
ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వీభజన కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
రాజ్యాంగ నిబంధనల ప్రకారం 2026 తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ సాధ్యమని స్పష్టీకరణ
ఈ విషయంలో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ–కశ్మీర్‌తో పోల్చుకోవడం సరికాదని వ్యాఖ్య
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వేర్వేరు నిబంధనలు వర్తిస్తాయని వెల్లడి
కేంద్రం నిర్ణయంలో వివక్ష లేదన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచేలా నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)కు కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘ఈ పిటిషన్‌లో చట్టబద్ధత ఏదీ కనబడలేదు. అందుకే దీన్ని డిస్మిస్ చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. 2014 నాటి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను అమలు చేయాలని... దాని ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించేలా ఆదేశించాలని ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ–కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వీభజన కోసం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. ఇదే విషయంలో ఏపీ, తెలంగాణను మినహాయించడం వివక్షేనని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం జమ్మూ–కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్వీభజన నోటిఫికేషన్ నుంచి ఏపీ, తెలంగాణను మినహాయించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3)కి లోబడే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ఉందని, దాని ప్రకారం 2026 తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్వీభజన ప్రక్రియను చేపట్టడం సాధ్యమవుతుందని తేల్చిచెప్పింది.
అనుమతిస్తే ఇక పిటిషన్ల వరద: సుప్రీం ధర్మాసనం
జమ్మూ–కశ్మీర్‌లో ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై పిటిషనర్ చేసిన వివక్ష వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య నియోజకవర్గాల పునర్విభజనలో వర్తించే నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయని, అందుకే జమ్మూకశ్మీర్‌కు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్రాల పరిస్థితులతో సరిపోల్చడం తగదని వ్యాఖ్యానించింది. ఇలాంటి విజ్ఞప్తులను స్వీకరిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి పిటిషన్లు వరదలా కోర్టులను ముంచెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అలాంటి పరిణామాలకు తాము తలవంచలేమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది.