తాడేపల్లి : ఏపీలొ రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 29వ తేదీ) పార్టీ లీగల్ సెల్ నేతలతో ఆయన జూమ్ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై చర్చించారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడాన్ని తట్టుకోలేక పార్టీ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు. నిరంకుశ పాలన, నియంత పాలనకు ఇంతకు మించిన నిదర్శనం ఉంటుందా?, చంద్రబాబు, లోకేష్‌లు బరితెగించి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వంతపాడుతున్న పోలీసుల చర్యలను ధీటుగా ఎదుర్కుందాం.
చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. క్యాడర్‌కు అండగా నిలుద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగంపై గట్టిగా పోరాడుతున్న పార్టీ లీగల్ సెల్‌కు అభినందనలు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీకి పొట్టేళ్ళ తలలతో హారం వేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఈ మధ్య ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?,
కమ్యూనిస్ట్ నాయకుడు హక్కుల కోసం పోరాడితే పీడీ యాక్ట్ పెట్టారు. జగన్ మరింత పట్టుదలతో పార్టీని నడిపిస్తున్నారు. ప్రతి ప్రజాసమస్యపై ముందుండి పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కూటమి ప్రభుత్వ దమనకాండను ధీటుగా ఎదుర్కొందాం. వైఎస్సార్సీపీ సైన్యం పోరాట పటిమతో దూసుకెళుతుంది’ అని స్పష్టం చేశారు.


