బిడ్డకు సరైన రీతిలో పాలు పట్టడం ఎలాగంటే..! | Health Tips: Exclusive Breastfeeding Guide for Mothers | Sakshi
Sakshi News home page

అమ్మపాలు అందుతున్నాయా? బిడ్డకు సరైన రీతిలో పాలు పట్టాలంటే..

Jul 5 2026 5:03 PM | Updated on Jul 5 2026 5:13 PM

Health Tips: Exclusive Breastfeeding Guide for Mothers

ఇంట్లోకి కొత్త అతిథిగా ఓ చిన్నారి రావడం ఒక సంతోషకరమైన విషయం. ఈ సంతోషంతో పాటు చాలా రకాల సందేహాలూ వస్తుంటాయి. మరీ ముఖ్యంగా కొత్తగా తల్లి అయిన మహిళను అనేక సందేహలు వెంటాడుతుంటాయి. బిడ్డకు తాను సరిగానే పాలు పడుతున్నానా, అవి బిడ్డ ఒంటికి పడుతున్నాయా... బిడ్డ ఆరోగ్యకరంగా బరువు పెరుగుతుందా లేదా అనే డౌట్స్‌ చాలా సహజం. కొత్త తల్లి బిడ్డకు సరిగా పాలు పడుతోందా లేదా అనే సందేహాలతో పాటు బిడ్డకు సరైన రీతిలో రొమ్ముపాలు పట్టడం ఎలాగో తెలుసుకోండి. 

మనదేశంలో చిన్నారులు పుట్టినప్పుడు 2.5 కిలోల నుంచి 3 కిలోల వరకు బరువుంటారు. అప్పుడే పుట్టిన బిడ్డ బరువు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదా... పేరెంట్స్‌ జీన్స్, తల్లి ఆహారపు అలవాట్లు, గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు వచ్చిన ఆరోగ్య సమస్యలు, తల్లి బరువు  వంటి అనేక అంశాలపై  ఆధారపడి ఉంటుంది. 

పిల్లలు పుట్టాక మొదటి వారంలో– పుట్టినప్పుడు ఉన్న బరువు కంటే కాస్తంత తగ్గుతారు. అంటే మొదటి వారం పదిరోజుల్లో 5 శాతం నుంచి 10 శాతం బరువు తగ్గుతారు. ఆ తర్వాత నుంచి (రెండో వారం నుంచి) మళ్లీ క్రమేణా బరువు పెరగడం మొదలవుతుంది. మొదటి మూడు నెలల్లో దాదాపు రోజుకు 20 నుంచి 30 గ్రాములూ, నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు రోజుకు 10 నుంచి 15 గ్రాముల వరకు పిల్లలు బరువు పెరుగుతారు. చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. పాపలు పుట్టిన నాటితో పోలిస్తే మొదటి ఆరు నెలలలో రెట్టింపు బరువు (డబుల్‌), ఏడాది నాటికి మూడు రెట్లు (ట్రిపుల్‌) తప్పనిసరిగా పెరగాలని లేదు. అలా పెరగడానికి, పెరగకపోవడానికి అనేక అంశాలు కారణమవుతాయి.

చిన్నారులు తగినంత బరువు పెరగడం లేదంటే... 
పిల్లలు బరువు పెరగకుండా క్రమంగా తగ్గుతూ పోతుంటే లోపం ఎక్కడుందనేని జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రధానంగా తల్లి పాలు సరిపోకపోవడమో లేదా బిడ్డ సరిగా తాగకపోవడమో లేదా చిన్నారి పూర్తిగా పాలు తాగకుండా కొద్దిగా తాగి పడుకుంటూ ఉండటమో కారణం కావచ్చు. బిడ్డ పాలు తాగేప్పుడు రెండు రకాల పాలు వస్తాయి. మొదటిది తొలిగా వచ్చే పాలు. వీటిని ఫోర్‌ మిల్క్‌ అంటారు. రెండోది మలిసారి పాలు... వీటిని హైండ్‌ మిల్క్‌ అంటారు. పాప కాసిన్ని పాలు తాగక వచ్చేవే హైండ్‌ మిల్క్‌. వాస్తవానికి ఫోర్‌ మిల్క్‌ కంటే... హైండ్‌ మిల్క్‌ చాలా బలవర్ధకమైనవి. ఇందులోని క్యాలరీలు బరువు పెరగడానికి దోహదపడతాయి. 

ఈ ఫోర్‌ మిల్క్‌ను ప్రసవం కాగానే స్రవించే ముర్రుపాలతో పొరబాటు పడవద్దు. ముర్రుపాలు వేరు, ఫోర్‌ మిల్క్‌ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు బిడ్డకు చాలా మంచి చేస్తాయి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి. ఫోర్‌ మిల్క్‌ అంటే... ప్రతిసారీ పాలు తాగడం మొదలు పెట్టగానే మొదట స్రవించేవి. ఓ పది–పదిహేను గుటకల తర్వాత స్రవించేవి హైండ్‌ మిల్క్‌.

చిన్నారి ఆరోగ్యంగా బరువు పెరగడానికి అవసరమైన జాగ్రత్తల్లో కొన్ని... 

పాపకు ప్రతి రెండు–మూడు గంటలకు ఓమారు పాలు తాగించడం 

ఓ రొమ్ము పట్టించినప్పుడు పాప ఆ రొమ్ము నుంచి పాలు పూర్తిగా తాగిందో లేదో నిర్ధారణ చేసుకోవడం. అంటే ఒక రొమ్ము నుంచి పాలు తాగాక పాపకు అదే రొమ్ము అందిస్తే ముఖం తిప్పుకోవడం, రొమ్ము అందుకోకపోవడం చేస్తుంది) 

ఓ రొమ్ములోని పాలు పూర్తిగా పట్టించాకే రెండో రొమ్ము కూడా అందించడం రెండు రొమ్ముల్లోని పాలు ఇవ్వాలంటూ ఒక రొమ్ములోని ΄పాలు కాసిన్ని, మరో రొమ్ములోని పాలు మరికాసిన్ని ఇవ్వవద్దు

పడుకునే సమయంలో తప్పనిసరిగా పాప పక్కనే పడుకోవడం. (పాప పక్కనే ఉండటం వల్ల ప్రోలాక్టిన్‌ హార్మోన్‌ స్రవించడం పెరిగి పాలు ఎక్కువగా వస్తాయి) 

బిడ్డ స్పర్శ ఎప్పుడూ తల్లికి తగిలేలా (స్కిన్‌ టు స్కిన్‌ కాంటాక్ట్‌ ఉండేలా) చూసుకోవడం  మీ పాపకు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోడానికి పాప రోజులో ఎన్నిసార్లు పక్క తడుపుతోంది అన్న విషయమూ ఓ పరోక్ష సూచనే. బిడ్డ పగలు కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు పక్కతడుపుతుంటే తనకు పాలు సరిపోతున్నాయని అనుకోడానికి ఓ సూచనగా తీసుకోవచ్చు.
డా. శివనారాయణ రెడ్డి వెన్నపూస, సీనియర్‌ నియోనేటాలజిస్ట్‌ – పీడియాట్రీషియన్‌  

(చదవండి: వైద్యవృత్తిని చేపట్టిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌..!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement