ఉమ్మడి ఏపీలో 1,200 మంది ఉద్యోగాలు సేఫ్
కారుణ్య నియామకాలను సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం
హైకోర్టు తీర్పును కొట్టేసిన జస్టిస్ అరవింద్‌కుమార్ ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో కారుణ్య నియామకాల కింద తిరిగి విధుల్లోకి తీసుకున్న 1,200 మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు (ఎంపీహెచ్‌ఏ– పురుషులు) సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వీరి నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టింది. జస్టిస్ అరవింద్‌కుమార్, జస్టిస్ అంజారియాలతో కూడిన ధర్మాసనం, ఈ ఉద్యోగులను సర్వీసులో కొనసాగించేందుకు అనుమతిస్తూ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏళ్ల తరబడి న్యాయ పోరాటం
2003లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2,300 ఎంపీహెచ్‌ఏ (పురుష) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు ఇంటర్మీడియట్ +డిప్లొమాను అర్హతగా నిర్ణయించింది. ఆ తర్వాత అర్హతను పదో తరగతి + డిప్లొమాగా మార్చడంతో వివాదం మొదలైంది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా.. 2012లో పదో తరగతి + డిప్లొమా అర్హతనే ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. దీంతో అప్పటికే ఇంటర్ + డిప్లొమా అర్హతతో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న సుమారు 1,200 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు
ఉద్యోగాలు కోల్పోయిన 1,200 మంది ఏళ్లపా టు అందించిన సేవలను పరిగణనలోకి తీసు కున్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, మానవతా దృక్పథంతో 2013లో వారిని కాంట్రాక్ట్ పద్ధతిలో కారుణ్య నియామకాల కింద తిరిగి విధుల్లోకి తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, తెలంగాణ హైకోర్టు ఆ నియామకాలను రద్దు చేసింది.
దీనిపై ఉద్యోగులు, ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ సందర్భంగా 2003 నాటి నియామకాలతో సంబంధం లేకుండా, పూర్తిగా కారుణ్య కారణాల ఆధారంగానే 2013లో వీరిని తిరిగి నియమించామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ స్వతంత్ర నిర్ణయమని అంగీకరించింది.
ఈ నేపథ్యంలో, 2013 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 1,200 మంది ఎంపీహెచ్‌ఏల ఉద్యోగాలను కొనసాగించాలని స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శేఖర్ నాప్డే, మాధవి దివాన్, శ్రీరామ్ భాస్కర్ గౌతమ్ వాదనలు వినిపించారు.


