేతలు మంత్రులుగా కొనసాగారు. అధికారంలోకి వచ్చినప్పటికీ అనుభవం లేకపోవడంతో చోటుచేసుకున్న పరిణామాలు.. ఏజీపీ సర్కారును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు దారితీసింది. ఉల్ఫా ఉగ్రవాదం, ప్రభుత్వ పెద్దల అవినీతి కారణంగా.. 1980లో కేంద్రం అస్సాం సర్కారును రద్దు చేసింది. 1991లో ఏజీపీ చీలిపోయింది. నూతన్ ఏజీపీ ఏర్పాటైంది. దాంతో.. ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ పతనం దిశలో అడుగులు వేసింది. 1991లో జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 19 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారపగ్గాలను చేపట్టింది.విడిపోయి ఓటమిపాలైన ఏజీపీ నేతలు తమ తప్పును తెలుసుకుని, మళ్లీ కలిశారు. 1996 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. 59 స్థానాల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చారు. అత్తెసరు మెజారిటీ కావడంతో.. పరిపాలన సవ్యంగా సాగలేదనే చెప్పలి. 2001లో ఏజీపీ మరోమారు పరాజయం పాలవ్వగా.. కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అస్సాంలో బలమైన పునాదులను వేసుకుంది. అయితే.. బీజేపీ వైపు మళ్లే ప్రతీ ఓటు.. ఏజీపీ ఖాతా నుంచి మైనస్ కావడం మొదలైంది. అలా బీజేపీ బలపడుతున్న కొద్దీ.. ఏజీపీ పునాదులు దెబ్బతినడం మొదలైంది. అనుభవరాహిత్యంతో పరిపాలనలో లోపాలు.. అవినీతి.. మహంతపై పెరిగిన వ్యతిరేకత వెరసి ఏజీపీ పతనం వేగవంతమైంది. నిజానికి ఏజీపీ ఆలోచనల నుంచే.. అస్సాంలో బీజేపీ ఎదిగిందనే అభిప్రాయాలు లేకపోలేదు. కాలక్రమంలో ఏజీపీకి చెందిన కీలక నేతలు బీజేపీలోకి వెళ్లారు. ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర మాజీ మంత్రి బిజోయ్ చక్రవర్తి కూడా అలాంటి నేతల్లో కొందరు. అస్తిత్వం కోసం ఏజీపీ అనేక పొత్తులను పరీక్షించింది. బీజేపీ ప్రధాన శక్తిగా మారడంతో.. ఆ పార్టీతో కలిసి నడుస్తోంది. 2016లో బీజేపీతో పొత్తుతో.. 14 స్థానాలను సాధించింది. పౌరసత్వ సవరణ చట్టం-2019తో మళ్లీ ఈ పొత్తు విఫలమైంది. ఆ తర్వాతి కాలంలో కుదిరిన రాజీతో తిరిగి బీజేపీతో జతకట్టింది. ప్రస్తుతం 9 మంది ఎమ్మెల్యేలున్న ఏజీపీ.. హిమంత బిశ్వ శర్మ సర్కారులో భాగంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ప్రపుల్ల పోటీ చేయలేదు. పార్టీ అధ్యక్షుడిగా అతుల్ బోరా ఉన్నారు. 2024లో బార్పేట లోక్‌సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. దీంతో.. రెండు దశాబ్దాల తర్వాత ఆ పార్టీకి ఓ ఎంపీ సీటు దక్కినట్లైంది. పార్టీ తొలినాళ్లలో ప్రభుత్వంలో ఉన్న దినేశ్ గోస్వామి, భృగు భూయాన్ వంటి కీలక నేతల అకాల మరణం పార్టీకి తీరని నష్టమేనని చెప్పవచ్చు. క్రమంగా గ్రాఫ్ పడిపోతున్న ఏజీపీ భవిష్యత్‌లో నిలదొక్కుకుంటుందా? లేదా.. పలు ప్రాంతీయ పార్టీల్లాగా కనుమరుగైపోతుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -హెచ్.కమలాపతిరావు -
ఏజీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న అసోం గణ పరిషత్ (ఏజీపీ) 25 మంది అభ్యర్థులతో తొలి జాబితాను గురువారం ప్రకటించింది. బీజేపీ పోటీ చేసే చోట తమ పార్టీ స్నేహపూర్వక పోటీకి దిగుతుందని ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా తెలిపారు. కాగా, తమిళనాడులో తన పొత్తు కోసం తీవ్రంగా కుస్తీలు పట్టిన డీఎంకే, బీజేపీలకు దేశీయ ద్రావిడ ముర్పోక్కు కళగం(డీఎండీకే) అధినేత విజయకాంత్ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు గురువారం చెన్నైలో స్పష్టం చేశారు. -
ఏజీపీతో బీజేపీ ఎన్నికల పొత్తు
గువాహటి: రానున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికలో కలసి పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ, అస్సాం గణపరిషత్ నిర్ణయించాయి. రాష్ట్రంలోని తరుణ్ గొగోయ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి. మాజీ సీఎం ప్రఫుల్లా కుమార్ మహంతా సహా ఏజీపీ అధినాయకత్వం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో బుధవారం ఢిల్లీలో జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఒకటి, రెండు రోజుల్లో ఇరు పార్టీలు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించి, ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసేది ప్రకటిస్తాయి. ఆ తర్వాత కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని వెల్లడిస్తాయి. చర్చల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి సర్వానంద సోనోవాల్, ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా కూడా పాల్గొన్నారు. బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సోనావాల్ను ఇదివరకే ప్రకటించింది. సోనోవాల్ గతంలో ఏజీపీలో పనిచేసి బీజేపీలోకి వచ్చినవారే. ఆయన ఏజీపీ తరఫున 2004 నుంచి 2009 వరకు ఎంపీగా కూడా పనిచేశారు. ఇరు పార్టీల మధ్య లాంఛనంగా పొత్తు కుదిరినా, సీట్ల పంపకాలు తేలాల్సి ఉందని ఏజీపీ వర్గాలు తెలిపాయి. మొత్తం 126 రాష్ట్ర అసెంబ్లీ సీట్లలో ఏజీపీ 40 సీట్లు డిమాండ్ చేస్తుండగా, 20 సీట్లకు మించి ఇవ్వమని బీజేపీ అంటోంది. ఏజీపీ, బీజేపీ ఎన్నికల్లో కలసి పోటీ చేయడం ఇదే మొదటి సారి కాదు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయగా బీజేపీకి నాలుగు సీట్లు, ఏజీపీకి ఒక్కసీటు వచ్చాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇరుపార్టీలు కలసి పోటీ చేయాలని అనుకున్నాయి. కలసి పోటీ చేయడం కలసి రావడం లేదని భావించిన ఏజీపీ చివరి నిమిషంలో బీజేపీకి దూరం జరిగింది. ఆ ఎన్నికల్లో 14 లోక్‌సభ సీట్లకుగాను బీజేపీకి ఏడు సీట్లురాగా, ఏజీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. -
పదేపదే వాయిదాలు కోరతారెందుకు?
