Assam: ఎగసిపడిన కెరటం.. అస్సాం గణ పరిషత్‌! | Story About Rise And Fall of Asom Gana Parishad During 5 State Election | Sakshi
Sakshi News home page

Assam: ఎగసిపడిన కెరటం.. అస్సాం గణ పరిషత్‌!

Mar 25 2026 12:13 PM | Updated on Mar 25 2026 1:21 PM

Story About Rise And Fall of Asom Gana Parishad During 5 State Election

అస్సాం రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం అస్సాం గణ పరిషత్ (ఏజీపీ). ఒకప్పుడు అస్సాం అంటే ఏజీపీ అనే స్థాయి నుండి ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పోరాడే పరిస్థితికి  చేరుకుంది. ఆ పార్టీ ప్రస్థానం ఎన్నో ప్రాంతీయ పార్టీలకు పాఠాలు నేర్పుతుంది. అస్సాం గణ పరిషత్ సాధారణ రాజకీయ పార్టీ కాదు. ఇది ఒక సుదీర్ఘ పోరాటం నుంచి పుట్టిన పార్టీ. 1979 నుంచి 1985 వరకు అస్సాంలో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన భారీ ఉద్యమం దీనికి పునాది. 

ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటం ఫలితంగా అస్సాం ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే విద్యార్థి నేతలు ప్రఫుల్ల కుమార్ మహంత నాయకత్వంలో ఏజీపీని స్థాపించారు. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. కేవలం 32 ఏళ్ల వయసులోనే ప్రఫుల్ల కుమార్ మహంత ముఖ్యమంత్రి కావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఉద్యమ ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చిన ఏజీపీ ప్రజల ఆశలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా ఏ అక్రమ వలసల అంశంపై అయితే పార్టీ పుట్టిందో ఆ సమస్యను పరిష్కరించడంలో పాలకులు చొరవ చూపలేకపోయారు. దీనికి తోడు పార్టీ అంతర్గత కుమ్ములాటలు అవినీతి ఆరోపణలు పాలనా వైఫల్యాలు పార్టీని బలహీనపరిచాయి. నేతల మధ్య పెరిగిన ఆధిపత్య పోరు కారణంగా కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన నేతలు క్రమంగా పదవుల కోసం పాకులాడటం ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసింది.

దెబ్బతీసిన స్నేహం..
ఏజీపీ పతనానికి ప్రధాన కారణం జాతీయ పార్టీలతో అది చేసిన స్నేహమనే చెప్పొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ ప్రాంతీయ పార్టీ కాలక్రమేణా తన ప్రత్యేకతను కోల్పోయింది. అస్సాంలో బీజేపీ బలోపేతం కావడం ఏజీపీకి శాపంగా మారింది. బీజేపీ జాతీయవాదం ముందు ఏజీపీ ప్రాంతీయ వాదం వెలవెలబోయింది. చివరకు అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి రావడం ఆ పార్టీకి మరింత నష్టాన్ని మిగిల్చింది. పౌరసత్వ సవరణ చట్టం  వంటి కీలక అంశాల్లో ఏజీపీ ద్వంద్వ వైఖరి అవలంబించడం వల్ల తన సంప్రదాయ ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయింది.

ఏజీపీలో మొదటి నుండి సామూహిక నాయకత్వం కొరవడింది. ప్రఫుల్ల కుమార్ మహంత వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టడం పార్టీలో చీలికలకు దారితీసింది. సరైన రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడింది. సమర్థులైన నాయకులు చాలా మంది బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. పార్టీ కేడర్ సైతం తమ భవిష్యత్తు కోసం జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపారు. నేడు ఏజీపీ కేవలం ఒక జూనియర్ భాగస్వామిగా మాత్రమే మిగిలిపోయింది. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే శక్తిని ఆ పార్టీ కోల్పోయింది.

 

ఏజీపీ పతనం ఒక హెచ్చరిక..
ఏజీపీ పతనం దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక హెచ్చరిక. కేవలం భావోద్వేగపూరిత ఉద్యమాలతో అధికారంలోకి రావడం సులభమే కానీ ఆ భావజాలాన్ని పాలనలో చూపిస్తూ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టమని ఈ పార్టీ నిరూపించింది. సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యం అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని ఏజీపీ చరిత్ర చెబుతోంది. అస్సాం ప్రజలు ఇప్పుడు ప్రాంతీయ అస్తిత్వం కోసం సరికొత్త వేదికలను వెతుక్కుంటున్నారు. 

ఏజీపీ మాత్రం తన గత వైభవం వైపు దీనంగా చూస్తోంది. ప్రస్తుతం అస్సాం అసెంబ్లీలో ఏజీపీ సంఖ్య నామమాత్రంగా మారింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే స్థాయిని కూడా ఆ పార్టీ కోల్పోయింది. బీజేపీ వేవ్ లో తనను తాను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు ఆ పార్టీ దయనీయ స్థితిని సూచిస్తున్నాయి. మళ్లీ పుంజుకోవాలంటే పార్టీ మూలాల్లోకి వెళ్లి ఉద్యమ స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంగానే కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement