
సాక్షి, ఢిల్లీ: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం తీర్పును వెలువరించింది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో డీలిమిటేషన్ చేయాలని సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్.. జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి మాత్రమే ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్-26ను ప్రత్యేకంగా వేరుగా చూడలేం. ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత అందుబాటులోకి వచ్చే జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుంది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. రాజ్యాంగం పరిధిలోనే డీలిమిటేషన్ జరగాలి. లేకుంటే ఇలాంటి డిమాండ్లకు వరద గేట్లు ఎత్తినట్లే అవుతుంది. జమ్ముకశ్మీర్‌తో పాటు ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్‌ను కలిపి చూడలేం అని స్పష్టం చేసింది.