ఇరు రాష్ట్రాల జీపీలు, ఏజీపీలపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కేసుల విచారణ సందర్భంగా ఇరురాష్ట్రాల ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదులు(ఏజీపీ) పదేపదే వాయిదాలు కోరుతుండటంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోరిన వివరాల్ని అధికారులు సకాలంలో అందించడం లేదన్న కారణాన్ని సాకుగా చూపుతూ తరచూ వాయిదాలు కోరుతుండటాన్ని తప్పుపట్టింది. విచారణకు సహకరించని కిందిస్థాయి అధికారులను బాధ్యులుగా చేస్తూ ఆయాశాఖల ముఖ్య కార్యదర్శులకు భారీ జరిమానా విధిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. చిత్తూరు జిల్లాల్లో ఓ భూవివాదానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ గతవారం విచారణకొచ్చినప్పుడు పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు గడువుకావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇందుకు జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం అనుమతినిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకొచ్చింది. ఈసారి కూడా ప్రభుత్వ న్యాయవాది వివరాలు సమర్పించేందుకు గడువు కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. ఇలా పదేపదే వాయిదాలు కోరడం సరికాదని పేర్కొంది. అయితే ప్రభుత్వ న్యాయవాది, వివరాల సమర్పణకు చివరి అవకాశమివ్వాలని కోరగా, ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. -
ఏనుగు చతికిలబడిపోయింది
ఒకప్పుడు ఆ ఏనుగు కదిలితే అందరూ గడగడలాడిపోయేవారు. కానీ అదే ఏనుగు ఇప్పుడు పూర్తిగా చతికిలబడిపోయింది. ఎంత చేసినా మళ్లీ లేచి నిలబడటం లేదు. ఏనుగుని నిలబెట్టేంత బలం ఎవరికీ లేదు. ఈశాన్య భారతంలోని అసొం రాష్ట్ర రాజకీయాలను మూడు దశాబ్దాలు శాసించిన అసొం గణపరిషత్ పరిస్థితి దాని ఎన్నికల గుర్తైన ఏనుగు లాగానే ఉంది. అసొం గణపరిషత్ (ఏజీపీ) లేవలేదు. లేస్తే నడవలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు 62 ఏళ్ల ప్రఫుల్ల కుమార్ మహంత కూడా పార్టీకి కొత్త ఊపిరి నింపలేకపోతున్నారు. నింగికెగిరి.... నేలరాలిన నేత.... నిజానికి ప్రఫుల్ల కుమార్ మహంత దేశంలో చాలా విలక్షణమైన ముఖ్యమంత్రి. కాలేజీ హాస్టల్ నుంచి సరాసరి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారాయన. కనీసం వార్డు మెంబర్ గానైనా పోటీ చేయకుండా ఏకంగా సీఎం అయ్యారాయన. ముఖ్యమంత్రి అయిన తరువాత పెళ్లి చేసుకున్న ఏకైక సీఎం బహుశః ఆయనేనేమో. 1980 వ దశకంలో అసొం నుంచి విదేశీయులను తరిమేయాలన్న డిమాండ్ తో జరిగిన భారీ ఉద్యమం నుంచి ప్రఫుల్ల కుమార్ మహంత పుట్టుకొచ్చారు. గువహటి విశ్వవిద్యాలయంలో మామూలు విద్యార్థిగా ఉన్న మహంత ఈ ఉద్యమంలో అసొం విద్యార్థి సంస్థ 'ఆసు' నాయకుడిగా ఉద్యమానికి సారథ్యం వహించారు. 1985 లో అసొం ఒప్పందం తరువాత ఈ ఉద్యమసంస్థలన్నీ అసొం గణపరిషత్ గా ఏర్పడ్డాయి. 1986 లో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ అనుభవరాహిత్యం, అంతర్గత కలహాలతో ఏజీపీ కొద్ది రోజులకే అన్ పాపులర్ అయిపోయింది. ప్రఫుల్ల కుమార్ మహంత తన లెక్చరర్ జయశ్రీ గోస్వామిని వివాహం చేసుకోవడం, ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన వివాహేతర సంబంధం బట్టబయలు కావడం వంటి సంఘటనలు పార్టీని మరింత దిగజార్చాయి. అయిదేళ్ల తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 1997 లో మళ్లీ అధికారంలోకి వచ్చినా ఏజీపీ తీరు మారలేదు. పార్టీ నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరో వైపు ఉల్ఫా ఉగ్రవాదం కూడా ప్రబలింది. 2000 లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచీ గత పదమూడేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నానాటికీ బలోపేతం అవుతున్నారు. పతనం దిశగా పరుగు 2004 నుంచి జరిగిన అన్ని లోకసభ ఎన్నికల్లో ఏజీపీ పతనం దిశగా పరుగు కొనసాగిస్తూనే వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 సీట్లలో ఏజీపీ కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకుని రాజకీయ మైదానం నుంచి దాదాపుగా వైదొలగింది. బంగ్లాదేశీ వలసదారులకు ప్రాతినిథ్యం వహించే ఆలిండియా యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్ ప్రధాన ప్రతిపక్షం అయింది. బంగ్లాదేశీ వ్యతిరేక ఉద్యమం నడిపిన అసొం లో బంగ్లాదేశీ వలసదారులే ప్రధాన రాజకీయ ప్రతిపక్షం అయి కూచోవడం విడ్డూరమే కాదు. విషాదం కూడా. మరో వైపు బిజెపి నానాటికీ బలపడుతోంది. ఇదే కొనసాగితే రాష్ట్ర రాజకీయాల్లో ఏజీపి కేవలం పేకాటలో జోకర్ గా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం లోకసభలో ఏజీపీకి ఒకే ఒక్క సీటు ఉంది. ఈ సారి ఎన్నికల్లో అది కూడా నిలబెట్టుకుంటుందా అన్నది అనుమానమే. రాజకీయంగా పరాజితుడైన నాయకుడిగా ప్రఫుల్ల మహంత నిలిచిపోతారా? దేశంలో పుట్టి, గిట్టిన అనేక పార్టీల్లో ఏజీపీ కూడా ఒకటిగా మిగిలిపోతుందా? లేక ఏదైనా అద్భుతం జరిగి ఏనుగు లేచి నిలబడి, మళ్లీ పరుగులు తీస్తుందా? జస్ట్ 40 రోజులాగండి.... తెలిసిపోతుంది. -
ఏపీని విభజించవద్దు
సాక్షి, న్యూఢి ల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దని జేడీయూ, అస్సాం గణపరిషత్(ఏజీపీ) డిమాండ్ చేశాయి. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్-సేవ్ ఇండియా’ పేరిట ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ధర్నా కు జేడీయూ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణసింగ్, అస్సాం గణపరిషత్(ఏజీపీ) ప్రధాన కార్యదర్శి, ఎంపీ జోసఫ్టోకో, నార్త్ఈస్ట్ ఫెడరల్ అధ్యక్షుడు కుమార్‌దీపక్, సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వాసిరెడ్డి కృష్ణారావు తదితరులు మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని వశిష్ట నారాయణ్ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు జోసెఫ్ టొప్పొ ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలన్నీ సమైక్య ఉద్యమానికి మద్దతిస్తాయని చెప్పారు. రాష్ట్ర విభజన ఆగేవరకు పోరాటం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరివరకు పోరాటం కొనసాగుతుందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి పునరుద్ఘాటించారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభం కాకపోయినా... విభజన జరిగిపోయిందని, ప్రాంత ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్యాకేజీల కోసం పోరాడాలంటూ పిరికిపంద కేంద్ర మంత్రులు సూచనలిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆందోళనలో విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి రవితేజ, ఢిల్లీ జేఏసీ నేతలు గల్లా సతీష్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమైక్యవాదులు, ఎస్కే వర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. సమైక్యవాదుల బస్సులను అడ్డుకున్న యూపీ పోలీసులు: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం నిర్వహించిన విశాలాంధ్ర మహాసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి 46 బస్సుల్లో సమైక్యవాదులు బయలుదేరగా, ఆగ్రా సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌హైవే వద్ద నిలిపివేశారు. తర్వాత పది బస్సులను అనుమతించడంతో వారు ధర్నాకి హారయ్యారు. -
సమైక్యాంధ్రకు ఏజీపీ, జేడీయూ మద్దతు
-
సమైక్యాంధ్రకు ఏజీపీ, జేడీయూ మద్దతు
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మరో రెండు పార్టీలు వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని అసోం గణపరిషత్, జేడీయూ పార్టీలు డిమాండ్ చేశాయి. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వేలాదిమంది సమైక్యవాదులు శనివారం ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏజీపీ, జేడీయూ మద్దతు తెలిపాయి. మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమని అసోం గణపరిషత్ పార్టీ ఎంపీ జోసఫ్‌టోపో అన్నారు. కాంగ్రెస్ విభజించు-పాలించు సూత్రాన్ని అమలుచేస్తోందని ఆయన విమర్శించారు. సమైక్య ఉద్యమకారులకు తమ సహకారం ఉంటుందని జేడీయూ బీహార్ శాఖ అధ్యక్షుడు వశిస్టు నారాయణ్ అన్నారు. కేంద్రమంత్రులు సీమాంధ్రలో ద్రోహులపాత్ర పోషిస్తున్నారని విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ చక్రవర్తి విమర్శించారు.


